ఆశలు చిగురించేనా.. | No Developement of Sports Stadiums in Previous Government IN Srikakulam | Sakshi
Sakshi News home page

జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపైన క్రీడాకారుల ఆశలు

Published Fri, Jun 28 2019 8:55 AM | Last Updated on Fri, Jun 28 2019 8:55 AM

No Developement of Sports Stadiums in Previous Government IN Srikakulam - Sakshi

ప్రారంభమైనా పేరుకు నోచుకోని పాతపట్నం మినీ స్టేడియం

సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో నిర్మితమౌతున్న క్రీడా వికాస కేంద్రాల(కేవీకే) పనులు రెండు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనుక్కి అన్న చందంగా తయారయ్యాయి. క్రీడలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పిన గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో క్రీడాకారులకు అవసరమైన కనీస సౌకర్యాలను కల్పించలేదు. లక్షల కోట్ల వ్యయంతో కూడుకున్న ఒలింపిక్స్‌ను రాష్ట్రంలో నిర్వహించేస్తామని డాబులు కొట్టిన చంద్రబాబు అండ్‌ కో.. కనీసం రెండు కోట్ల విలువచేసే కేవీకేల నిర్మాణాలను కూడా పూర్తిచేయకపోయింది. తమ తప్పులను, మాయమాటలను ఎన్నికల ముందు కాంట్రాక్టర్లపై నెట్టేశారు. వారికి కనీస చెల్లింపులు జరపకుండా పనులను పాతరేశారు. ఇలా పాలకులు, అధికారుల నిర్లక్ష్యాలకు క్రీడాకారులు తీవ్రంగా నష్టపోయారు. 

తొలుత మినీ స్టేడియాలు.. తర్వాత కేవీకేలు
రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2014 ఎన్నికలకు ఐదు నెలల ముందు మినీ (గ్రీన్‌ఫీల్డ్‌) స్టేడియాలను తెరపైకి తీసుకొచ్చారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఒక్కొక్క స్టేడియానికి రూ.2.10 కోట్ల నిధులను కేటాయించారు. ఎన్నికలకు ముందే చాలా చోట్ల ప్రభుత్వ స్థలాల్లో టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి స్టేడియం నిర్మాణ పనులకు అప్పటి ప్రజాప్రతినిధుల చేతులమీదుగా శంకుస్థాపన చేశారు. మరికొన్ని చోట్ల విశాలమైన స్థలం, అనుకూలమైన ప్రదేశాలు లేక అధికారులు మిన్నకుండిపోయారు. అనంతరం చంద్రబాబు సర్కారు అధికారంలోకి రావడంతో సీన్‌ మారిపోయింది. 2017లో మినీ స్టేడియాల స్థానంలో క్రీడావికాస  కేంద్రాల పేరు మార్చి తెరపైకి తీసుకొచ్చారు. జిల్లాలో శ్రీకాకుళం తప్పిస్తే.. ఆమదాలవలస, పాతపట్నం, పాలకొండ (సీతంపేట), టెక్కలి నియోకజకవర్గాల పరిధిలో మినీ స్టేడియం పనులు గత ఏడాది ప్రారంభమయ్యాయి. ఆమదాలవలసలోని ఎన్టీఆర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ స్టేడియం మాత్రం 2016 నవంబర్‌ 12న ప్రారంభమైంది. మినీ స్టేడియాలను  నిర్మించి వదిలేశారు తప్పిస్తే.. అధికారుల పర్యవేక్షణ లోపిస్తుండటంతో నిరుపయోగంగా తయారయ్యాయి. పూర్తిస్థాయిలో ఇన్‌చార్జిలను నియమించలేదు. కొన్నిచోట్ల నియమించినా కాగితాలకే పరిమితం అవుతున్నారు. వారు స్థానికంగా ఉండకపోతుండటంతో ఎక్కడ గొంగళి అక్కడే చందంగా మారింది. ప్రస్తుతం మినీ స్టేడియాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. 

రూ.2 కోట్లతో కేవీకేలు..
2016 డిసెంబర్‌ 17న  శ్రీకాకుళం నగరంలో జరిగిన జిల్లాస్థాయి ఖేలో ఇండియా పోటీల ప్రారంభోత్సవానికి హాజరైన అచ్చెన్నాయుడు.. అప్పటి క్రీడల మంత్రి హోదాలో జిల్లాకు ఐదు క్రీడా వికాస కేంద్రాల(కేవీకే)ను కేటాయిస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించారు. మినీ స్టేడియాల స్థానంలో నిర్మించే కేవీకేలను జిల్లాలో రాజాం, ఎచ్చెర్ల, నరసన్నపేట, ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో కేవీకేకు రూ.2 కోట్లు చొప్పున కేటాయించారు. ఇది జరిగి ఏడాదిన్నర ముగిసిన తర్వాత టెండర్లు పిలిచి కాంట్రాక్ట్‌ పనులు కట్టబెట్టారు. 

ఇప్పటికీ పునాది స్థాయిలోనే..
ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలో రణస్థలం మండలం కొండములగాం వద్ద, రాజాం నియోజకవర్గ పరిధిలో కంచరాం వద్ద, ఇచ్ఛాపురం, పలాస, నరసన్నపేట నియోజకవర్గాల్లో మాత్రం మండల కేంద్రాల్లోనే నిర్మితమవుతున్నాయి. రణస్థలంలో మినహా మిగిలిన చోట్ల పనులు ఇప్పటికీ పునాదిస్థాయి/పిల్లర్ల దశను దాటకపోవడం శోచనీయం. రాజాంలో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లింపులు చేయకపోవడం, అధికారుల హోదాల్లో మార్పులు చోటుచేసుకోవడం, అధికారులు పర్యవేక్షణ లోపించడం తదితర కారణాల వల్ల పనులు  ముందుకు సాగడంలేదు. ఇక శ్రీకాకళం నియోజకవర్గానికి సంబంధించి కోడిరామ్మూర్తి స్టేడియం ఆధునికీకరణ పనులు జరుగుతుండటంతో గార మండల పరిధిలోని కళింగపట్నం పోర్టు సమీపంలో క్రీడామైదానంలో కేవీకే నిర్మాణం చేపట్టేందుకు శాప్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ పనులకు టెండర్లు ఇంకా ఖరారుకాలేదని అధికారులు చెబుతున్నారు. 

కొత్త సర్కారుపై కోటి ఆశలు
గత ప్రభుత్వం క్రీడలను పూర్తిగా పాతరేసింది. జిల్లా కేంద్రంలో కోడిరామ్మూర్తి స్టేడియాన్ని చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది. జిల్లా కేంద్రంలో క్రీడామైదానాలను నాశనం చేసేశారు. మినీ స్టేడియాలపై పర్యవేక్షణ లేదు. దీంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి.  సిబ్బంది పూర్తిస్థాయిలో లేరు. ఉన్న సిబ్బందికి, కోచ్‌లకు సకాలంలో జీతాలు చెల్లింపులు చేయడంలేదు. క్రీడల ఖిల్లాగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లాపై ప్రజాప్రతినిధులు, అధికారులు శీతకన్నేయడంతో క్రీడాకారులు కీలక పోటీల్లో వెనుకంజ వేస్తున్నారు. సరైన ప్రోత్సాహం, మౌలిక సదుపాయాలు లేకపోవడమే ఈ దుస్థితికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రీడాలోకమంతా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకుంది. జగనన్న న్యాయం చేస్తారని క్రీడాకారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 

త్వరలో పనులు పూర్తిచేస్తాం
ఆమదాలవలస, సీతంపేట, పాతపట్నం, టెక్కలి గ్రీన్‌ఫీల్డ్‌లను ఇదివరకే ప్రారంభించేశాం. ఇక జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం క్రీడా వికాస కేంద్రాలు గత ఏడాదే కేటాయింపు జరిగాయి. ఇటీవలి కళింగపట్నంలో కూడా అనుమతులు మంజూరు జరిగాయి. టెండర్లు పిలవాల్సి ఉంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.  ప్రస్తుతం అన్ని చోట్లా పనులు జరుగుతున్నాయి. త్వరలో పనులు పూర్తిచేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొస్తాం. 
– బి.శ్రీనివాస్‌కుమార్, డీఎస్‌డీఓ/చీఫ్‌ కోచ్, శ్రీకాకుళం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement