రూ. 12.5 కోట్లు కొట్టేషారు..!
Published Fri, Jan 3 2014 3:40 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
సాక్షి, గుంటూరు :‘మందు బాబులం.. మేము మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం ..’సినీ గీతం చందంగా నూతన సంవత్సర వేడుకల్లో మద్యం ప్రియులు బాగానే మజా చేశారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 1వ తేదీ వరకు కొనసాగిన మద్యం విక్ర యాల్ని పరిశీలిస్తే.. మునుపెన్నడూ లేనంతగా రోజుకు రూ.4.5 కోట్ల విలువైన మద్యం లాగించేశారని అబ్కారీశాఖ లెక్కగట్టింది. ఈ మూడు రోజుల్లో రూ.12.5 కోట్ల విలువైన మద్యాన్ని మందుబాబులు తాగి తూగారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మూడు ఎక్సైజ్ డివిజన్‌లు తె నాలి, నరసరావుపేటతో పాటు గుంటూరు నగరంలో కొత్తసంవత్సర వేడుకలు ‘ ఘనం’గానే జరిగాయి. ప్రైవేటు అతిథిగృహాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్‌హాళ్లు, క్లబ్ ల్లో మద్యంప్రియులు మందేసి చిందేయగా.. ఎవరికి వారు మిత్రబృందాలు ప్రైవేటుగా మూ డుఫుల్స్.. ఆరు హాఫ్‌లు లాగించేసి మత్తులో తూగారు. ఆ మూడు రోజుల మద్యం విక్రయాలు కిందటి ఏడాదిని మించిపోయాయి.
బ్రాండెడ్ సరుకుకు ప్రాధాన్యం....
రాష్ట్ర ఖజానాకు ఎక్సైజ్ శాఖ నుంచి సమకూరే ఆదాయంలో జిల్లాది అగ్రస్థానం. జిల్లావ్యాప్తంగా 342 వైన్ దుకాణాలు, 180 బార్, రెస్టారెంట్‌లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో జిల్లాలో రోజుకు రూ.కోటి మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు ఇటీవల ఓ సంస్థ సర్వేలో తేలింది. అలాంటిది, డిసెంబరు 30,31,జనవరి 1వ తేదీ వరకు రూ.12.5 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగాయి. అంటే, రోజుకు రూ.4.5 కోట్ల విలువైన మద్యం ‘సేల్’ అయ్యింది. జిల్లాలోని మూడు డివిజన్‌లలో కలిపి డిసెంబర్ 31 ఉదయం నుంచి రాత్రికి 11,380 ఐఎంఎల్ బాటిళ్లు, 5,773 కేస్‌ల బీర్లు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ.4.5 కోట్లుగా లెక్కకట్టారు. జనవరి ఒకటో తేదీ కూడా ఇంచుమించు ఇదే స్థాయిలో విక్రయాలు జరిగాయి. అమ్ముడైన మద్యం బాటిళ్లలో బ్రాండెడ్ సరుకుకే మందుబాబులు ప్రాధాన్యమిచ్చినట్లు అబ్కారీ అధికారులు చెబుతున్నారు. 2012డిసెంబర్‌లో 2,08,544 ఐఎంఎల్ బాటిళ్లు విక్రయం కాగా, 2013 డిసెంబరులో 2,28,224 ఐఎంఎల్ బాటిళ్లు అమ్ముడయ్యాయి. ఈ గణాంకాల ప్రకా రం 2012 డిసెంబర్ మద్యం విక్రయాల విలువ రూ.72.43 కోట్లు ఉండగా, 2013 డిసెంబరు విక్రయాలు రూ.87.74 కోట్లుగా నమోదు కావడం గమనార్హం. ఇది 20 శాతం అదనం .
పోలీస్ ప్రణాళిక విజయవంతం..
ప్రతిఏటా నూతన సంవత్సరం ప్రారంభ ఘడియల్లో ఎక్కడో ఒకచోట ఘర్షణలు, ప్రమాదాలు జరుగుతుండేవి. అయితే, 2014 ఆరంభం మాత్రం చాలా ప్రశాంతంగా జరిగింది. డిసెంబర్ 30న అర్బన్, రూరల్ జిల్లా ఎస్పీలు గోపీనాథ్ జెట్టి, జె.సత్యనారాయణ ఆధ్వర్యంలో క్లబ్‌లు, వైన్స్, బార్, రెస్టారెంట్‌లు, హోటళ్ల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. పోలీసు నియామళిపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం డిసెంబర్ 31న రాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలకు అనుమతులు ఇచ్చినప్పటికీ, ఆ రోజు కచ్చితంగా రాత్రి 11 గంటలకు దుకాణాలు మూసేయాల్సిందేనని చెప్పారు. ఆ సమయంలో కొందరు వ్యాపారులు పోలీసు అధికారులతో సమయాన్ని సడలించాలని అభ్యర్థించినా తమ నిర్ణయాన్ని మార్చుకునేది లేదని పోలీసు అధికారులు తేల్చి చెప్పా రు. ఇది మంచి ఫలితాలను ఇచ్చింది. ఆ మేరకు వైన్స్, బార్,రెస్టారెంట్లు నిర్ణీత సమయానికి మూతపడగా, పోలీస్ గస్తీ ముందస్తు ఏర్పాట్ల నేపథ్యంలో అర్బన్, రూరల్ జిల్లాలో ఎక్కడా చిన్నపాటి ఘర్షణ కూడా చోటుచేసుకోలేదు. మొత్తం మీద నూతన సంవత్సర సంబరాలు ప్రశాంతంగా ముగియడంపై అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.
Advertisement
Advertisement