ఎన్నారై సీటుకు కోటి కట్టాల్సిందే! | one crore must pay to NRI seat | Sakshi
Sakshi News home page

ఎన్నారై సీటుకు కోటి కట్టాల్సిందే!

Published Tue, Sep 13 2016 3:36 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

ఎన్నారై సీటుకు కోటి కట్టాల్సిందే! - Sakshi

ఎన్నారై సీటుకు కోటి కట్టాల్సిందే!

- ఎంబీబీఎస్ ఫీజులు పెంచిన సర్కారు

- ఎన్నారై సీటుకు రూ.1.4 కోట్ల వరకూ చెల్లించాల్సిందే

- యాజమాన్య కోటాలో సీటుకు రూ.70 లక్షల దాకా కట్టాలి

- కన్వీనర్ కోటాకు మాత్రమే ఊరట.. ఉత్తర్వులు జారీ

 

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంబీబీఎస్ ఫీజుల మోత మోగింది. యాజమాన్య, ఎన్నారై కోటా ఫీజులను భారీగా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాన్ మైనారిటీ కాలేజీల్లో యాజమాన్య కోటాలో వార్షిక ఫీజును రూ.11 లక్షలకు, మైనారిటీ కాలేజీల్లో రూ.14 లక్షలకు పెంచింది. ఎన్నారై కోటా సీట్లకు యాజమాన్య కోటాలోని ఫీజుకు రెండింతల వరకూ వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో వైద్య విద్య మరింత భారంగా మారిపోతోంది. ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు ప్రయోజనం కలిగిం చేందుకే ప్రభుత్వం భారీగా ఫీజులు పెంచుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. వైద్య రం గాన్ని ప్రభుత్వమే పూర్తిస్థాయి వ్యాపారంగా మార్చుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 

 22 కాలేజీలు.. 3,500 సీట్లు

 తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 22 మెడికల్ కాలేజీల్లో 3,500 ఎంబీబీఎస్ సీట్లున్నాయి. ఇందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,050 సీట్లు, 13 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2,050 సీట్లు, 3 మైనారిటీ కాలేజీల్లో 400 సీట్లు ఉన్నా యి. ప్రభుత్వ కాలేజీల్లోని సీట్లను ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. వాటికి ప్రభుత్వం నిర్దేశించిన రూ.60 వేల వార్షిక ఫీజు వసూలు చేస్తారు. 13 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 2,050 ఎంబీబీఎస్ సీట్ల లో 50% అంటే 1,025 సీట్లను ఎంసెట్ ర్యాంకు ఆధారంగా కన్వీనర్ కోటాలో.. మిగతా 50% (35% బీ కేటగిరీ, 15% ఎన్నారై కోటా) అంటే 1,025 సీట్లను నీట్ ద్వారా భర్తీ చేస్తారు. ఇక మైనారిటీ కాలేజీల్లో 60% సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. మిగతా 40% (25% బీ కేటగిరీ, 15%ఎన్నారై కేటగిరీ) సీట్లను నీట్ ద్వారా భర్తీ చేయాలి. అడ్మిషన్ల సమయంలోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

 

 కన్వీనర్ కోటాకు ఊరట

ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని కన్వీనర్ కోటా వార్షిక ఫీజులను ప్రస్తుతమున్నట్లుగానే రూ.60 వేలు వసూలు చేస్తారు. అంటే ఎంబీబీఎస్ ఐదేళ్ల కోర్సు పూర్తయ్యే నాటికి రూ.3 లక్షలు చెల్లించాలి. ఇక నాన్ మైనారిటీ కాలేజీల్లోని 35 శాతం బీ కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్లకు గతేడాది రూ.9 లక్షల వార్షిక ఫీజు ఉండగా.. తాజాగా రూ.11లక్షలకు పెంచారు. అంటే ఐదేళ్లకు రూ.55 లక్షలు కట్టాల్సిందే. మైనారిటీ కాలేజీల్లోని యాజమాన్య కోటా సీట్లకు గతంలో వార్షిక ఫీజు రూ.11 లక్షలుగా ఉండగా.. తాజాగా రూ.14 లక్షలకు పెంచారు. అంటే ఐదేళ్లకు రూ.70 లక్షలు చెల్లించాల్సిందే.

ఎన్నారై కోటా ఫీజులను యాజమాన్య కోటా సీట్ల ఫీజుతో పోలిస్తే రెండింతల వరకూ వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. అంటే నాన్ మైనారిటీ కాలేజీల్లో ఎన్నారై కోటా సీటు కోసం ఏటా రూ.22 లక్షల వరకు చెల్లించాల్సిందే. అంటే ఐదేళ్లకు కలిపి అధికారికంగానే రూ.1.10 కోట్లు కట్టాలి. ఇదే మైనారిటీ కాలేజీల్లో ఎన్నారై కోటా సీటుకు రూ.28 లక్షల వార్షిక ఫీజు చెల్లించాలి. అంటే ఐదేళ్లకు కలిపి రూ.1.4 కోట్లు వసూలు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ పెరిగిన ఫీజులు  2016-17 వైద్య విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement