ఆశీర్వదించండి | bless bjp | Sakshi
Sakshi News home page

ఆశీర్వదించండి

Published Mon, Mar 12 2018 9:39 AM | Last Updated on Fri, Mar 29 2019 9:07 PM

bless bjp - Sakshi

ప్రజలకు అభివాదం చేస్తోన్న బీజేపీ నాయకులు

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: రాష్ట్రంలో తాము అధికారంలో లేకపోయినా అభివృద్ధి కోసం ఎన్నో నిధులు కేటాయిస్తున్నామని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్‌ గంగారాం అహేర్‌ హామీ కోరారు. తెలంగాణ ప్రజలు ఎంతో చైతన్యవంతులని, తమ పార్టీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక నిజాం చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కృషి చేస్తామని ఇచ్చారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ విషయమై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రధానితో చర్చించాలని సూచించారు.

చెరుకు రైతుల చర్నాకోల్‌ మహా పాదయాత్ర ముగిం పు సందర్భంగా ఆదివారం బోధన్‌లోని అంబేద్కర్‌ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. చెరుకు రైతులు, కార్మికులకు భరోసా కల్పించేందుకు నాయకులు పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తాము ఎప్పుడూ అధికారంలో లేకపోయినా.. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి నిధులు ఇస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఆర్మూర్‌ – ఆదిలాబాద్‌ రైల్వే లైన్‌ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. గోదావరి, పెన్‌గంగా నదులపై నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు వెంటవెంటనే అనుమతులిచ్చామని, మహారాష్ట్రలోని తమ ప్రభుత్వం కూడా ఇందుకు అంగీకరించిందని పేర్కొన్నారు. 

అధికారం కష్టమేమీ కాదు.. 
త్రిపుర వంటి ఈశాన్య రాష్ట్రాల మాదిరి తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. విదేశాలకు వలస వెళ్లకుండా స్థానికంగా ఉపాధి కల్పించేందుకు యువతకు నైపుణ్య అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు మూత పడ్డాయని, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సర్కారు సైతం ఇదే ధోరణితో ముందుకెళుతోందని విమర్శించారు.

ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారిని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రాజ్యసభకు పంపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు విమర్శించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్‌ సర్కారు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని శాసన మండలి బీజేపీ పక్ష నేత రాంచంద్రరావు విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు చేసుకోవడమే గుణాత్మకమైన మార్పా అని ప్రశ్నించారు.

ప్రజాసమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని,  140 కిలోమీటర్ల పాదయాత్రలో ఎన్నో సమస్యలు దృష్టికి వచ్చాయని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపురి అరవింద్‌ అన్నారు. బోధన్‌ చక్కెర కర్మాగారాన్ని ప్రైవేటుకు ధారాదత్తం చేసిన చంద్రబాబు మహా పాపాత్ముడని, దీన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌ నిలబెట్టుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనతోనే రైతుల సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలిస్తామని ప్రకటించిన కేసీఆర్‌ పాలనలో ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ విమర్శించారు.

చక్కెర కర్మాగారం కార్మికులకు వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని, మహిళా సంఘాలకు రూ.2,200 కోట్ల వడ్డీ రాయితీ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా అధికార ప్రతినిధి అడ్లూరు శ్రీనివాస్‌ మాట్లాడుతూ రైతులకు, కార్మికులకు అండగా నిలిచేందుకు చేపట్టిన పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు పల్లెగంగారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు అల్జాపూర్‌ శ్రీనివాస్, లోక భూపతిరెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్త, కేశ్‌పల్లి ఆనంద్‌రెడ్డి, బస్వ లక్ష్మినర్సయ్య, శివప్ప,  గురూజీ బాబుసింగ్‌రాథోడ్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.  

పోలీసులపై తీరుపై అసహనం
ముగింపు సభలో కేంద్రమంత్రి మాట్లాడుతుండగా ఎమ్మార్పీఎస్‌ నాయకులు నిరసన తెలిపారు. వర్గీకరణపై బీజేపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని  నినాదాలు చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.  అయితే, పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాం అసహనం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ పునరుద్ధరించాలని బీజేపీ నాయకులు పాదయాత్ర చేసి ముగింపు సభ నిర్వహిస్తే కొందరు  వచ్చి నిరసన తెలుపుతుంటే పోలీసులు చూస్తూ ఉండడం ఏమిటని ప్రశ్నించారు. చేతులు కట్టుకోవడానికి వచ్చారా? అని అసహనం వ్యక్తం చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement