రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మరో మూడు కొత్త పీజీ వైద్య కోర్సులను ఏర్పాటు చేసేందుకు వైద్య విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది
ప్రభుత్వానికి వైద్య విద్యాశాఖ ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మరో మూడు కొత్త పీజీ వైద్య కోర్సులను ఏర్పాటు చేసేందుకు వైద్య విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 33 విభాగాల్లో 1180 వరకూ పీజీ వైద్య సీట్లున్నాయి. కొత్తగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ట్రాన్‌ఫ్యూజన్ మెడిసిన్ (ఇమ్యునొ హెమటాలజీ అండ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్), ఎమర్జెన్సీ మెడిసిన్/నియోనెటాలజీ కోర్సులకు సంబంధించిన సీట్లకు అనుమతి కోరుతూ భారతీయ వైద్య మండలి (ఎంసీఐ)కి ప్రతిపాదనలు పంపనున్నారు.
ఉస్మానియా, గాంధీ, విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కళాశాల, తిరుపతిలోని స్విమ్స్, కర్నూలు మెడికల్ కళాశాలతో పాటు మౌలిక వసతులు మెరుగ్గా ఉన్న ఇతర కళాశాలల్లో ఈ మూడు కోర్సులను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. ఎంసీఐ అనుమతి ఇస్తే 2014-15 విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించాలని, లేదంటే 2016-17 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.