
సాక్షి, న్యూఢిల్లీ : వదంతులు, బూటకపు వార్తలు వ్యాప్తి చేస్తోన్న వెబ్‌సైట్లను, అందులోని కంటెంట్‌ను సామాజిక మాధ్యమ వేదికల నుంచి తొలగించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం మంగళవారం తెలిపారు. కేంద్రం ఆదేశాల మేరకు ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాలు 1662 ఫేక్ వెబ్‌సైట్లను బ్లాక్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 1076 యూఆర్‌ఎల్(యూనిఫాం రీసోర్స్ లొకేటర్)లను బ్లాక్ చేయాల్సిందిగా కోరగా.. ఫేస్‌బుక్ 956 యూఆర్‌ఎల్‌లను బ్లాక్ చేసినట్లు తెలిపారు. అదే విధంగా ట్విటర్ 728కి 409, యూట్యూబ్ 182కు 152 , ఇన్‌స్టాగ్రామ్ 66 యూఆర్‌ఎల్‌లను బ్లాక్ చేసినట్లు లోక్‌సభలో వెల్లడించారు. జనవరి, 2017 నుంచి జూన్ 2018 వరకు వీటిని బ్లాక్ చేసినట్లు తెలిపారు. ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 69ఏను అనుసరించి సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పలు చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
వదంతుల కారణంగా దేశ వ్యాప్తంగా మూక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. వదంతుల ప్రచారానికి ఉపయోగపడుతున్న వేదికలను కూడా ప్రేరేపకాలుగానే భావిస్తామని, అవి ప్రేక్షక పాత్ర వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించిన విషయం తెలిసిందే. వదంతులను ప్రచారం చేస్తున్న పోకిరీలు వాడే సాధనాలు తమ బాధ్యత, జవాబుదారీతనం నుంచి తప్పించుకోజాలవని పేర్కొన్న కేంద్రం.. అవి ప్రేక్షక పాత్ర వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment