బాక్సైట్ వివాదం కొత్త మలుపు
జీవో-97ను రద్దు చేయాలంటూ జెర్రెల పంచాయతీ తీర్మానం
తవ్వకాలు గిరిజన హక్కులకు భంగకరమని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: ‘బాక్సైట్ తవ్వకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ చంద్రబాబు సర్కారు గత నవంబరు 5వ తేదీన జారీ చేసిన జీవో 97వల్ల గిరిజనుల ఉపాధికి గండి పడుతుంది. ఇది అమలైతే గిరిజనుల హక్కులకు భంగం వాటిల్లుతుంది. అందువల్ల తక్షణమే ఈ జీవోను రద్దు చేయాలి.’ అని డిమాండ్ చేస్తూ విశాఖపట్నం జిల్లాలోని జెర్రెల గ్రామ పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ పంచాయతీ పరిధిలోని రెండు గ్రామాల వారు డిసెంబర్ 23వ తేదీన ఈ మేరకు తీర్మానం చేశారు. 28వ తేదీన మొత్తం గ్రామ పంచాయతీ సమావేశమై మళ్లీ ఇదే అంశాలపై ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి తాజాగా ప్రభుత్వానికి పంపించింది.
గ్రామపంచాయతీ తీర్మానం ప్రతులు గిరిజన సంక్షేమం, భూగర్భ గనులు, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులకు అందాయి. దీంతో బాక్సైట్ వివాదం కొత్త మలుపు తిరిగినట్లయింది. గిరిజన గ్రామ పంచాయతీ తీర్మానాన్ని కాదని ముందుకెళితే ఇబ్బంది అవుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు. దీంతో ఏమి చేయాలో తెలియక అధికారులు తల పట్టుకుంటున్నారు. విశాఖ జిల్లా జెర్రెల, చింతపల్లి బ్లాకుల్లోని 3,030 ఎకరాల అభయారణ్యాన్ని బాక్సైట్ మైనింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి బదలాయిస్తూ చంద్రబాబు సర్కారు గత ఏడాది నవంబరు 5న జీవో 97 జారీ చేయడంపై గిరిజనులు, గిరిజన సంఘాలు మండిపడుతున్న విషయం విదితమే.
ఈ జీవోను రద్దు చేయకపోతే తాము గ్రామాల్లోకి వెళ్లడం ఇబ్బందవుతుందని విశాఖ జిల్లాలోని కొందరు మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్యేలు కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో జీవో 97ను రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు ప్రకటించారు. దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అసెంబ్లీలో ప్రకటించారు. అయితే తన సర్కారు జారీ చేసిన జీవో 97 గురించి మాత్రం ప్రస్తావించనేలేదు. బాక్సైట్ తవ్వకాలు జరపరాదని గిరిజనులు డిమాండు చేస్తుంటే జీవో 97ను రద్దు చేయకుండా బాక్సైట్ సరఫరా ఒప్పందాలను రద్దు చేయడంలో అర్థమే లేదు... జీవో 97ను రద్దు చేయాలని విపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆ పార్టీకి చెందిన గిరిజన ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, రాజన్న దొర కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ నేపథ్యంలో బాబు సర్కారు కుటిల యత్నాలను గుర్తించిన జెర్రెల గ్రామ పంచాయతీ సమావేశమై జీవో 97ను రద్దు చేయాల్సిందేనని తీర్మానం చేసి పంపింది.
ముందరికాళ్లకు బంధం వేసినట్లే..
జెర్రెల గ్రామపంచాయతీ తీర్మానంతో ప్రభుత్వ ముందరికాళ్లకు బంధం వేసినట్లయిందని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. జీవో 97ను రద్దు చేయకతప్పని పరిస్థితి ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. ‘గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా గ్రామసభ అనుమతి తప్పనిసరి. ఇప్పుడు జీవో 97ను రద్దు చేయాలని, ఇక్కడ మైనింగ్ జరపరాదని గ్రామసభ తీర్మానం చేసి కాపీని ప్రభుత్వానికి పంపింది. దీనిని కాదని ముందుకు వెళ్లడమంటే గ్రామపంచాయతీ నిర్ణయాన్ని తోసిపుచ్చినట్లవుతుంది. ఇది న్యాయపరంగా వివాదమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో తెలియాల్సి ఉంది’ అని గిరిజన సంక్షేమశాఖకు చెందిన ఒక అధికారి ‘సాక్షి’తో అన్నారు.