సాక్షి, రంగారెడ్డి జిల్లా: :జిల్లాలో వర్షాధార పంటలు మినహా మిగతా సాగు అంతా భూగర్భ జలాలపైనే ఆధారపడింది. భూగర్భజలాలు కూడా క్రమంగా తగ్గిపోతుండడంతో రైతులు బిందు సేద్యం వైపు ఆసక్తి చూపుతున్నారు. పదేళ్ల క్రితం నుంచి జిల్లాలో రాయితీపై డ్రిప్, స్ప్రింక్లర్లు పంపిణీ చేస్తున్నారు. ఏటా కనిష్టంగా 2500 హెక్టార్లకుపైగా బిందుసేద్యం పరికరాలు రాయితీపై ఇస్తున్నారు. ఇదిలాఉంటే జిల్లాలో ప్రస్తుతం 30,463.59 హెక్టార్లలో (76,158 ఎకరాలు) బిందుసేద్యం కొనసాగుతుంది. తాజాగా ఈ ఏడాది జిల్లా సూక్ష్మ నీటిపారుదల శాఖకు ఇబ్బడిముబ్బడిగా రైతుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. తాజాగా ప్రభుత్వం బిందుసేద్యం పరికరాల పంపిణీ ఊసెత్తకపోవడంతో రైతుల్లో ఆందోళనలో మొదలైంది.
డిమాండ్ అధికం
బిందు సేద్యానికి జిల్లాలో మంచి డిమాండ్ ఉంది. యేటా ఈ సేద్యం చేసే రైతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రెండేళ్ల క్రితం జిల్లాలో 2500 హెక్టార్లకే పరిమితి ఉన్నప్పటికీ.. ప్రత్యేక కోటాలో మరో 1200 హెక్టార్లకు అధికంగా మంజూరు చేశారు. 2011-12 ఆర్థిక సంవత్సరంలో 3729.69 హెక్టార్లలో బిందుసేద్యం పరికరాలు పంపిణీ చేయగా 5,017 మంది రైతులు లబ్ధిపొందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరంలో పంపిణీ ప్రక్రియలో ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసినా.. 2649.82 హెక్టార్లకు బిందుసేద్యం పరికరాలు పంపిణీ చేయగా 3,310 మంది లబ్ధి పొందారు. తాజాగా 2013-14 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు 2600 హెక్టార్లకు గాను ఎంఐపీ అధికారులు ప్రణాళిక తయారు చేసినప్పటికీ.. ఇంతవరకూ ప్రభుత్వం మంజూరు చేయలేదు.
రాష్ట్ర వాటా ఊసేది?
బిందుసేద్యం పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 50 శాతం వాటా ఇస్తుంది. మిగిలిన వాటాను రాష్ట్ర ప్రభుత్వం భరించి రైతులకు 90శాతం రాయితీపై పరికరాలు పంపిణీ చేస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను నాబార్డు ద్వారా రుణాన్ని పొంది ఈ మొత్తానికి సర్దుబాటు చేస్తోంది. తాజాగా ఈ ఏడాది నాబార్డు రుణం విడుదల నిలిపివేయగా.. ప్రభుత్వమే ప్రత్యేక నిధులు ఇస్తామంటూ అధికారుల సమీక్షలో ప్రకటించింది. అయితే వార్షిక బడ్జెట్‌లో ఈ నిధుల ఊసెత్తకపోవడంతో పథకం అమలుకు ఇబ్బందులు తలెత్తాయి. ప్రత్యేకించి నిధులు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తే తప్ప పథకం అమలుకు ఆమోదముద్ర లభించదు. అయితే ఇప్పటికే బడ్జెట్ సమావేశాలు కూడా పూర్తికావడంతో సర్కారు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపుతుందో చూడాలి.
బిందు సేద్యం బంద్?
Published Sat, Aug 10 2013 12:47 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement