వ్యవ‘సాయం’ బాగుంది
- ఛత్తీస్‌గఢ్ శిక్షణ ఏడీఏల కితాబు
- పలుగుట్ట గ్రామంలో పర్యటన
- రైతులకు ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాలు భేషుగ్గా ఉన్నాయని మెచ్చుకోలు
చేవెళ్ల రూరల్: తెలంగాణలో రైతులకు ప్రభుత్వ పోత్సాకాలు, సహాయ సహకారాలు బాగున్నాయని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన శిక్షణ ఏడీఏలు అన్నారు. నగరంలోని మేనేజ్ సంస్థలో రెండు వారాల పాటు శిక్షణ పొందుతున్న 35 మంది ఛత్తీస్‌గఢ్ ఏడీఏల బృందం గురువారం మండలంలోని పలుగుట్ట గ్రామంలో పర్యటించింది.
మేనేజ్ సంస్థ కోర్సు డెరైక్టర్ ఎం.ఏ కరీమ్ ఆధ్వర్యంలో వీరు రైతులతో పంటల సాగు పద్ధతులు, పాటిస్తున్న విధానాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక వ్యవసాయాధికారులు ఏడీఏ దేవ్‌కుమార్, ‘ఆత్మ’ డివిజన్ టెక్నికల్ మేనేజర్ లక్ష్మణ్‌రావు, ఏఓ భారతి, ఏఎస్‌ఎంఎస్ అనితలతో కలిసి గ్రూపులుగా ఏర్పడి రైతులతో మాట్లాడారు. వ్యవసాయ శాఖ నుంచి రైతులకు అందుతున్న సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి.
ప్రభుత్వం వ్యవసాయానికి అందిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల వివరాలను తెలుసుకున్నారు. గ్రామంలోని చాలామంది రైతులు ఉన్నారని అభిప్రాయపడ్డారు. తమ రాష్ట్రంలో రైతులు పేద స్థితిలో ఉన్నారని, కొంతమంది మంచి స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. అనంతరం వర్మీ కంపోస్టు షెడ్‌ను, వాసు అనే రైతు సాగుచేస్తున్న పాలీహౌస్ పూలను పరిశీలించారు. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం ఇక్కడ బాగుందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో అన్ని రకాలుగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకే ఇక్కడ శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో రైతులను కలిసి వారి అభిప్రాయాలను సేకరించేందుకే ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు.