ఐఎస్‌ఎల్.. నిల్! | nil as isl | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఎల్.. నిల్!

Published Wed, Nov 12 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM

nil as isl

* నత్తనడకన నిర్మాణాలు
* ఇసుక కొరత, అవగాహన లేమి కారణం
* ఏడాదిన్నర కాలంలో కేవలం 29 శాతమే పూర్తి

మండపేట : నిధుల విడుదలలో ప్రభుత్వ నిర్లక్ష్యం, స్థల సమస్య, ఇసుక కొరతలకు తోడు ప్రజల్లో అవగాహనలే మి ఇవన్నీ వ్యక్తిగత మరుగుదొడ్ల(ఐఎస్‌ఎల్) నిర్మాణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో జిల్లాలో ఐఎస్‌ఎల్‌ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఏడాదిన్నర కాలంలో నిర్దేశిత లక్ష్యంలో ఇప్పటి వరకు కేవలం 29 శాతం మాత్రమే పూర్తయ్యాయి.
 
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ. పదివేలు మంజూరు చేస్తోంది. ఈ మొత్తంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నుంచి రూ.5,400, ఆర్‌డబ్ల్యూఎస్ నుంచి రూ.4,600 చెల్లిస్తోంది. కాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన స్వచ్ఛ భారత్‌లో భాగంగా ప్రభుత్వ సాయాన్ని రూ.12 వేలకు పెంచింది. అక్టోబరు రెండో తేదీ నుంచి మంజూరైన వాటికి మాత్రమే ఇది వర్తిస్తుందని సమాచారం. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు 1,53,835 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు కేవలం 44,532 మాత్రమే పూర్తయ్యాయి. 37,226 నిర్మాణ దశలో ఉన్నాయి. మిగిలినవి ఇంకా నిర్మాణ పనులకు నోచుకోలేదు. స్థల సమస్యతో అధిక శాతం నిర్మాణానికి నోచుకోవడం లేదు. ఐఎస్‌ఎల్ పథకానికి లబ్ధిదారుడిగా ఎంపికైనా, నిర్మాణానికి సరైన స్థలం లేకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది.
 
ఇసుక ధర పెరగడంతో...
ఇసుక రీచ్‌లు మూతపడి ఇసుక ధర రెట్టింపు కావడంతో ఐఎస్‌ఎల్ నిర్మాణ వ్యయం పెరిగిపోతోంది. ప్రభుత్వసాయం ఇసుక ధర సరిపోక నిర్మాణంలో ఉన్నవి నిలిచిపోగా, కొత్తగా నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. మరోపక్క బహిరంగ మలవిసర్జన వల్ల కలిగే అనర్థాలపై ప్రజలను చైతన్యవంతులుగా చేయడంలో యంత్రాంగం విఫలమవుతుందనే విమర్శలూ ఉన్నాయి. మరోవైపు నిర్మాణ పనులు పూర్తయినా సకాలంలో బిల్లులు అందడం లేదని తెలుస్తోంది. ఫలితంగా నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోతున్నాయని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు.
 
విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం
ప్రతీ ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం కోసం విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. ఇంటింటికీ వెళ్లి వివరిస్తున్నాం. అయితే ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్మాణం పూర్తయిన వాటికి సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నాం.
 - భవానీ, డ్వామా పీడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement