
దీక్ష చేసినా...వేషాలు వేసినా విభజన తథ్యం
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దీక్ష చేసినా......లగడపాటి రాజగోపాల్ ఎన్ని వేషాలు వేసినా రాష్ట్ర విభజన తథ్యమని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు ఢిల్లీకి చేరిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంత నేతలు కూడా ఢిల్లీ బాటపట్టారు. ఈ సందర్భంగా హస్తిన చేరుకున్న గండ్ర అక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కిరణ్, లగడపాటి దగ్గర ఎలాంటి అస్త్రాలు లేవని అన్నారు. కాగా అవసరం అయినప్పుడు చివరి బ్రహ్మస్త్రాన్ని వాడతామని లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు అసెంబ్లీలో చర్చ ముగించుకుని రాష్ట్రపతికి చేరుతున్న తరుణంలో ఉభయ ప్రాంతాల నేతలు ఢిల్లీలో మోహరించారు. తెలుగుదేశం, కాంగ్రెస్‌లకు చెందిన ఇరు ప్రాంతాల నేతలు వేర్వేరుగా హస్తినకు చేరుకుంటున్నారు. 5 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావే శాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుండడంతో దానికి అనుకూలంగా, వ్యతిరేకంగా తమ వాదనలు వినిపించేందుకు ఉభయ ప్రాంతాల నేతలు సిద్ధమవుతున్నారు.