ఉదయం 11. 40 గంటల సమయంలో అడ్మిషన్ కోసం అనంతపురం పెద్దాస్పత్రిలో బారులు తీరిన రోగులు
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నానాటికీ తీసికట్టుగా మారుతున్నాయి. మందులమాట పక్కన పెడితే కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో ఆపత్కాలంలో ఇక్కడికొచ్చే నిరుపేద రోగులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. వేలకు వేలు జీతాలు తీసుకునే వైద్యులు ఇష్టానుసారం డ్యూటీలు చేస్తుండడంతో నిరుపేదలకు హౌస్ సర్జన్‌లే దిక్కవుతున్నారు. ఇక జిల్లాలోని ఏ ఆస్పత్రిలోనూ ఎంఆర్‌ఐ, ఆల్ట్రాసౌండ్ సేవలు అందుబాటులో లేవు. మందుల కొరత పట్టిపీడిస్తుండగా..రోగులు బయట కొనుగోలు చేస్తున్నారు. అధునాతన యంత్రాలుదిష్టిబొమ్మలుగా మారడంతో రోగులంతా అప్పులు చేసి మరీ ప్రైవేటుకు పరుగులు తీస్తున్నారు.
సాక్షి, అనంతపురం న్యూసిటీ: అనంతపురంలోని సర్వజనాస్పత్రి జిల్లాకే పెద్దదిక్కుగా ఉంది. జిల్లాలోని నిరుపేదలంతా ఆరోగ్య పరంగా ఏ సమస్య వచ్చినా ఇక్కడికే పరుగుల వస్తారు. కానీ ఇక్కడ సకాలంలో వైద్యం అందక రోగులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు.
మందుల్లేవ్
ఆస్పత్రిని మందుల కొరత పట్టిపీడిస్తోంది. ఈ మూడు నెలల కాలానికి సంబంధించి 600 రకాల మందులు ఇంత వరకు సరఫరా కాలేదు. గతంలో వచ్చిన మందులతోనే కాలం నెట్టుకొస్తున్నారు. దీంతో పాటు కాటన్, సర్జికల్ గ్లౌస్ పూర్తిస్థాయిలో లేవు. దీంతో గైనిక్, సర్జికల్, మెడిసిన్, ఏఎంసీ, ఆర్థో, తదితర విభాగాల్లో రోగులు ఇబ్బంది పడుతున్నారు.
స్కానింగ్ సేవలు బంద్
ఆస్పత్రిలో 14 రోజులుగా ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ సేవలు బంద్ అయ్యాయి. అందుబాటులో ఉన్న ఒక్క రేడియాలజిస్టు లేకపోవడంతో స్కాన్ సెంటర్‌ను మూసి వేశారు. దీంతో రోజూ 50 స్కాన్ జాప్యం జరుగుతోంది.
ఎంఆర్‌ఐ ఊసే లేదు
సర్వజనాస్పత్రికి ఎంఆర్‌ఐ మంజూరైనా ఇంకా ఇన్‌స్టాల్ చేయలేదు. ఆస్పత్రిలోని రేడియాలజీ విభాగంలో ఎంఆర్‌ఐ ఏర్పాటుకి నిర్మాణ పనులు చేపట్టారు. ఎప్పటిలోపు పనులు పూర్తవుతాయో తెలియడం లేదు. అత్యవసర కేసులను మాత్రం ఆస్పత్రి యాజమాన్యం ప్రైవేట్‌గా చేయిస్తోంది.
గంటపాటు క్యూలోనే
స్ట్రెచర్‌పై ఉన్న వ్యక్తి పేరు శ్రీనివాసులు.యాడికి మండలం బోరెడ్డిపల్లి. ఛాతి నొప్పి రావడంతో కుటుంబీకులు ఉదయం 10.14 గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఎమర్జెన్సీ వార్డుకు వెళితే ఓపీకి వెళ్లమన్నారు. గంటపాటు క్యూలో నిలుచుని ఓపీ నంబర్ 15కి వెళ్లగా.. అక్కడి వైద్యురాలు పరీక్షించకుండానే ఎమర్జెన్సీకి తీసుకెళ్లమన్నారు. దీంతో కుటుంబీకులు 11.25కు మళ్లీ ఎమర్జెన్సీకి తీసుకెళ్లారు. క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ ఏఎంసీకి అడ్మిషన్ రాయగా, అడ్మిషన్ కోసం గంటల తరబడి వేచి చూశారు. చివరకు 1.25 గంటలకు ఆస్పత్రిలో అడ్మిషన్ చేశారు.
కటికనేలపైనే
నగరానికి చెందిన లక్ష్మి ఈ నెల 17 ఆస్పత్రిలో అడ్మిషన్ కాగా అబార్షన్ అయ్యింది. గైనిక్ వార్డులోనే వైద్యులు అడ్మిట్ చేశారు. మంచ లేకపోవడంతో నేలపైనే పడుకోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఆస్పత్రిలోని లేబర్, పోస్టునేటల్, మెడిసిన్, ఆర్థో, ఎంఎస్ 1, 2, ఎఫ్‌ఎస్ 1,2 వార్డుల్లో నెలకొంది. సర్వజనాస్పత్రి 500 పడకల ఆస్పత్రిగా నమోదైనా ఆ స్థాయిలో ప్రమాణాలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
పురంలో వెరీపూర్
హిందూపురం అర్బన్: జిల్లా ఆస్పత్రిగా హిందూపురంలో వైద్యసేవలు వెరీపూర్‌గా ఉన్నాయి. పేరుకు వంద పడకల ఆస్పత్రి అయినా సేవలు మాత్రం ఆ మేరకు అందడం లేదు. రోజూ 1,500 మంది దాకా ఓపీ ఉన్నప్పటికీ ఆ మేరకు వైద్యులు, సిబ్బంది లేరు. ఈ కారణంగా సకాలంలో వైద్యం అందక రోగులు అల్లాడిపోతున్నారు.
మందుల కొరత వేధిస్తుండడంతో జనం బయట కొనుగోలు చేస్తున్నారు. ఆస్పత్రిలో రేడియాలజిస్టు పోస్టు ఖాళీగా ఉండడంతో వ్యాధి నిర్ధారణ కష్టంగా మారింది. అందువల్లే ఇక్కడి వైద్యులు అన్ని రోగాలకు ఒకే రకంగా వైద్యం చేస్తున్నారు. దీంతో డిశ్చార్జి అయిన రెండు, మూడు రోజుల్లోనే జనం మళ్లీ రోగాలతో ఆస్పత్రులకు వస్తున్నారు.
మూలనపడ్డ పరికరాలు
ఆస్పత్రిలోని అక్యూట్ మెడికల్ కేర్(ఏఎంసీ), సర్జికల్, చిన్నపిల్లల వార్డులో వెంటిలేటర్లు మూలపడ్డాయి. నూతనంగా వెంటిలేటర్లు రావడంతో పాత వాటిని మరమ్మత్తులు చేయించడం లేదు. ఇక ఆర్థో, సీఎస్‌ఎస్‌డీ విభాగాల్లో ఆటోక్లేవ్ మిషన్ ఒకటి పనిచేయడం లేదు. దీంతో కాటన్ తదితర వాటిని స్టెరిలైజ్ పూర్తి స్థాయిలో చేయడం లేదని సిబ్బందే చెబుతున్నారు. నూతనంగా వచ్చిన ఆటోక్లేవ్‌లను వాడకుండా మూలకుపెట్టారు. ఏసీలు కూడా సరిగా పనిచేయడం లేదు.
హౌస్‌సర్జన్లే దిక్కు
సర్వజనాస్పత్రి రెగ్యులర్ వైద్యులు సమయపాలన పాటించడం లేదు. ఇటీవల బాధ్యతలు తీసుకున్న హౌస్‌సర్జన్లే అన్నీ చూసుకోవాల్సి వస్తోంది. సోమవారం గైనిక్, లేబర్ ఓపీలతో పాటు లేబర్ వార్డులోనూ హౌస్‌సర్జన్లే సేవలందించారు. అలాగే చిన్నపిల్లల విభాగంలోని ఎస్‌ఎన్‌సీయూలోనూ హౌస్ సర్జనే చిన్నారులను చూసి మందులు రాశారు.
అరకొర సేవలు
గుంతకల్లు: పట్టణంలోని వంద పడకల ఏరియా ఆస్పత్రి అరకొర వైద్యసేవలతో నెట్టుకొస్తోంది. గుంతకల్లు మండలంతో పాటు విడపనకల్లు, వజ్రకరూరు మండలాల వారే కాకుండా సరిహద్దులోని కర్నూలు జిల్లా మద్దికెర, చిప్పగిరి మండలాల వారంతా ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఇక్కడికే వస్తుంటారు. దీంతో రోజూ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యే రోగుల సంఖ్య 50 కిపైగానే ఉంటుంది.
గర్భిణులు అధిక సంఖ్యలో వచ్చే ఈ ఆస్పత్రిలో కనీసం కూర్చునేందుకు కుర్చీలు కూడా ఉండడం లేదు. సౌకర్యాలు కూడా అంతంతమాత్రమే. తగినంత సిబ్బంది లేక అటెండర్ల వైద్యం చేస్తున్నారు. బ్లడ్ స్టోరేజీ ఫ్రిడ్జ్ కాలిపోవడంతో రక్తం నిల్వచేయడం లేదు. దీంతో అత్యవసరంలో రక్తం అవసరమైన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రిలోని ఓ ఎక్స్‌రే మిషన్ పనిచేయకపోవడంతో జనం ప్రైవేటుకు వెళ్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment