భాగస్వామ్యం ఇలా... | New investments in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

భాగస్వామ్యం ఇలా...

Published Sun, Jan 10 2016 11:35 PM | Last Updated on Sun, Sep 3 2017 3:26 PM

భాగస్వామ్యం ఇలా...

భాగస్వామ్యం ఇలా...

విశాఖపట్నం : నూతన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తితో ఉన్నట్టు భాగస్వామ్య సదస్సుల్లో పాల్గొనడానికి వచ్చిన ప్రతినిధులు పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదర్చుకోకపోయినా పరిస్థితులను అధ్యయనం చేయడానికి వచ్చినట్టు కొంతమంది తెలిపారు. అన్నీ అనుకూలంగా ఉంటే ప్రభుత్వం చర్చించాక ఓ నిర్ణయానికి వస్తామని చెప్పారు. ఆదివారం నాటి భాగస్వామ్య సదస్సుకు హాజరైన వారిలో ఇప్పటికే ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న వారు కూడా ఉన్నారు. సదస్సుకు వచ్చిన వారిలో కొందరు ప్రతినిధులు సాక్షితో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. అవి వారి మాటల్లోనే..
 
ఏపీ విశిష్టతలెన్నో...
విశాఖపట్నం : భాగస్వామ్య సదస్సులో భాగంగా రాష్ట్రంలోని భౌగోళిక ప్రాధాన్యతలు, పరిశ్రమల ప్రాశస్త్యాన్ని తెలిపే ఏపీ పెవిలియన్‌ను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రారంభించారు. ఈ పెవిలియన్‌లో జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన ప్రాధాన్యతా అంశాలను సీఎం చంద్రబాబు జైట్లీకి వివరించారు. దేశ తూర్పుతీర ప్రధాన ఆర్థిక కారిడార్‌గా విశాఖను అభివర్ణిస్తూ జిల్లాలోని ప్రముఖ పర్యాటక, పారిశ్రామిక, ఆధ్యాత్మిక కేంద్రాలను, ధాన్యాగారంగా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లా విశిష్టతతో పాటు ఇతర జిల్లాల్లోని ప్రత్యేకతలను తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లాలో సమృద్ధిగా ఉన్న ఖనిజ సంపద, విజయనగరంలో జిల్లాలోని వృక్ష, జంతుజాలం, కృష్ణా జిల్లాలోని బుద్ధిజం, తూర్పు గోదావరి జిల్లాలోని పెట్రోలియం, గ్యాస్ నిక్షేపాలు, గుంటూరు జిల్లాలోని టెక్స్‌టైల్, అపారెల్ పరిశ్రమల గురించి వివరించారు. అలాగే ప్రకాశం జిల్లాలోని గ్రానైట్, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, కడపలోని గండికోట, ఇండస్ట్రియల్ కారిడార్, నెల్లూరులోని ఆటోమొబైల్ పరిశ్రమ, అనంతపురంలోని ఏరోస్పేస్, రక్షణరంగ సంస్థలు, కర్నూలు జిల్లాలోని ఆగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, చిత్తూరు జిల్లాలోని ఎలక్ట్రానిక్, ఐటీ పరిశ్రమల ప్రాధాన్యతలను డిస్‌ప్లే బోర్డులు, పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా పెవిలియన్‌లో ప్రదర్శనకు ఉంచారు.
 
పర్యాటక రంగ ఒప్పందానికి వచ్చాం..
కృష్ణాజిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి ఎన్నో వనరులున్నాయి. పర్యాటక రంగంలో ఏపీ పటంలో కృష్ణా జిల్లాను చేర్చాలన్నది మా తపన. అందుకోసం ఇక్కడకు వచ్చాం. టూరిజంలో భాగంగా ఫోర్‌స్టార్ హోటల్ కూడా నిర్మించాలనుకుంటున్నాం. ప్రభుత్వంతో రేపు ఎంఓయూ కుదుర్చుకుంటున్నాం.
 - వై.ఎన్.రావు, కృష్ణా జిల్లా
 
గార్మెంట్స్ పరిశ్రమపై ఆసక్తి

మేం మా దేశం (జోర్డాన్)లో దుస్తుల తయారీ పరిశ్రమను నడుపుతున్నాం. మా ఉత్పత్తులను అమెరికా దేశానికి ఎగుమతి చేస్తున్నాం. భారత్‌కు కూడా ఎగుమతులు ప్రారంభించాలని అనుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ భాగస్వామ్య సదస్సుకు వచ్చాం. ఇక్కడ (రాష్ట్రంలో) కొన్ని గార్మెంట్స్ తయారీ ఫ్యాక్టరీలను సంద ర్శిస్తాం. అన్నీ అనుకూలంగా ఉంటే గార్మెంట్స్ యూనిట్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తాం.        - జీనా ఖయ్యద్, జోర్డాన్
 
మైనింగ్‌పై ఎంఓయూ కుదుర్చుకున్నాం

కర్నూలు మండలం పత్తికొండ సమీపంలో గోల్డ్ మైనింగ్‌పై ఆదివారం ఇక్కడ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నాం. దీని విలువ రూ.300 కోట్లు. అనుకూలతను పరిశీలించాక ప్రాసెసింగ్ ప్లాంట్ నెలకొల్పుతాం. ఇది లాభదాయకంగా ఉంటుందనుకుంటున్నాం.            - జె.డెవినిష్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, జియో మైసూర్ సర్వీసెస్
 
పరిశ్రమల ఏర్పాటుకు ఊతం
ఇలాంటి సదస్సుల వల్ల పరిశ్రమల ఏర్పాటుకు వీలవుతుంది. అనీల్ అంబానీల్లాంటి వారు ఆంధ్రప్రదేశ్‌లో యూనిట్ల స్థాపనకు ముందుకు వస్తే పరోక్షంగా ఐటీ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వం స్టార్టప్ కంపెనీలకు, ఐటీ రంగానికి ఎలాంటి సపోర్టు ఇస్తుందో తెలుసుకోవడానికి ఇక్కడకు వచ్చాను. అన్నీ బాగుంటే మేం కూడా ఎంఓయుకు ప్రయత్నిస్తాం.
 - విద్యాసాగర్, టెక్ ఐటీ సొల్యూషన్స్, విశాఖ
 
బయోటిక్స్‌లో...

మేం పదేళ్లుగా బయోటిక్స్ రంగంలో ఉన్నాం. మా ఉత్పత్తుల సరఫరాకు అరబ్ దేశాలు ముందుకొస్తున్నాయి. అయితే మాకు ఎవరితో లాభదాయకమో ఆలోచిస్తున్నాం. ఇటలీ నుంచి వచ్చే వారితో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాలనుకుంటున్నాం.
 -ఎం.ఎల్.ప్రసాద్, సుజయ బయోటిక్స్
 
బీమాపై ఎంఓయూ
బీమా రంగంలో ఉన్నాం. డ్వాక్రా, ఎన్జీవోల్లో సభ్యులకు బీమా సదుపాయం కల్పించడంపై అవగాహన కల్పిస్తున్నాం. సీఐఐలో తొలి సభ్యత్వం మాది. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంటే బీమాపై మరింతగా అవగాహన కలిగించడానికి వీలవుతుంది. అందుకోసం ఎంఓయూ కుదుర్చుకోవడానికి వచ్చాం.
 -డి.జార్జి ప్రసాద్, ఇన్‌టెక్ ఇన్స్యూరెన్స్ సంస్థ  
 
అరకు కాఫీకి విస్తృత ప్రచారం
అరకు వేలీ కాఫీకి ఇప్పటికే అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. రుచిలో దీనికిదే సాటి. జీసీసీ తయారు చేస్తున్న అరకు వేలీ కాఫీ స్టాల్, కాఫీ చాక్లెట్‌లు వంటి 17 రకాల ఉత్పత్తులను భాగస్వామ్య సదస్సులో ఏర్పాటు చేశాం. దేశ, విదేశాల ప్రతినిధులు వచ్చి ఈ కాఫీ రుచి చూసి మెచ్చుకుంటున్నారు. సదస్సు ద్వారా అరకు కాఫీ మార్కెట్ మరింత విస్తృతం అవుతుందన్న నమ్మకం ఉంది.
 -రవిప్రకాష్, జీసీసీ ఎండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement