చేవెళ్ల, మొయినాబాద్, న్యూస్‌లైన్: అతివృష్టి, అనావృష్టి.. ఏది సంభవించినా మొదటగా నష్టపోయేది రైతన్నే. పది నెలల క్రితం (జనవరి 29న) మొయినాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో భారీ వడగళ్ల వాన కురిసింది. వానకు ఆయా గ్రామాల్లోని వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. సుమారు రూ.1.26 కోట్ల పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటికీ పరిహారం మాత్రం రాలేదు. చేవెళ్ల మండలంలోని కుమ్మెర, మల్కాపూర్, గొల్లపల్లి, కమ్మెట, ధర్మాసాగర్, ఎనికెపల్లి, ఈర్లపల్లి, ముడిమ్యాల తదితర గ్రామాల్లో పంటలు అధికంగా దెబ్బతిన్నాయి. మొయినాబాద్ మండలంలోని కేతిరెడ్డిపల్లి, సజ్జన్‌పల్లి, తోలుకట్ట, మేడిపల్లి గ్రామాల్లో వరి, జొన్న, కంది, కూరగాయ, పూలు, పండ్ల తోటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ప్రాణాలొదిలిన పశువులు
వడగళ్ల వల్ల ముగజీవాలూ ప్రాణాలు వదిలా యి. ఎన్కెపల్లిలో రెండు గేదెలు, కుమ్మెరలో 150 మేకలు, గొర్రెలు రాత్రంతా వడగళ్ల కారణంగా ఏర్పడిన చలికి తట్టుకోలేక మృత్యువాత పడ్డాయి. ఇదే గ్రామంలో పౌల్ట్రీఫాంలు కూడా దెబ్బతిన్నాయి. సుమారు ఐదు వేలకు పైగా కోడిపిల్లలు, 1500 కోళ్లు మృత్యువాత పడ్డాయి.
వేల ఎకరాల్లో పంట నష్టం
మొయినాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి మండలాల్లోని సుమారు 20 గ్రామాల పరిధిలో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పెద్దపెద్ద సైజు మంచు గడ్డలు పడడంతో నష్ట తీవ్రత పెరిగింది. టమాటా, క్యారెట్, బీట్‌రూట్, జొన్న, వంకాయ, గులాబీ తదితర పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మామిడి, బత్తాయికి తీవ్ర నష్టం జరిగింది.
కాగితాల్లోనే అంచనాలు
నష్టపోయిన పంటలను అధికారులు అప్పట్లో పరిశీలించి అంచనాలు రూపొందించారు. చేవెళ్ల మండలంలో వరి, జొన్న, మొక్కజొన్న, కంది, గోధుమ, శనగ పంటలతోపాటుగా టమాటా, బీట్‌రూట్, గులాబీ, క్యాబేజీ, పుదీనా, కొత్తిమీర తదితర పంటలు దెబ్బతిన్నట్టు తేల్చారు. ఒక్క చేవెళ్ల మండలంలోనే 640 మంది రైతులకు సుమారుగా రూ. 55 లక్షలకు పైగా నష్టాన్ని అంచనా వేశారు. శంకర్‌పల్లి మండలంలో 180మంది రైతులకు రూ.8లక్షల మేరకు నష్టం జరిగిందని తేల్చారు. మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి, సజ్జన్‌పల్లి, తోలుకట్ట, మేడిపల్లి గ్రామాల్లో సుమారు 1500 ఎకరాల్లో కూరగాయ పంటలు, వెయ్యి ఎకరాల్లో పూలతోటలు, 82 ఎకరాల్లో మామిడితోటలు, 28 ఎకరాల్లో బొప్పాయి, 20 ఎకరాల్లో అరటి, 140 ఎకరాల్లో సుగంధ ద్రవ్యాల పంటలు, 12 ఎకరాల్లో వరి, 13 ఎకరాల్లో జొన్న, 75 ఎకరాల్లో మొక్కజొన్న, 54 ఎకరాల్లో కంది, 6 ఎకరాల్లో గోధుమ, 6 ఎకరాల్లో మినప పంటలు దెబ్బతిన్నట్లు ఉద్యాన శాఖ, వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. నివేదికను ప్రభుత్వానికి పంపారు. వాటితోపాటు పంటనష్టపోయిన రైతుల బ్యాంకు ఖాతా నంబర్లను సైతం అధికారులు సేకరించారు. పరిహారం నేరుగా ఖాతాల్లోనే జమవుతుందని చెప్పారు. కానీ ప్రభుత్వం నుంచి రైతులకు ఇప్పటివరకు నయాపైస పరిహారం కూడా అందలేదు.
కలెక్టర్ హామీ ఇచ్చినా..
వడగళ్ల వర్షంతో దెబ్బతిన్న పంటలను అప్పటి కలెక్టర్ వాణీప్రసాద్ పరిశీలించారు. చేవెళ్ల మండలంలోని ముడిమ్యాల, మొయినాబాద్ మండలంలోని సజ్జన్‌పల్లిలో రైతులను పరామర్శించారు. నెల రోజుల్లోనే పరిహారం అందేలా చూస్తానన్నారు. కానీ ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదు. మరోపక్క ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. 10 నెలల క్రితం నష్టపోయిన పంటలకే ఇప్పటి వరకు దిక్కులేదు.. ఇప్పుడు నష్టపోయిన పంటలకు పరిహారం ఇస్తారా అని రైతులు అనుమానపడుతున్నారు.
పది నెలలుగా ఎదురుచూస్తున్నా..
వడగళ్ల వాన కారణంగా రెండు ఎకరాల్లో వేసిన టమాటా, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. అధికారులు పరిహారం ఇస్తామని పంట ఫొటోలు, బ్యాంక్ అకౌంట్ నంబర్, సర్వేనంబర్ అన్ని తీసుకుని పోయారు. కానీ ఇప్పటికీ పరిహారం రాలేదు. పది నెలలుగా ఎదురుచూస్తూనే ఉన్నా. -వై.శంకరయ్య,
కేతిరెడ్డిపల్లి, మొయినాబాద్ మండలం
అవన్నీ నీటి మూటలే ..
రైతులను ఆదుకుంటానని ప్రభుత్వం చేసే ప్రకటనలన్నీ నీటి మూటలే. పంటలు నష్టపోతే పరిహారం అందిస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు. మళ్లీ ఇప్పుడు అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేస్తున్నారు. మొదటిదానికే గతిలేదు.. ఇప్పుడు నష్టపోయిన పంటలకు ఏం పరిహారమిస్తారు. - ఊరడి వెంకటయ్య, రైతు, తోలుకట్ట, మొయినాబాద్ మండలం
నివేదిక పంపించాం
వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనావేసి ప్రభుత్వానికి నివేదిక అందజేశాం. అందులో రైతులకు సంబంధించిన ఖాతా నంబర్లు సైతం వేశాం. పరిహారం ఎప్పుడొచ్చినా వారి ఖాతాల్లోనే జమవుతుంది. రైతులకు పరిహారం తప్పనిసరిగా వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుందనే విషయం మాత్రం కచ్చితంగా చెప్పలేం.
- దేవ్‌కుమార్, ఏడీఏ, చేవెళ్ల డివిజన్
పది నెలలైంది... పరిహారమేదీ?
Published Sat, Nov 23 2013 3:48 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement