hansraj gangaram
-
‘కేంద్రం తీరు చట్టం స్ఫూర్తికే విఘాతం’
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ విభజన చట్టంలోని అంశాలను చాలా వరకు అమలు చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం రాజ్యసభలో తెలిపారు. ఏపీ విభజన బిల్లుపై కాంగ్రెస్ సభ్యుడు ఎంపీ కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. షెడ్యూల్ 13లోని ఆంశాలు అమలు వివిధ దశల్లో ఉన్నట్లు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పూర్తికి కొంత సమయం పడుతోందని మంత్రి తెలిపారు. సెక్షన్ ప్రకారం 13వ షెడ్యూల్లోని అంశాలను పదేళ్లలో పూర్తి చేయాలని చట్టంలో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి విభజన చట్టంలో పొందుపరిచినట్లు విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజ్యసభలో కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం స్ఫూర్తికే విఘాతం కలిగించేలా కేంద్ర కాలయాపన చేస్తోందని వ్యాఖ్యానించారు. తక్షణమే గిరిజన వర్సిటీ ఏర్పాటుకు అవసరమైన చట్టసవరణ కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
1662 వెబ్సైట్లు, కంటెంట్ బ్లాక్..
సాక్షి, న్యూఢిల్లీ : వదంతులు, బూటకపు వార్తలు వ్యాప్తి చేస్తోన్న వెబ్సైట్లను, అందులోని కంటెంట్‌ను సామాజిక మాధ్యమ వేదికల నుంచి తొలగించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం మంగళవారం తెలిపారు. కేంద్రం ఆదేశాల మేరకు ఫేస్బుక్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాలు 1662 ఫేక్ వెబ్సైట్లను బ్లాక్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 1076 యూఆర్ఎల్(యూనిఫాం రీసోర్స్ లొకేటర్)లను బ్లాక్ చేయాల్సిందిగా కోరగా.. ఫేస్బుక్ 956 యూఆర్ఎల్లను బ్లాక్ చేసినట్లు తెలిపారు. అదే విధంగా ట్విటర్ 728కి 409, యూట్యూబ్ 182కు 152 , ఇన్స్టాగ్రామ్ 66 యూఆర్ఎల్లను బ్లాక్ చేసినట్లు లోక్‌సభలో వెల్లడించారు. జనవరి, 2017 నుంచి జూన్ 2018 వరకు వీటిని బ్లాక్ చేసినట్లు తెలిపారు. ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 69ఏను అనుసరించి సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పలు చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. వదంతుల కారణంగా దేశ వ్యాప్తంగా మూక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. వదంతుల ప్రచారానికి ఉపయోగపడుతున్న వేదికలను కూడా ప్రేరేపకాలుగానే భావిస్తామని, అవి ప్రేక్షక పాత్ర వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించిన విషయం తెలిసిందే. వదంతులను ప్రచారం చేస్తున్న పోకిరీలు వాడే సాధనాలు తమ బాధ్యత, జవాబుదారీతనం నుంచి తప్పించుకోజాలవని పేర్కొన్న కేంద్రం.. అవి ప్రేక్షక పాత్ర వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది. -
‘చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు’
సాక్షి, హైదరాబాద్: బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రమంత్రి హన్స్‌రాజ్ గంగారామ్‌ను బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కోరారు. బుధ వారం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్రమంత్రిని కలసి బీసీల సమస్యల గురించి చర్చించారు. పార్లమెంట్ లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50% స్థానాలు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. బీసీ విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్‌ను తీసివేయాలన్నారు. బీసీ అట్రాసిటీ యాక్ట్ తేవాలని కోరామన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. 8న పాండిచ్చేరిలో పర్యటించి అక్కడి అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టడానికి సీఎంపై ఒత్తిడి తెస్తామన్నారు. -
ఆశీర్వదించండి
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో తాము అధికారంలో లేకపోయినా అభివృద్ధి కోసం ఎన్నో నిధులు కేటాయిస్తున్నామని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం అహేర్ హామీ కోరారు. తెలంగాణ ప్రజలు ఎంతో చైతన్యవంతులని, తమ పార్టీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక నిజాం చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కృషి చేస్తామని ఇచ్చారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ విషయమై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రధానితో చర్చించాలని సూచించారు. చెరుకు రైతుల చర్నాకోల్ మహా పాదయాత్ర ముగిం పు సందర్భంగా ఆదివారం బోధన్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. చెరుకు రైతులు, కార్మికులకు భరోసా కల్పించేందుకు నాయకులు పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తాము ఎప్పుడూ అధికారంలో లేకపోయినా.. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి నిధులు ఇస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఆర్మూర్ – ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. గోదావరి, పెన్‌గంగా నదులపై నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులకు వెంటవెంటనే అనుమతులిచ్చామని, మహారాష్ట్రలోని తమ ప్రభుత్వం కూడా ఇందుకు అంగీకరించిందని పేర్కొన్నారు. అధికారం కష్టమేమీ కాదు.. త్రిపుర వంటి ఈశాన్య రాష్ట్రాల మాదిరి తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. విదేశాలకు వలస వెళ్లకుండా స్థానికంగా ఉపాధి కల్పించేందుకు యువతకు నైపుణ్య అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు మూత పడ్డాయని, రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు సైతం ఇదే ధోరణితో ముందుకెళుతోందని విమర్శించారు. ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారిని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజ్యసభకు పంపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని శాసన మండలి బీజేపీ పక్ష నేత రాంచంద్రరావు విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు చేసుకోవడమే గుణాత్మకమైన మార్పా అని ప్రశ్నించారు. ప్రజాసమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, 140 కిలోమీటర్ల పాదయాత్రలో ఎన్నో సమస్యలు దృష్టికి వచ్చాయని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. బోధన్ చక్కెర కర్మాగారాన్ని ప్రైవేటుకు ధారాదత్తం చేసిన చంద్రబాబు మహా పాపాత్ముడని, దీన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ నిలబెట్టుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనతోనే రైతుల సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలిస్తామని ప్రకటించిన కేసీఆర్ పాలనలో ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ విమర్శించారు. చక్కెర కర్మాగారం కార్మికులకు వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని, మహిళా సంఘాలకు రూ.2,200 కోట్ల వడ్డీ రాయితీ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికార ప్రతినిధి అడ్లూరు శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు, కార్మికులకు అండగా నిలిచేందుకు చేపట్టిన పాదయాత్రకు అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు పల్లెగంగారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్, లోక భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్త, కేశ్‌పల్లి ఆనంద్‌రెడ్డి, బస్వ లక్ష్మినర్సయ్య, శివప్ప, గురూజీ బాబుసింగ్రాథోడ్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పోలీసులపై తీరుపై అసహనం ముగింపు సభలో కేంద్రమంత్రి మాట్లాడుతుండగా ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన తెలిపారు. వర్గీకరణపై బీజేపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నినాదాలు చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అసహనం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ పునరుద్ధరించాలని బీజేపీ నాయకులు పాదయాత్ర చేసి ముగింపు సభ నిర్వహిస్తే కొందరు వచ్చి నిరసన తెలుపుతుంటే పోలీసులు చూస్తూ ఉండడం ఏమిటని ప్రశ్నించారు. చేతులు కట్టుకోవడానికి వచ్చారా? అని అసహనం వ్యక్తం చేశారు. -
ఓబీసీ వర్గీకరణతోనే సరైన న్యాయం
సాక్షి, హైదరాబాద్: ఓబీసీ వర్గీకరణతోనే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అన్నారు. ఆదివారం లక్డీకాపూల్‌లో జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం, బీసీ ప్రతినిధుల సంఘం సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయన్నారు. వర్గీకరణపై త్వరలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, ఇందులో ఓబీసీల డిమాండ్లు స్పష్టం చేయాలని బీసీ సంక్షేమ సంఘానికి సూచించారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించేందుకు కృషి చేస్తున్నామని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ జనాభాలో బీసీలే అధికంగా ఉన్నారని, వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్న సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. -
పుణ్యస్నానం ఆచరించిన కేంద్ర మంత్రి
బాల్కొండ (నిజామాబాద్): కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ ఆదివారం మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లా పోచంపాడు వద్ద గోదావరిలో పుణ్య స్నానాలు చేశారు. ముగ్గురు పిల్లలు సహా ఇతర కుటుంబ సభ్యులతో కలసి ఆయన ఇక్కడకు విచ్చేశారు. ఆయన వెంట బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఇతర నేతలు ఉన్నారు. అనంతరం కేంద్ర మంత్రి బాసర వెళ్లనున్నారు.