‘నీలం’ పరిహారం ఇంకెంత దూరం?
సాక్షి, రాజమండ్రి :లోకపుటాకలి తీర్చే అన్నదాతంటే అందరికీ, అన్నింటికీ లోకువే. ప్రకృతి ప్రకోపించినా, ప్రభుత్వాలు అలసత్వం వహించినా, మార్కెట్ మాయాజాలం పేట్రేగినా తొలుత బాధితులయ్యేది రైతులే. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విపత్తులు కబళించినప్పుడు..నిస్సహాయులైన రైతులు- గోరంత సాయం కోసం కొండంత ఆశతో ప్రభుత్వాల వైపు చూస్తారు. 2012 నవంబర్‌లో నీలం తుపాను ఖరీఫ్ పంటను తుడిచి పెట్టినప్పుడు.. జిల్లాలోని అన్నదాతలు అలాగే ప్రభుత్వంపై ఆశ పెట్టుకున్నారు. అయితే వారందరి కన్నీటిని తుడవడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. అంచనాలు, నివేదికలు, కేంద్ర బృందాల పరిశీలనల అనంతరం ఎట్టకేలకు గత ఏడాది మేలో నీలం పరిహారం నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. అక్టోబరు నాటికి నిధులు జిల్లా అధికారుల ఖాతాల్లోకి చేరాయి.
అన్ని విభాగాల పరిశీలనల అనంతరం జిల్లాలో 3.90 లక్షల మంది రైతులను నీలం బాధితులుగా తేల్చిన ప్రభుత్వం వారికి పరిహారంగా పంపిణీ చేసేందుకు రూ.144 కోట్లు మంజూరు చేసింది. గత ఏడాది డిసెంబరు నాటికి పరిహారాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనారంభించారు. ఈ ఏడాది జనవరి నాటికి 2.92 లక్షల మంది ఖాతాలకు పరిహారం జమైంది. అయితే అధికారుల అలసత్వం కారణంగా సుమారు 98 వేల మందికి నేటికీ పరిహారం సుదూరంగానే నిలిచింది. బ్యాంకు ఖాతాల్లో తేడాలు, రైతుల పేర్లలో దొర్లిన తప్పుల వంటివి సరిదిద్దడంలో అధికారుల నిర్లక్ష్యం అన్నదాతలను ఉసూరుమనిపిస్తోంది. కాగా ఇప్పుడు ప్రభుత్వం మారుతుండడంతో అసలు పరిహారం అందుతుందా, ఎన్నటికీ అందని మానిపండవుతుందా అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అవకతవకలు అనేకం..
నిబంధనల ప్రకారం పరిహారం సొమ్మును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. రైతుల ఖాతాల వివరాలను మండల వ్యవసాయ అధికారులు సేకరించి నివేదికలు పంపారు. అయితే ఆ క్రమంలో తలెత్తిన పొరపాట్లు రైతులు పరిహారం పొందడంలో ప్రతిబంధకాలయ్యాయి. బ్యాంకులకు రైతుల ఖాతాల నంబర్లను సమర్పించే సమయంలో సున్నాలను ‘ఓ’ అనే ఇంగ్లీషు అక్షరాలుగా పేర్కొన్నారు. దాంతో ఆ ఖాతాలు చెల్లవని బ్యాంకు అధికారులు తిరస్కరించారు. ఖాతాల నంబర్ల ముందు రైతుల అసలు పేర్లను కాకుండా వ్యవహార నామాలనే పేర్కొనడం, ఇంటిపేరు లేకుండా కేవలం పేర్లనే ఉదహరించడం, తండ్రి పేర్లలో తేడాల వల్ల అలాంటి వారి ఖాతాలకు కూడా బ్యాంకులు సొమ్ములు జమ చేయలేదు. కొందరు రైతుల ఖాతాలు చాలాకాలం నుంచి లావాదేవీలు లేక నిలిచిపోయాయి. అలాంటి ఖాతాల స్థానంలో కొత్తవి తెరిచేలా రైతులను చైతన్యపరచడంలో అధికారులు అలసత్వం వహించారు.
ఇలా అనేక కారణాల వల్ల.. పరిహారంగా విడుదలైన సొమ్ము రైతులకు పంపిణీ కాక బ్యాంకుల్లో నిరర్థక నిధులుగా ఉండిపోయింది. ఇక పలువురు రైతులు ఇచ్చిన ఖాతా నంబర్లు వేరే వారివి కావడంతో పరిహారం వేరే వారి ఖాతాలకు జమైంది. ఈ చిక్కును కూడా అధికారులు పరిష్కరించలేకపోతున్నారు. జరిగిన పొరబాట్లను సహనంతో, సమన్వయంతో చక్కదిద్దాల్సిన వ్యవసాయ శాఖ, బ్యాంకు అధికారులు ఒకరిపై ఒకరు నెపం నెడుతూనే ఆరునెలలు గడిపేశారు. వ్యవసాయాధికారులు ఖాతాల వివరాలు సవ్యంగా సమర్పించలేదని బ్యాంకు అధికారులు అంటుంటే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి బ్యాంకుల సిబ్బంది తాము పొరపాట్లను సవరించినా మార్పు చేసేందుకు సహకరించడం లేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
ఇప్పటికైనా ఇస్తారా..?
అవకతవకలకూ, ఆలస్యానికీ ఎవరి బాధ్యత ఎంతనేది అలా ఉంచితే సుమారు 98 వేల మంది అన్నదాతలకు అందాల్సిన రూ.తొమ్మిది కోట్ల పరిహారం ఆరు నెలలుగా బ్యాంకుల్లో మూలుగుతోంది. నిబంధనల ప్రకారం దీనిపై వడ్డీ కూడా జమ అవుతుంది. ఈ వడ్డీని అటు వ్యవసాయాధికారులు, ఇటు బ్యాంకు అధికారులు పరిగణనలోకి తీసుకుంటారా అన్న సందేహం కూడా వ్యక్తమవుతోంది. కాగా కొన్ని లోతట్టు గ్రామాల్లో రైతులకు అందాల్సిన పరిహారం నిధులను గుట్టుగా స్వాహా చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. జరిగిన జాప్యం ఎలాగూ జరిగింది. ఇప్పటికైనా అన్నదాతల అలనాటి భారీ నష్టానికి చిరుసాయాన్ని అందించడానికి ఉన్నతాధికారులు సంకల్పించాలి.