రేకుల షెడ్‌తో నిర్మాణమైన పెద్దాపురం బస్సు కాంప్లెక్స్, రూ.5 లక్షలతో నిర్మాణమైన బస్సుషెల్టర్ ఇదే
సాక్షి, సామర్లకోట (పెద్దాపురం): 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కోనసీమ నుంచి వలస వచ్చిన నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురం నియోజకవర్గంలో పోటీ చేసి ... విజయపతాకం ఎగురవేసి ... ఏకంగా కొండలనే కొల్లగొట్టి రూ. కోట్ల ఆర్జనకు శ్రీకారం చుట్టారు. కీలకమైన ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి పదవులతో ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తారనుకుంటే అడుగడుగునా ఆయనతోపాటు ఆయన అనుచరులు అందినకాడికి దోచుకొని నియోజకవర్గ ప్రజలను దగా చేశారన్న విమర్శలున్నాయి. పెద్దాపురం మండలం ఆనూరు, కొండపల్లి, కొండలను గుల్ల చేసి గ్రావెల్ తవ్వకాలు జోరుగా చేశారు. ప్రతి రోజు వందలాది వాహనాలలో గ్రావెల్ రవాణా జరగడంతో ఆయా ప్రాంతాలు కాలుష్యంతో నిండిపోయాయి. ప్రకృతి ఇచ్చిన సంపదను కాపాడాల్సిన అధికారులు, అధికార పార్టీ నేతలకు తొత్తుగా మారి పోయారని ఈ ప్రాంతవాసులు మండిపడుతున్నారు. మంత్రి పదవిని అడ్డు పెట్టుకొని కొండలను కొల్లగొట్టి రూ.200 కోట్ల వరకు సంపాదించారనే ఆరోపణలున్నాయి. గత రెండేళ్లుగా ఏకధాటిగా సాగుతున్న కొండల తవ్వకాలపై ఆందోళనలు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
దళితుల పొట్టకొడుతూ...
పెద్దాపురం మండల పరిధిలో రామేశ్వరంపేట మెట్టపై ఆధారపడి ఆనూరు, కొండపల్లి, రామేశ్వరంపేట, సూరంపాలెం, వాలుతిమ్మాపురం గ్రామాలకు చెందిన సుమారు 800 మంది దళితులు జీవనం సాగిస్తున్నారు. అధికార పార్టీ పెద్దల అండతో మైనింగ్ మాఫియా ఆ భూముల్లోకి ప్రవేశించి దళితుల బతుకులతో ఆటలాడుకుంటోంది. దళితులతో తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకొని తవ్వకాలు దౌర్జన్యంగా చేస్తున్నారు. సుమారు 50 అడుగుల ఎత్తులో వాలుగా ఉన్న కొండను తవ్వి చదును చేయడంతో రెండు వంతుల భూమిని దళితులు కోల్పోయే అవకాశం ఉంది. కొండల మీదుగా 33 కేవీ విద్యుత్తు స్తంభాలను ఏర్పాటు చేయగా వాటిచుట్టూ కూడా గ్రావెల్ తవ్వకాలు చేపట్టేశారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రామేశ్వరం మెట్టపై ఉన్న 800 ఎకరాల భూమిని పేద దళితులకు పంపిణి చేశారు. తరువాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరో 530 ఎకరరాల భూమిని ఒక్కో కుటుంబానికి ఎకరం 35 సెంట్ల చొప్పున పంపిణి చేశారు.
పంటలకు అనువుగా వైఎస్ హయాంలో బోర్ల ఏర్పాటు...
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2005–06లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఇందిరా క్రాంతి, ఇందిరా జలప్రభ ద్వారా 72 బోర్లు వేయించి డ్రిప్ ఇరిగేషన్ పథకం ద్వారా పంట పొలాలకు పైపు లైన్లు ఏర్పాటు చేయించారు. దాంతో మెట్టపై జీడి మామిడి, దుంప, అపరాల పంటలు, ఆకుకూరలు, కాయగూరలు పండిస్తూ కుటుంబాలను పోషించుకొంటున్నారు. ఎకరానికి రూ.30 నుంచి 40 వేల వరకు ఆదాయం వచ్చేదని రైతులు తెలియజేశారు. ఉపాధి హామీ పథకంలో మామిడి, జీడి మామిడి ఈ మెట్టపై వేసుకునేందుకు అధికారులు మొక్కలను పంపిణీ చేశారు. ఈ మొక్కల సంరక్షణ కోసం ప్రతి నెలా రూ.1500 నుంచి మూడు వేల వరకు ఇచ్చేవారు. విద్యుత్తు సదుపాయంతో బోర్ల ద్వారా వ్యవసాయం చేస్తున్న మెట్టను ఏ విధంగా తవ్వకాలకు అధికారులు అనుమతి ఇచ్చారో అర్థం కావడం లేదని దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికార పార్టీ అండదండలతో తప్పుడు రికార్డులతో మాఫియా రంగంలోకి దిగి క్వారీ తవ్వకాలు చేస్తోంది. మెట్టపై భూములున్న వారిని బెదిరించి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకొని మైనింగ్ తవ్వకాలు ప్రారంభించారనే ఆరోపణలు విస్తృతంగా ఉన్నాయి. సొంత భూమిలో గ్రావెల్ తవ్వకానికి అనేక మంది అధికారుల అనుమతి ఉండాలి. కానీ ఎటువంటి అనుమతి లేకుండా ఏడీబీ రోడ్డును ఆనుకొని ఉన్న ప్రభుత్వ కొండలో తవ్వకాలు చేస్తున్నా అధికారులు మౌనం వహించడమేమిటని పరిసర ప్రాంత జనం ప్రశ్నిస్తున్నారు. దాదాపు పది పొక్లెయిన్లతో 24 గంటలపాటు తవ్వకాలు చేస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
అభివృద్ధి పనుల్లో అదే రీతి...
నియోజకవర్గ పరిధిలో రూ.1,200 కోట్లతో అభివృద్ధి చేశామని చినరాజప్ప తరచుగా చెబుతున్నారని, అందులో అవినీతి భాగం ఎక్కువగా ఉందనే విమర్శలూ లేకపోలేదు. పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం సమీపంలో రూ.80 లక్షలతో నిర్మాణం చేసిన సీసీ రోడ్డు ప్రారంభం సమయంలోనే గోతులతో నిండిపోయింది. రూ.కోటితో పెద్దాపురం బస్సు కాంప్లెక్స్ నిర్మాణంలోను భారీ అవినీతి తొంగిచూస్తోంది. రేకులతో నిర్మాణం చేసి నిధులు స్వాహా చేశారన్న ఆరోపణలున్నాయి. ఇక ‘నీరు చెట్టు’ పథకం అవినీతికి మరో మెట్టుగా మారిపోయింది. సామర్లకోట నీలమ్మ చెరువు అభివృద్ధి పనులు నాసిరకంగా చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి.
రేకుల షెల్టర్లకు రూ. ఐదు లక్షలా!
ఐదు నుంచి ఆరుగురు ప్రయాణికులు వేచి ఉండటానికి వీలుగా రేకులతో ఇటీవల ఏర్పాటు చేసిన ఒక్కో షెల్టర్‌కు రూ. ఐదు లక్షలు ఖర్చు చేసినట్లు ప్రకటించడంపై ప్రజలు ముక్కున వేలేసుకొంటున్నారు. రూ.లక్ష కూడా ఖర్చు కాని ఈ షెల్టరుకు రూ.ఐదు లక్షలా అనే విమర్శలున్నాయి. ఇటువంటివి పెద్దాపురంలో మూడు నిర్మాణం చేసి భారీ ఎత్తున నిధులు స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. ఈ విధంగా ప్రతి అభివృద్ధి పనిలోనూ అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి.
అనధికార లేఅవుట్ల జోరు
నియోజకవర్గ పరిధిలో ప్రతి గ్రామంలోనూ అనధికార లే అవుట్లు జోరందుకున్నాయి. ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు గమనించినా ఏమీ చేయలేని పరిస్థితులున్నాయి. ఈ ప్లాట్లను కొనుగోలు చేసినవారికి ఇళ్ల నిర్మాణానికి ప్లాన్లు మంజూరు కాకపోవడంతో అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పెద్దాపురం–సామర్లకోట రోడ్డు అభివృద్ధిలో ‘పచ్చ’పాతం చూపిస్తున్నారని పరిసర గ్రామాల ప్రజలు కన్నెర్ర చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment