no bag day
-
సీఎం స్ఫూర్తికి ప్రై‘వేటు’
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ‘నో...స్కూల్ బ్యాగ్ డే’ పాటించాలని మూడు నెలల ముందే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినా బే ఖాతరంటూ ప్రయివేటు పాఠశాలలు తమ పాత దారిలోనే నడుస్తున్నాయి. యథేచ్ఛగా ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నా విద్యాశాఖ నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బండెడు పుస్తకాల బరువుతో చిన్నారులు పడుతున్న కష్టాలను ప్రజాసంకల్ప యాత్రలో చూసి చలించిన అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ‘నో బ్యాగ్ డే’ అమలుకు శ్రీకారం చుట్టారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ ఉన్న విద్యార్థులకు నెలలో మొదటి, మూడో శనివారం దీనిని కచ్చితంగా అమలు చేయాలని జూలై నెలలో ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటా అమలుకు ఆదేశాలు వచ్చాయి. కేవలం పుస్తకాలకే పరిమితమైపోతున్న విద్యార్థులలో మానసిక ఒత్తిడిని దూరం చేసి సృజనాత్మకతను వెలికితీయాలనే సదుద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం జిల్లాలో ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల నిర్వాకంతో అటకెక్కుతోంది. ‘సాక్షి’ బృందం శనివారం జిల్లాలోని ప్రైవేటు యాజమాన్యాల్లో నడుస్తున్న పాఠశాలలపై నిఘా పెట్టగా డొల్లతనం బట్టబయలైంది. విద్యా డివిజన్లు ప్రైవేటు స్కూళ్లు విద్యార్థులు అమలాపురం 85 15,999 కాకినాడ 124 23,566 పిఠాపురం 80 17,903 రామచంద్రాపురం 80 16,672 రాజమహేంద్రవరం 102 21,135 మొత్తం 471 94,275 ఆ రోజు ఏమి చేయాలి...? ‘నో బ్యాగ్ డే’ పేరుతో ఆనంద పాఠాలు బోధించేలా ప్రణాళికను ప్రభుత్వం రూపొందించింది. ఉదయం నాలుగు తరగతుల్లో నీతి కథల బోధన, చిత్రలేఖనం, నైతిక విలువలు, సేవా కార్యక్రమాలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించాలి. అనంతరం క్రీడలు, యోగాసనాలపై శిక్షణ ఇవ్వాలి. కథలు చదవడం, చెప్పడం, అనుభవాలు పంచుకోవడం, పొడుపు కథలు, పజిల్స్, సరదాగా ఆటలు ఆడించాలి. అలాగే పాఠశాలలో సాగు చేస్తున్న బడితోటలో పాదులు వేయడం, కలుపు తీయడం, పందిరి వేయడం, ఎరువులు వేయడం వంటి వాటిని అలవాటు చేయాలి. గ్రంథాలయాల్లో పుస్తకాలను ఎంపిక చేసుకుని చదవడం, వాటిపై చర్చించే అంశాలు నేర్పించాలి. ఆరోగ్య కార్యకర్తలు, మున్సిపల్, వ్యవసాయదారులు, తదితర పెద్దలను పిలిచి పిల్లలతో మాట్లాడించాలి. 1, 2 తరగతుల విద్యార్థులకు ఇంటి పని (హోంవర్క్) ఇవ్వకూడదు. జాతీయ విద్యా పరిశోధన మండలి సూచనల ప్రకారం 1, 2 తరగతులకు భాష, గణితం, 3, 4 తరగతులకు సామాన్య శాస్త్రం, గణితం తప్ప ఇతర సబ్జెక్ట్ పుస్తకాలు ఉండకూడదు. అదనపు పుస్తకాలు తీసుకు రావాలని యాజమాన్యాలు ఒత్తిడి చేయకూడదు. అదనపు మెటీరియల్ ఇచ్చినా అవన్నీ కలిపి కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ సూచించిన పుస్తకాల బరువును మించకూడదు. వీటిని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాటించడం లేదు. అన్ని పాఠశాలలూ పాటించాలి.. ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలన్నింటిలోనూ ‘నో బ్యాగ్ డే’ అమలు చేయాలి. ఈ మేరకు అన్ని మండలాల అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ప్రభుత్వ పాఠశాలలు నూరు శాతం అమలు చేస్తున్నాయి. కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో పక్కాగానే వీటిని అమలు చేస్తున్నారు. అమలు చేయని యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం. -డి.అబ్రహం, జిల్లా విద్యాశాఖాధికారి -
తర'గతి' మారుతోంది
సాక్షి, సీతంపేట (శ్రీకాకుళం): వీధి బడి రాత మారనుంది. సర్కారు స్కూళ్ల తర‘గతులు’ కొత్త దారి పట్టనున్నాయి. గత ప్రభుత్వపు పాలనలో కార్పొరేట్ విద్యాసంస్థలకు జరిగిన సాయం, ప్రభుత్వ బడులకు జరిగిన అన్యాయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ బడుల్లో కనీస మౌలిక వసతులు కల్పించకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. ప్రస్తుత ప్రభుత్వం విద్యారంగంపై ప్రజల్లో నమ్మకం కల్పించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించి, తిరిగి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శ్రీకారం చుడుతున్నారు. ఈ విధానాలు ఈ విద్యాసంవత్సరం నుంచే అమలయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుం డడంపై హర్షం వ్యక్తమవుతోంది. అనేక సదుపాయాలు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంను ఉచితంగా అందిస్తున్నారు. తెలుగు మీడియంతోపాటు ఆంగ్ల మీడియంలోనూ బోధన జరుగుతోంది. ప్రభుత్వ బడుల్లో అర్హులైన ఎందరో ఉపాధ్యాయులు ఉన్నారు. ఒత్తిడి లేని నాణ్యమైన విద్యనందిస్తున్నారు. విశాలమైన తరగతి గదులున్నాయి. అయినా చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లోనే చేర్పిస్తున్నారు. ధనవంతులే కాకుండా సాధారణ, మధ్య తరగతి ప్రజలు సైతం ప్రైవేటుకు మొగ్గు చూపుతున్నారు. గత ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాయడంతో ప్రభుత్వ విద్యావ్యవస్థ నిర్వీర్యమైంది. మౌలిక సదుపాయాల కల్పనలో విఫలమైంది. తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పోయింది. కొత్త ప్రభుత్వం ప్రక్షాళన దిశగా ముందుకు సాగుతోంది. ప్రభుత్వ బడులకు పూర్వవైభవం తీసుకువచ్చి తల్లిదండ్రుల్లో నమ్మకం కల్పించేందుకు సిద్ధమవుతోంది. కొత్త ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా 2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యాశాఖ క్యాలెండర్ పక్కాగా రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆటపాటలతో చదువులు.. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో నూతన అధ్యయనానికి శ్రీకారం చుడుతోంది. విద్యార్థులపై ఒత్తిడి లేని విధంగా ఆటపాటలతో చదువులు సాగేలా సరికొత్త విద్యా విదానాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. బండెడు పుస్తకాలతో బ్యాగులు మోస్తున్న విద్యార్థులకు భారాన్ని తగ్గించేలా శనివారం ఒక్క రోజు నో బ్యాగ్‌డేను అమలు చేయనున్నారు. వారంలో ఒక రోజు స్కూల్‌కు బ్యాగు లేకుండానే వచ్చి విద్యార్థులు రోజంతా ఆడుతూ, పాడుతూ చదివేలా సరికొత్తగా విద్యా క్యాలెండర్ రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. దీని కోసం విద్యారంగ నిపుణులు, ఉపాధ్యాయ సంఘాల సలహాలు సూచనలు తీసుకుని ఈ విద్యాసంవత్సరం నుంచే అమలయ్యేల కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. ప్రక్షాళన దిశగా కేంద్ర ప్రభుత్వం.. విద్యా విధానంలో పెను మార్పులు తీసుకువచ్చేలా కేంద్రం సైతం ప్రక్షాళన దిశగా అడు గు లేస్తూ నూతన విద్యా విధానానికి శ్రీకా రం చుడుతోంది. ఇందులో భాగంగానే ఇది వరకు పాఠశాల విద్యలో దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న 10+2 స్థానంలో 5+3+3+4 దశలుగా ప్రవేశపెట్టనుంది. 50 ఏళ్లుగా 1 నుంచి ఐదు తరగతి వరకు ప్రాథమిక, 6 నుంచి 8 వరకు ప్రాథమికోన్నత, 9.10 తరగతులు సెకండరీ, 11, 12 తరగతులు హ య్యర్ సెకండరీ, ఇంటర్మీడియెట్, ప్రీ యూనివర్సిటీ తదితర పేర్లతో నడుస్తోంది. కొత్తగా తీసుకువచ్చే విధానంలో పిల్లల్లో పుట్టినప్పటి నుంచి చోటు చేసుకునే శారీరక, మానసిక మార్పులకు అనుగుణంగా కేంద్రం పాఠశాల విద్యను 5+3+3+4 నాలుగు దశలుగా విభజించింది. దీని ప్రకారం ఫౌండేషనల్ స్టేజీ: 3 ఏళ్లు ప్రీ ప్రైమరీ స్కూల్ 1, 2 తరగతులు లేటర్ ప్రైమరీ/ప్రీపరేటరీ: 3, 4, 5మిడిల్/అప్పర్‌ప్రైమరీ: 6, 7, 8 తరగతులు శుభ పరిణామం రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ బడులకు పూర్వ వైభవం రానుంది. తద్వారా ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగుతుది. ఒత్తిడి లేని విద్యావిధానం, నోబ్యాగ్‌డే వంటి సీఎం ఆలోచనలకు అనుగుణంగా విద్యావిధానంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. – నెల్లి సత్యంనాయుడు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు, పెద్దూరు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రభుత్వ బడులపై నమ్మకం పెరుగుతుంది ప్రభుత్వ బడులకు జీవం పోస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయాలతో తల్లిదండ్రుల్లో ప్రభుత్వ బడులపై నమ్మకం పెరుగుతుంది. విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొస్తూ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం, దానికి అనుగుణంగా విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చించడం శుభపరిణామం. అలాగే ఉపాధ్యాయ సంఘాలను భాగస్వామ్యం చేయడంతో ప్రభుత్వ విద్యారంగానికి మరింత మేలు చేకూరుతుంది. – ఆరిక భాస్కరరావు, యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు -
నో బ్యాగ్.. నో హోంవర్క్
గుంటూరు ఎడ్యుకేషన్: బుడి బుడి అడుగులు వేసుకుంటూ పాఠశాలకు వెళ్లే చిన్నారులకు పుస్తకాల బ్యాగుల భారం తొలగనుంది. ఉదయాన్నే పుస్తకాల బ్యాగులను భుజానికెత్తుకుని, పాఠశాలకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు వీపులు ఒంగిపోయే రీతిలో అవే బ్యాగులను మోసుకురావాల్సిన అవసరం ఇకపై ఉండదు. మోయలేని భారంగా మారిన బ్యాగులు, ఇంటికి వెళ్లాక సైతం వదలని హోంవర్క్ భారం నుంచి చిన్నారులకు ఉపశమనం కలిగిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నేప«థ్యంలో జిల్లాలో సీబీఎస్ఈ సిలబస్ అమలు చేస్తున్న పాఠశాలల్లో వీటిని అమలు చేయాల్సి ఉంది. ఒకటి, రెండు తరగతులు చదువుతున్న చిన్నారులకు బండెడు పుస్తకాలతో నిండిన బ్యాగులు, హోం వర్క్ కారణంగా వారిలో ఎదిగే వయసులో సహజంగా బయటకు రావాల్సిన సృజనాత్మకత నైపుణ్యాలు దెబ్బతిని మానసిక ఒత్తిడికి గురవుతున్నారని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో 6,7 ఏళ్ల వయసు చిన్నారులకు ఇది ఎంత మాత్రం సరైనది కాదని పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైకోర్టు సైతం వారితో ఏకీభవించి, దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని సీబీఎస్ఈ బోర్డును ఆదేశించింది. సీబీఎస్ఈ బోర్డు ఉత్తర్వుల ప్రకారం 1, 2వ తరగతుల చిన్నారులకు నో బ్యాగ్... నో హోం వర్క్‌ను అమలు పర్చాల్సి ఉంది.ఈ విధానంపై సీబీఎస్ఈ బోర్డు గతంలోనే మార్గదర్శకాలు విడుదల చేసినప్పటికీ దేశ వ్యాప్తంగా అమలుకు నోచుకోలేదు. ర్యాంకులు, మార్కుల వేటలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఈ విధానానికి విరుద్ధంగా వ్యహరిస్తున్నాయి. దీంతో సీబీఎస్ఈ బోర్డు ఉత్తర్వులు అటకెక్కాయి. దీనిపై పలువురు విద్యావేత్తలు ఇటీవల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు వారి వాదనలతో ఏకీభవించింది. ఒకటి, రెండో తరగతులకు అమలు సీబీఎస్ఈ బోర్డు విడుదల చేసిన మార్గదర్శకాలు ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే పూర్తిస్థాయిలో అమలు చేయాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపధ్యంలో జిల్లాలోని ఆయా పాఠశాలల్లో అమలు పర్చే విధానంపై అధికార యంత్రాంగం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాలి. కాగా జిల్లాలో సీబీఎస్ఈ బోర్డు గుర్తింపు పొందిన పాఠశాలలు 40 ఉండగా, గుంటూరు నగర పరిధిలోని కేంద్రీయ విద్యాలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు యాజమాన్యంలో మరో 39 పాఠశాలలు ఉన్నాయి. చర్యలు చేపడతాం సీబీఎస్ఈ బోర్డు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లాలో సీబీఎస్ఈ సిలబస్ నిర్వహిస్తున్న పాఠశాలలకు ఆదేశాలు జారీ చేస్తాం. సీబీఎస్ఈ బోర్డు ఉన్నతాధికారులను సంప్రదించి సక్రమంగా అమలు జరిగేలా పర్యవేక్షిస్తాం. సీబీఎస్ఈ సిలబస్‌లో తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలు ఈ విధానాన్ని విధిగా అమలు పర్చాల్సిందే. – ఆర్ఎస్ గంగాభవానీ,జిల్లా విద్యాశాఖాధికారి -
శనివారం స్కూల్ బ్యాగ్‌లకు ‘సెలవు’
లక్నో : పాలనలో దూసుకెళుతున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బండెడు పుస్తకాలు వీపుకు తగిలించుకుని బడికి వెళ్లే విద్యార్థులకు యూపీ సర్కార్ తాజా నిర్ణయం ఊరటనివ్వనుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇది తీపి కబురే. ప్రతి శనివారం ఇక స్కూల్ బ్యాగ్‌లకు విద్యార్థులు ’టాటా’ చెప్పనున్నారు. ప్రయిమరీ, సెకండరీ పాఠశాలల్లో ఇక నుంచి ప్రతి శనివారం ’నో బ్యాగ్ డే’ని పాటించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఆ రోజు చదువును పక్కనపెట్టి.. విద్యార్థులకు కేవలం సంతోషకరమైన కార్యక్రమాలను మాత్రమే పాఠశాలల్లో నిర్వహించనున్నారు. దీనివల్ల విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య మంచి అవగాహనతో పాటు సానుకూల వాతావరణం నెలకొంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయంపై డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి దినేశ్ శర్మ ఇప్పటికే ఆమోద ముద్ర వేశారు. అలాగే ఈ విధానాన్ని కో ఎడ్యుకేషన్ స్కూళ్లలోనూ అమలు చేయనున్నారు. కాగా ఇకనుంచి జనాభా లెక్కలు, ఎన్నికల విధుల నిర్వహణకు ఉపాధ్యాయులను ఉపయోగించుకోరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.