
'మంత్రులను కించపరిచే స్థాయిలో ప్రభుత్వం లేదు'
విశాఖ:మంత్రులను కించపరిచే స్థాయిలో ప్రభుత్వం లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మంత్రులను ప్రభుత్వం తక్కువగా చూస్తూ అవమానానికి గురి చేస్తుందన్న మంత్రి బాలరాజు వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడిన గంటా..బాలరాజును ఎవరు కించపరిచారో చెప్పాలన్నారు.మంత్రులను కించపరిచే విధంగా ప్రభుత్వం వ్యవహరించలేదని తెలిపారు. కాగా, విభజన జరిగిందంటూ పురందేశ్వరి వ్యాఖ్యలను కూడా ఆయన ఖండించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాను వివక్షను ఎదుర్కొంటున్న ట్టు గిరిజన శాఖ మంత్రి బాలరాజు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. శాఖాపరంగానూ, సంక్షేమ కార్యక్రమాల పరంగానూ కొం త వివక్షకు గురవుతున్నానన్న భావన బాధ కలిగిస్తున్నదన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలోని క్లబ్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తన శాఖకు సంబంధించిన నిర్ణయాలన్నీ తన ప్రమేయం లేకుండానే జరుగుతున్నాయన్నారు. 7 (ఏ) క్లాజ్ ద్వారా ముఖ్యమంత్రికి ఉండే విస్తృత స్థాయి అధికారాలను ఉపయోగించుకొని నిర్ణయాలు తీసుకున్న సందర్భాలూ ఉన్నాయన్నారు.