కొత్త కొలువులు వెదుక్కుంటూ... | New jobs | Sakshi
Sakshi News home page

కొత్త కొలువులు వెదుక్కుంటూ...

Published Sun, Apr 3 2016 12:19 AM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM

New jobs

కొత్తవలస రూరల్: ఉన్న ఊళ్లో ఉపాధి కరువై పరిశ్రమలను నమ్ముకున్న కార్మికులు పొట్టపోషణకోసం వలసబాట పట్టారు. వేలాదిమందికి ఉపాధి కల్పించిన మండలంలోని అప్పన్నపాలెం జిందాల్, దేశపాత్రునిపాలెం డెక్కన్ ఫెర్రోఅల్లాయీస్, ఆంధ్రా ఫెర్రో అల్లాయీస్, సాయిరాం కాస్టింగ్, తుమ్మికాపల్లి ఉమా జూట్‌మిల్లులు ఒక్కొక్కటిగా మూతపడ్డాయి. ఈ కర్మాగారాల్లో పనిచేస్తున్న కార్మికులు తమ కుటుంబాలను పోషించుకునేందుకు తప్పని సరి పరిస్థితుల్లో విశాఖపట్నం వలసపోతున్నారు. కష్టాల్లో ఉన్న కర్మాగారం కనీసం తాము పనిచేసిన కాలానికి జీతాలు కూడా చెల్లించలేదని వాపోయారు.

 చేతిలో చిల్లిగవ్వలేక తమ కుటుంబాల్లో ఎవరికి అనారోగ్యం చేసినా వైద్యం చేయించుకునేందుకు కూడా ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. కనీసం తమ గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు జిందాల్... అటు ఉమాజూట్ మిల్లులు మూసివేయటంతో వందలాదిగా కార్మికులు విశాఖ పోర్టు, రైల్వే కాంట్రాక్టు, భవననిర్మాణ రంగాలలో రోజువారీ కూలీలుగా మారారు. చాలీచాలని కూలి డబ్బుతో అర్ధాకలితో అలమటిస్తున్నారు.   
 
 విద్యుత్ రాయితీ ప్రకటించినా...
 రాష్ర్ట ప్రభుత్వం విద్యుత్ రాయితీ యూనిట్‌కు 1.50 పైసలు ప్రకటించినా జిందాల్ కర్మాగారం తెరిచేందుకు సుముఖత చూపటంలేదు. దీనివల్ల కర్మాగారంలో ఎంప్లాయిస్, కాంట్రాక్టు లేబరు కలిపి 850 మంది వరకూ ఉపాధి కోల్పోయాం. పనికోసం పొట్టచేతపట్టుకుని వలస పోవాల్సిన దుస్థితి నెలకొంది.
 - బొట్ట రాము, జిందాల్ కాంట్రాక్ట్ కార్మికుడు
 
 తక్కువ కూలి ఇస్తున్నారు
 మిల్లులు మూసేయటంతో మేమంతా మూకుమ్మడిగా రోజువారీ కూలీ పనులకోసం విశాఖపట్నం పోతున్నాం. మా అవసరం చూసి కాంట్రాక్టర్లు రోజుకు 200 నుంచి 250 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అవసరానికి మించి పనివారు ఉండటంతో కూలి గిట్టుబాటు కావటంలేదు. పరిశ్రమల యాజమాన్యాలు తెరవడానికి ప్రయత్నాలు చేయడంలేదు. కార్మికశాఖ కూడా వారి పక్షానే ఉంటోంది. ప్రభుత్వం సైతం మా కష్టాలను పట్టించుకోవడంలేదు.
 - వై.ఎస్.ఎన్.మూర్తి, జూట్ కార్మికుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement