తర'గతి' మారుతోంది | No Bag Day In Govt Schools | Sakshi
Sakshi News home page

తర'గతి' మారుతోంది

Published Tue, Jun 11 2019 8:37 AM | Last Updated on Tue, Jun 11 2019 9:25 AM

No Bag Day In Govt Schools - Sakshi

సాక్షి, సీతంపేట (శ్రీకాకుళం): వీధి బడి రాత మారనుంది. సర్కారు స్కూళ్ల తర‘గతులు’ కొత్త దారి పట్టనున్నాయి. గత ప్రభుత్వపు పాలనలో కార్పొరేట్‌ విద్యాసంస్థలకు జరిగిన సాయం, ప్రభుత్వ బడులకు జరిగిన అన్యాయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ బడుల్లో కనీస మౌలిక వసతులు కల్పించకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. ప్రస్తుత ప్రభుత్వం విద్యారంగంపై ప్రజల్లో నమ్మకం కల్పించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించి, తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శ్రీకారం చుడుతున్నారు. ఈ విధానాలు ఈ విద్యాసంవత్సరం నుంచే అమలయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుం డడంపై హర్షం వ్యక్తమవుతోంది.

అనేక సదుపాయాలు..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంను ఉచితంగా అందిస్తున్నారు. తెలుగు మీడియంతోపాటు ఆంగ్ల మీడియంలోనూ బోధన జరుగుతోంది. ప్రభుత్వ బడుల్లో అర్హులైన ఎందరో ఉపాధ్యాయులు ఉన్నారు. ఒత్తిడి లేని నాణ్యమైన విద్యనందిస్తున్నారు. విశాలమైన తరగతి గదులున్నాయి. అయినా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లోనే చేర్పిస్తున్నారు. ధనవంతులే కాకుండా సాధారణ, మధ్య తరగతి ప్రజలు సైతం ప్రైవేటుకు మొగ్గు చూపుతున్నారు. గత ప్రభుత్వం కార్పొరేట్‌ విద్యాసంస్థలకు కొమ్ముకాయడంతో ప్రభుత్వ విద్యావ్యవస్థ నిర్వీర్యమైంది. మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమైంది. తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పోయింది. కొత్త ప్రభుత్వం ప్రక్షాళన దిశగా ముందుకు సాగుతోంది. ప్రభుత్వ బడులకు పూర్వవైభవం తీసుకువచ్చి తల్లిదండ్రుల్లో నమ్మకం కల్పించేందుకు సిద్ధమవుతోంది. కొత్త ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా 2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యాశాఖ క్యాలెండర్‌ పక్కాగా రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఆటపాటలతో చదువులు..
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో నూతన అధ్యయనానికి శ్రీకారం చుడుతోంది. విద్యార్థులపై ఒత్తిడి లేని విధంగా ఆటపాటలతో చదువులు సాగేలా సరికొత్త విద్యా విదానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. బండెడు పుస్తకాలతో బ్యాగులు మోస్తున్న విద్యార్థులకు భారాన్ని తగ్గించేలా శనివారం ఒక్క రోజు నో బ్యాగ్‌డేను అమలు చేయనున్నారు. వారంలో ఒక రోజు స్కూల్‌కు బ్యాగు లేకుండానే వచ్చి విద్యార్థులు రోజంతా ఆడుతూ, పాడుతూ చదివేలా సరికొత్తగా విద్యా క్యాలెండర్‌ రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. దీని కోసం విద్యారంగ నిపుణులు, ఉపాధ్యాయ సంఘాల సలహాలు సూచనలు తీసుకుని ఈ విద్యాసంవత్సరం నుంచే అమలయ్యేల కార్యచరణ సిద్ధం చేస్తున్నారు.

ప్రక్షాళన దిశగా కేంద్ర ప్రభుత్వం..
విద్యా విధానంలో పెను మార్పులు తీసుకువచ్చేలా కేంద్రం సైతం ప్రక్షాళన దిశగా అడు గు లేస్తూ నూతన విద్యా విధానానికి శ్రీకా రం చుడుతోంది. ఇందులో భాగంగానే ఇది వరకు పాఠశాల విద్యలో దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న 10+2 స్థానంలో 5+3+3+4 దశలుగా ప్రవేశపెట్టనుంది. 50 ఏళ్లుగా 1 నుంచి ఐదు తరగతి వరకు ప్రాథమిక, 6 నుంచి 8 వరకు ప్రాథమికోన్నత, 9.10 తరగతులు సెకండరీ, 11, 12 తరగతులు హ య్యర్‌ సెకండరీ, ఇంటర్మీడియెట్, ప్రీ యూనివర్సిటీ తదితర పేర్లతో నడుస్తోంది. కొత్తగా తీసుకువచ్చే విధానంలో పిల్లల్లో పుట్టినప్పటి నుంచి చోటు చేసుకునే శారీరక, మానసిక మార్పులకు అనుగుణంగా కేంద్రం పాఠశాల విద్యను 5+3+3+4 నాలుగు దశలుగా విభజించింది. దీని ప్రకారం ఫౌండేషనల్‌ స్టేజీ: 3 ఏళ్లు ప్రీ ప్రైమరీ స్కూల్‌ 1, 2 తరగతులు లేటర్‌ ప్రైమరీ/ప్రీపరేటరీ: 3, 4, 5మిడిల్‌/అప్పర్‌ప్రైమరీ: 6, 7, 8 తరగతులు

శుభ పరిణామం
రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ బడులకు పూర్వ వైభవం రానుంది. తద్వారా ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగుతుది. ఒత్తిడి లేని విద్యావిధానం, నోబ్యాగ్‌డే వంటి సీఎం ఆలోచనలకు అనుగుణంగా విద్యావిధానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. 
– నెల్లి సత్యంనాయుడు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు, పెద్దూరు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 

ప్రభుత్వ బడులపై నమ్మకం పెరుగుతుంది
ప్రభుత్వ బడులకు జీవం పోస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాలతో తల్లిదండ్రుల్లో ప్రభుత్వ బడులపై నమ్మకం పెరుగుతుంది. విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం, దానికి అనుగుణంగా విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చించడం శుభపరిణామం. అలాగే ఉపాధ్యాయ సంఘాలను భాగస్వామ్యం చేయడంతో ప్రభుత్వ విద్యారంగానికి మరింత మేలు చేకూరుతుంది. 
– ఆరిక భాస్కరరావు, యూటీఎఫ్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement