చనిపోయినా పట్టించుకోలేదు
• అనంతపురం సర్వజనాస్పత్రిలోని టీబీ వార్డులో చికిత్స పొందుతూ మహిళ మృతి
• గంట వరకూ పట్టించుకోని వైద్య సిబ్బంది
• భయభ్రాంతులకు గురైన ఇతర రోగులు
అనంతపురం సిటీ : విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడటం అనంతపురం సర్వజనాస్పత్రి వైద్యులు, సిబ్బందికి అలవాటుగా మారిపోయింది. ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో వీరి వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన మరో సంఘటనను పరిశీలిస్తే.. స్థానిక పెద్దాస్పత్రిలోని టీబీ వార్డులో చికిత్స పొందుతూ అనంతపురం రూరల్ మండలం నారాయణరెడ్డి(ఎన్‌ఆర్) కాలనీకి చెందిన అంజినమ్మ(50) ఆదివారం రాత్రి 7 గంటలకు మృతి చెందింది.
ఆయాసంతో బాధపడుతూ రెండ్రోజుల కిందట ఆమె ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చేరిన రోజు మాత్రం పెద్ద డాక్టర్ ఒకరు ఏమైందని అడిగి చూసి వెళ్లారన్నారు. ఆ తరువాత ఎవరూ రాలేదని చెప్పారు. పైగా ఆయాసం ఎక్కువైనా సిబ్బంది పట్టించుకోలేదని ఆరోపించారు. ఇదే విషయాన్ని నర్సులకు చెబితే.. ఏం కాదులేమ్మా.. అంటూ చెప్పుకొచ్చారన్నారు. ఆదివారం కావడంతో ఏ ఒక్క డాక్టర్ ఇటువైపు తొంగి చూసిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం వరకు డాక్టర్లు ఎవరూ రారని చెప్పడంతో తామంతా ఇంటికెళ్లామని, అంతలోనే అంజినమ్మ చనిపోయిందంటూ ఫోన్ వచ్చిందని కన్నీటిపర్యంతమయ్యారు.
వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండి సకాలంలో చికిత్స చేసి ఉన్నట్లైతే ఒక నిండుప్రాణం పోయేది కాదని వాపోయారు. కాగా అంజినమ్మ మృతి చెందిన గంటకు గానీ సిబ్బంది ఎవరూ స్పందించకపోవడంతో అదే వార్డులోని ఇతర రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బంధువులు, స్థానికులు అక్కడికి చేరుకోగా, మీడియా వారు ఫొటోలు తీసి, బాధితులతో మాట్లాడుతుండడం చూసిన సిబ్బంది అప్పటికప్పుడు నానా హడావుడి చేస్తూ కనిపించారు.