నిరీక్షణ ఫలించేనా?
బోధన్‌లోని చక్కెర కర్మాగారం విషయంలో శాసనసభా సంఘం చేసిన సిఫారసులు అమలుకు నోచుకోవడం లేదు. దీంతో ఈ ప్రాంత రైతులు, కార్మికుల కష్టాలు తీరడం లేదు. ప్రభుత్వం త్వరగా ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోవాలని, ఇళ్లకోసం కార్మికుల వద్దనుంచి వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇప్పించాలని కార్మికులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనైనా కల సాకారమవుతుందేమోనన్న ఆశతో నిరీక్షిస్తున్నారు.
బోధన్ టౌన్, న్యూస్‌లైన్ :
ఆరు దశాబ్దాల పాటు ఈ ప్రాంతంలో వెలుగులు నింపి, ఆసియా ఖండంలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా పేరుగాంచిన బోధన్‌లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ(ఎన్‌ఎస్‌ఎఫ్) ప్రైవేట్ పరం కావడంతో కార్మికులు, రైతుల కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రోత్సాహం కరువై రైతులు చెరుకు సాగుకు దూరమయ్యారు. ఉపాధిపోయి కార్మికులు వీధిన పడ్డారు. కార్మికుల సంక్షేమం కోసం నిజాం ప్రభువు నిర్మించిన ఇళ్లకూ ప్రభుత్వం డబ్బులు వసూలు చేసింది. బాధితులంతా శాసనసభా సంఘం సిఫారసుల అమలు కోసం కళ్లల్లో వత్తులు వేసుకొని నిరీక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతుండడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి.
నష్టాల సాకుతో 2002లో టీడీపీ ప్రభుత్వం ఎన్‌ఎస్‌ఎఫ్‌ను ప్రైవేట్ పరం చేసింది. సుమారు రూ 300 కోట్ల విలువైన ఫ్యాక్టరీ ఆస్తులను *60 కోట్లకే ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టింది. ఫ్యాక్టరీపై ఆధార పడి ఉన్న రైతులకు, కార్మికులకు అప్పటి నుంచి కష్టాలు మొదల య్యాయి. ఫ్యాక్టరీని అమ్మేటప్పుడు దానికి అనుబంధం గా ఉన్న 14 ఫారాలతో పాటు శక్కర్‌నగర్‌కాలనీలోని ఇళ్లను అమ్మేశారు. వీటిని కార్మికుల శ్రేయస్సు కోరి నిజాం ప్రభువు నిర్మించారు. శక్కర్‌నగర్ కాలనీలోని ఇళ్లు శిథిలావస్థకు చేరినా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఇంటికి రూ 35 వేలనుంచి రూ 60వేల వరకు రేటు కట్టి కార్మికుల నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేసిం ది. ఫ్యాక్టరీని ప్రైవేట్‌పరం చేసినప్పుడు 1,200 కార్మికులకు వీఆర్‌ఎస్ ఇచ్చారు. ఇంటి డబ్బులను కట్ చేసుకొని వీరికి వీఆర్‌ఎస్ మొత్తాన్ని ఇచ్చారు. ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ అప్పటి ప్రతిపక్ష నేత, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, బీజేపీ, టీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన చేశారు. ఈ వ్యవహారం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ వ్యవహారంపై 12మందితో శాసనసభా సంఘాన్ని నియమించా రు. విచారణ జరిపిన శాసనసభాసంఘం ఫ్యాక్టరీ ప్రైవేటీకరణలో అక్రమాలు చోటు చేసుకున్నాయని తేల్చింది. ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించింది. భారతీయ మజ్దూర్ సంఘ్ నాయకుల విజ్ఞప్తి మేరకు నివేదికలో కార్మికుల ఇళ్ల అంశాన్నీ చేర్చారు. దీని ప్రకారం కార్మికులనుంచి ప్రభుత్వం వసూలు చేసిన ఇంటి డబ్బులు రూ 5.50 కోట్లను తిరిగి ఇవ్వాలని సిఫారసు చేశారు. ఫ్యాక్టరీ ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఇటీవల హైకోర్టు సైతం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడంతో దీనికి సంబంధిం చిన ఫైల్ ప్రభుత్వం వద్ద పెండింగ్‌లోనే ఉంటోంది.
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, కిషన్‌రెడ్డి పలుమార్లు మాట్లాడారు. ఫ్యాక్టరీపై శాసనసభా సంఘం చేసిన సిఫారసులను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ శాసనసభ్యులు సైతం పోరాడి నా ఫలితం లేదు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధు లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి శాసనసభా సంఘం సిఫారసులు అమలయ్యేలా చూడాలని రైతులు, కార్మికులు కోరుతున్నారు. ఇళ్ల విషయంలో కార్మికులనుంచి వసూలు చేసిన డబ్బులను త్వరగా ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
నిరీక్షణ ఫలించేనా?
Published Mon, Dec 2 2013 1:44 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement