పరిగి, న్యూస్‌లైన్: ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం పేదలకు అంతంతమాత్రంగా మారింది. అన్ని రకాల చికిత్సల కోసం పరిగిలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార, సామాజిక వైద్య కేంద్రంలో సేవలు అధ్వానంగా మారాయి. వైద్యులు, సిబ్బంది సరిగ్గా ఆస్పత్రికి రావడం లేదని, వైద్య సేవల్లో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. ఒక్కోసారి కనీసం పరీక్షించకుండానే హైదరాబాద్, వికారాబాద్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారని, సాధారణ కాన్పు అయ్యే పరిస్థితి ఉన్నా పెద్దాస్పత్రులకు వెళ్లగొడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైద్యులు, సిబ్బంది తీరుతో విసిగిపోయిన పలువురు రోగులు బుధవారం పరిగి ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పీఏసీఎస్ డెరైక్టర్ లాలుకృష్ణ ప్రసాద్, జెడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు ఉస్మాన్ తదితరులు అక్కడికి చేరుకొని వైద్యుల తీరుపై మండిపడ్డారు. ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఓపీ సైతం సక్రమంగా చూడటం లేదని, నర్సులే ఏవో రెండు మాత్రలు చేతిలో పెట్టి పంపిచేస్తున్నారని ఆరోపించారు.
డెంటల్ డాక్టరే ఓపీ పర్యవేక్షణ!
పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో ఇష్టారాజ్యంగా వైద్యసేవలు కొనసాగుతున్నా పైఅధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని రోగులు విమర్శిస్తున్నారు. నెలలో ఎక్కువ రోజులు డెంటల్ డాక్టరే ఓపీ మొదలుకుని వైద్య సేవలన్నీ ఆయనే చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో మొత్తం ఐదుగురు వైద్యులు ఉండగా వంతులవారీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్కొక్కరు రెండు రోజులు వరుసగా డ్యూటీ చేస్తే, మిగతా వారి వంతులు ముగిసేదాకా అంటే ఎనిమిది రోజుల దాకా డ్యూటీకీ రావడం లేదు.
రిపోర్టు కోసం మూడురోజులుగా తిరుగుతున్నా...
గత సోమవారం ఆస్పత్రికి వస్తే రక్తపరీక్షలు చేయించుకోమన్నారు. పరీక్షలకోసం రక్తం, తెమడ ఇచ్చాను. మధ్యాహ్నం రిపోర్టు ఇస్తామన్న వారు ఇప్పటికీ ఇవ్వలేదు. బుధవారం మధ్యాహ్నం వస్తే, పొద్దున్నే ఎందుకు రాలేదంటూ సిబ్బంది నన్నే కొప్పడుతున్నారు.
- లక్ష్మి, కిష్టాపూర్
రెండు గోలీలు ఇచ్చి పొమ్మన్నరు...
రెండు రోజుల నుంచి జ్వరం వస్తుంటే చూపించుకుందామని దవాఖానాకు వచ్చి మధ్యాహ్నం దాకా కూర్చున్నా. నర్సు దగ్గరికి పోతే డాక్టర్ రెస్టు తీసుకుంటున్నడని చెప్పింది. నీకేమైంది బాగానే ఉన్నావు కదా అంటూ రెండు మందు గోలీలు చేతిలో పెట్టి వెళ్లిపొమ్మన్నది.
- ఎల్లమ్మ, నారాయణ్‌పూర్
వాళ్లే ప్రైవేట్‌కు పొమ్మన్నరు
వారంరోజుల క్రితం కూతురి కాన్పు కోసం వస్తే ప్రైవేటు ఆస్పత్రిలో చేయించుకోమ్మని పంపించి వేశారు. రూ.20వేలు ఖర్చు చేసి వికారాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో కాన్పు చేయించాం. ప్రభుత్వం ఇచ్చే పైసల కోసం వస్తే ప్రైవేటులో కాన్పు చేయించుకుంటే ఇచ్చేది లేదంటున్నారు.
- ఫర్హానా, మల్లెమోనిగూడ
నిర్లక్ష్యపు సేవలు
Published Thu, Oct 31 2013 12:46 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement