మాచర్లటౌన్ : కొత్త ప్రభుత్వం చిరుద్యోగుల పొట్టకొడుతోంది. ఇంటికో ఉద్యోగం ఇస్తామని వాగ్దానాలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చీరాగానే ఉన్న ఉద్యోగాలు కూడా ఊడగొడుతున్నారు. గ్రామాల్లో ఉపాధి పనుల నిర్వహణలో కీలక మైన ఫీల్ట్ అసిస్టెంట్లను, రైతులకు, వ్యవసాయ శాఖాధికారులకు మధ్య వారధిగా వ్యవహరించే ఆదర్శ రైతులను తొలగిస్తామంటూ ప్రకటించారు. దీంతో అతి తక్కువ గౌరవ వేతనంతో పదేళ్లుగా సేవలందిస్తున్న వీరంతా ఇప్పుడు రోడ్డున పడాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కో మండలంలో దాదాపు 60 మంది ఉపాధి కోల్పోవాల్సి వస్తోంది. గ్రామాల్లోని నిరుద్యోగ యువకులను పదేళ్ల కిందట అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ ఉపాధిహామీ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లుగా విధుల్లోకి తీసుకుంది. ప్రతి మండలంలో 15 నుంచి 20 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. ఉపాధిహామీ పథకంలో కీలక పాత్ర వహించే ఫీల్డ్ అసిస్టెంట్లు ముందుగా ఆయా గ్రామాల్లో పనులను గుర్తిస్తారు.
ప్రతి పనిని మేట్లు, కూలీలతో చేయించి వారికి నగదు చెల్లింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పనుల అంచనాలో కీలక పాత్ర వహించే వీరు పొలాలు, బీడు భూములు, కుంటలు, చెరువులకు సంబంధించిన ప్రతి పనినీ పర్యవేక్షించి అంచనాలు రూపొందిస్తారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విధులు నిర్విహ ంచే వీరికి నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తోంది. రాష్ర్టంలో నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించే పనిలో ఉంది.
ఆదర్శానికీ మంగళం..
వ్యవసాయ శాఖకు సంబంధించి ప్రతి గ్రామంలో ఒక ఆదర్శరైతు ఉంటారు. గ్రామంలోని రైతుల సమస్యలు తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకువెళ్లటం, ప్రతి నెల వ్యవసాయ కార్యాలయంలో జరిగే సమావేశంలో పాల్గొని వ్యవసాయశాఖ సూచనలు, సలహాలను ఆయా గ్రామాల రైతులకు అందించడం వీరి విధి. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు, రైతులకు ఇచ్చే సబ్సిడీ, మట్టి నమూనా సేకరణతో పాటు అనేక బాధ్యతలు నిర్వహిస్తారు. వీరికి గౌరవ వేతనంగా ప్రభుత్వం చెల్లించేది 1000 రూపాయలే. అయినా వీరి సేవలను ఎక్కువగానే వ్యవసాయశాఖ వారు వినియోగించుకుంటారు.
మండలానికి 30 నుంచి 40 మంది వరకు ఆదర్శ రైతులు ఉన్నారు. వీరిని కూడా తొలగించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విశాఖపట్నంలో జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో ఆదర్శరైతులు, ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగించాలని ఆలోచన చేసి అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవటంతో పదేళ్లుగా పని చేస్తూ చాలీచాలని వేతనాలతో జీవనం గడుపుతున్న తామంతా రోడ్డున పడాల్సి వస్తోందని ఆ చిరుద్యోగుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. రాజకీయ నిర్ణయంతో తమపై వేటువే యాలని ప్రయత్నించడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాపం చిరుద్యోగులు
Published Fri, Jun 13 2014 11:58 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement