
విద్యుత్ అధికారులతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం అంజద్‌బాషా
కడప కార్పొరేషన్: విద్యుత్ బిల్లులపై అపోహలను నమ్మరాదని డిప్యూటీ సీఎం అంజద్‌బాషా వినియోగదారులను కోరారు. గురువారం ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రీనివాసులు, డీఈ జగన్‌మోహన్‌రెడ్డి, ఏడీఈలు నాగమునిస్వామి, చాంద్‌బాషాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ వినియోగదారులపై ప్రభుత్వం ఎలాంటి భారం మోపలేదన్నారు. ఫిబ్రవరి బిల్లులను మామూలుగానే చెల్లించారని, మార్చి బిల్లుకు ఫిబ్రవరి తరహాలోనే చెల్లించాలన్నారు. మార్చి, ఏప్రిల్ మాసాలకు మే 8న రీడింగ్ తీశారన్నారు.
మార్చికి సంబంధించిన 22 రోజులు బిల్లును విభజించారన్నారు. 60 రోజులకు గాను 22 రోజులకు ఒకటి, 38 రోజులకు ఒక బిల్లు వచ్చాయన్నారు. రెండు బిల్లులను కలపలేదని స్పష్టంచేశారు. లాక్‌డౌన్ వల్ల గృహాలకే పరిమితం కావడంతో వినియోగం అంచనాలకు మించి పెరిగిందన్నారు. వేసవి కాలంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుందని, లాక్‌డౌన్ నేపథ్యంలో విద్యుత్ అధికంగా వాడిన వారికి ఎక్కువగా బిల్లులు వచ్చి ఉంటాయన్నారు. జూన్ 30 వరకూ బిల్లు చెల్లించవచ్చన్నారు. దానిపై వడ్డీ పడకుండా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకున్నారని తెలిపారు. విద్యుత్ శాఖ తప్పిదాలుంటే బిల్లులను సరిదిద్దుతామన్నారు.