కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు | No future to congress said B.V. raghavulu | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు

Published Sun, Nov 17 2013 5:06 AM | Last Updated on Sat, Sep 2 2017 12:40 AM

No future to congress said B.V. raghavulu

 సత్తుపల్లి, న్యూస్‌లైన్:   కాంగ్రెస్ పార్టీపట్ల ప్రజలు ద్వేషంగా ఉన్నారని, ఇక ఆ పార్టీకి భవిష్యత్తు లేదని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి బి.వి.రాఘవులు అన్నారు. కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకతతో బలపడాలని బీజేపీ చూస్తోందని, అయితే ఆపార్టీ కూడా కేంద్రంలో సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. దీంతో కొత్తమిత్రుల కోసం వెంపర్లాడుతోందని, ఈ క్రమంలో చంద్రబాబు వంటివారితో కలిసి పనిచేయాలని చూస్తోందని అన్నారు. సత్తుపల్లిలో శుక్రవారం ‘వర్తమాన రాజకీయాలు-సీపీఎం వైఖరి’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. మతతత్వ పార్టీలవైపు వెళ్లకుండా ఉండేందుకు ఇటీవల ఢిల్లీలో ఏర్పాటు చేసిన లౌకిక పార్టీల సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును ఆహ్వానించినా రాలేదని,  బీజేపీతో కలిసి పనిచేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీకి గుజరాత్‌లో రెండువేల మంది ముస్లింలను ఊచకోత కోసిన చరిత్ర ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌పై ద్వేషంతో నరేంద్రమోడీ వైపు మొగ్గుచూపితే మరింత ప్రమాదమేనని హెచ్చరించారు. మోడీ అధికారంలోకి వస్తే విదేశీ పెట్టుబడులు దేశంలోకి స్వేచ్ఛగా ఆహ్వానించవచ్చని కార్పొరేట్ సంస్థలు ఆశిస్తున్నాయని, అందుకే అదేపనిగా మోడీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా   ప్రాంతీయ, లౌకిక పార్టీలతో కలిసి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని వివరించారు.
 భద్రాచలంపై బలమైన వాణి  వినిపించటంలేదు..  
 భద్రాచలం డివిజన్‌ను ఖమ్మం జిల్లాలోనే ఉంచాలని జీఓఎంకు తాము స్పష్టంగా చెప్పామని, ఈ విషయంలో మిగితా పార్టీలు ఢిల్లీలో బలంగా వాణి వినిపించటం లేదని అన్నారు. పోలవరం కోసమే భద్రాచలం డివిజన్‌ను అడుగుతున్నారని, ఈ ప్రాజెక్టు డిజైన్‌ను మార్చి ముంపును తగ్గించాలని సీపీఎం ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తోందని చెప్పారు. 250 ఆదివాసీ గ్రామాలను ముంచి ప్రాజెక్టు ఎక్కడ నిర్మిస్తారని ప్రశ్నించారు.
 కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, నున్నా నాగేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు తాతా భాస్కర్‌రావు, కొక్కెరపాటి పుల్లయ్య, నాయకులు మోరంపూడి పుల్లారావు, రావుల రాజబాబు, మోరంపూడి పాండు, చలమాల విఠల్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ మట్టా దయానంద్‌విజయ్‌కుమార్, నంబూరి రామలింగేశ్వరరావు, మున్సిపల్ కన్వీనర్ కోటగిరి మురళీకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement