లక్నో : పాలనలో దూసుకెళుతున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బండెడు పుస్తకాలు వీపుకు తగిలించుకుని బడికి వెళ్లే విద్యార్థులకు యూపీ సర్కార్ తాజా నిర్ణయం ఊరటనివ్వనుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇది తీపి కబురే. ప్రతి శనివారం ఇక స్కూల్ బ్యాగ్‌లకు విద్యార్థులు ’టాటా’ చెప్పనున్నారు. ప్రయిమరీ, సెకండరీ పాఠశాలల్లో ఇక నుంచి ప్రతి శనివారం ’నో బ్యాగ్ డే’ని పాటించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.
ఆ రోజు చదువును పక్కనపెట్టి.. విద్యార్థులకు కేవలం సంతోషకరమైన కార్యక్రమాలను మాత్రమే పాఠశాలల్లో నిర్వహించనున్నారు. దీనివల్ల విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య మంచి అవగాహనతో పాటు సానుకూల వాతావరణం నెలకొంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయంపై డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి దినేశ్ శర్మ ఇప్పటికే ఆమోద ముద్ర వేశారు. అలాగే ఈ విధానాన్ని కో ఎడ్యుకేషన్ స్కూళ్లలోనూ అమలు చేయనున్నారు. కాగా ఇకనుంచి జనాభా లెక్కలు, ఎన్నికల విధుల నిర్వహణకు ఉపాధ్యాయులను ఉపయోగించుకోరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.