బాగు చేయరు.. కొత్తది కొనరు!
Published Wed, Dec 11 2013 12:39 AM | Last Updated on Sat, Aug 18 2018 2:15 PM
పరిగి, న్యూస్‌లైన్: పరిగిలో ఉన్నది రెఫరల్ ఆస్పత్రి కావడంతో ప్రారంభంలో ప్రభుత్వం రోగులను తరలించేందుకు ఓ అంబులెన్స్‌ను కేటాయించింది. కొన్నాళ్లకే రిపేర్లు రావడంతో అధికారులు మరమ్మతులు చేయించకుండా మూలకు పడేశారు. ఏళ్లుగా దాన్ని పట్టించుకోక పోవడంతో అది మరింత పనికి రాకుండా పోయింది. అయితే నిధులు మంజూరు కావడంతో గత వేసవిలో బాగు చేయించారు. సుమారు రూ.20 వేల వరకు ఖర్చు వచ్చింది. కానీ నెలలోపే మళ్లీ షెడ్డుకు చేరింది. ఇక దీంతో పనికాదని, కొత్తది కొనాల్సిందేనన్న నిర్ణయానికొచ్చిన అధికారులు మరమ్మతులకు ముందుకు రాలేదు.
మరమ్మతులు లేవు... కొత్తదీ రాదు
సాధారణంగా ప్రభుత్వ ఆస్పత్రికి నిరుపేదలే వస్తుంటారు. వీరిని పరీక్షించి అవసరమైతే ప్రైవేటు ఆస్పత్రికి తరలించాల్సి ఉంటుంది. ఈ ఆస్పత్రిలో అంబులెన్స్ ఉంటే డీజిల్ వంటి ఖర్చుకు కేవలం ఐదారు వందల్లో పని అయిపోయేది. కానీ ప్రైవేటు వాహనం మాట్లాడుకోవాలంటే కనీసం రూ.రెండు వేల నుంచి రూ.మూడు వేలు అడుగుతున్నారు. అయినా భరించక తప్పని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో హైదరాబాద్‌కు రెఫర్ చేసినా.. స్థానికంగానే ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు.
అందరివీ.. కేవలం ‘హామీ’లే
ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈ ఆస్పత్రిని సందర్శించిన ప్రతిసారి అంబులెన్స్ ఇచ్చేస్తామని హామీలిచ్చారు. కానీ ఏ ఒక్కరూ ఆ తర్వాత పట్టించుకోలేదు. ఇక స్థానిక అధికారులు చాలాసార్లు ప్రతిపాదనలు పంపామని చేతులు దులుపుకున్నారు. గతంలో ఓసారి మంత్రి ప్రసాద్‌కుమార్ పరిగి ఆస్పత్రిలో అదనపు గదులను ప్రారంభించేందుకు వచ్చారు. అంబులెన్స్ లేని విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. కొనుగోలుకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి సైతం అనేకసార్లు ఆస్పత్రిని సందర్శించిన సమయంలో అంబులెన్స్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ వీరిలో ఎవరూ హామీని నిలబెట్టుకోలేదు.
Advertisement
Advertisement