2014 జూన్ నుంచి 2015 మే వరకూ స్వర్ణోత్సవాలు
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో రైతులకు, వ్యవసాయ రంగానికి దిక్సూచీగా నిలుస్తున్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాలకు సిద్ధమవుతోంది. విశ్వవిద్యాలయం స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా 2014 జూన్ నుంచి 2015 మే వరకూ స్వర్ణోత్సవ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు శుక్రవారమిక్కడ యూనివర్సిటీ వీసీ పద్మరాజు వెల్లడించారు. వేడుకల్లో భాగంగా కిసాన్ మేళాలు, వ్యవసాయ ప్రదర్శనలు, రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) డెరైక్టర్ జనరల్ అయ్యప్పన్ ఏజీ వర్సిటీ గోల్డెన్ జూబ్లీ(స్వర్ణోత్సవ) లోగోను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఏజీ వర్సిటీని ఐసీఏఆర్ జాతీయ స్థాయిలో రెండుసార్లు ఉత్తమ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా గుర్తించిందన్నారు. కార్యక్రమంలో వర్సిటీ పాలక మండలి సభ్యులు ఎస్.ఎల్. గోస్వామి, సిద్దిఖీ, అల్దాస్ జానయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ ప్రస్థానం...
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఏపీఏయూ)గా 1964, జూన్ 12న ప్రారంభ మైంది.
ప్రముఖ రైతు నాయకుడు, పార్లమెంటేరియన్ ఆచార్య ఎన్జీ రంగా స్మారకార్థం 1996, నవంబరు 7న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంగా పేరు మార్చారు.
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో 2,500 ఎకరాల క్యాంపస్‌తో దేశంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయంగా పేరు పొందింది.
ఇప్పటివర కూ 40 వేల మంది వ్యవసాయ పట్టభద్రులను దేశానికి అందించింది.