
అనాథ కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ జెండాను జిల్లాలో పట్టుకునే నాయకుడే కనిపించడం లేదు. ఇప్పటికే ముఖ్య నాయకులంతా పార్టీని వీడారు. ఇప్పుడు దిశా, నిర్దేశం లేకుండా పార్టీ ఒకటే మిగిలిపోయింది.
జిల్లాలో పార్టీ ఫిరాయిస్తున్న కాంగ్రెస్ నాయకులు
వరుస ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయలేని పరిస్థితి
కళ తప్పిన కళా వెంకట్రావు భవన్
కర్నూలు, న్యూస్‌లైన్:
కాంగ్రెస్ పార్టీ జెండాను జిల్లాలో పట్టుకునే నాయకుడే కనిపించడం లేదు. ఇప్పటికే ముఖ్య నాయకులంతా పార్టీని వీడారు. ఇప్పుడు దిశా, నిర్దేశం లేకుండా పార్టీ ఒకటే మిగిలిపోయింది. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఒక్కరే పార్టీలో ఉన్నా... వచ్చే ఎన్నికల్లో ఎలా బయట పడాలనే విషయంపైనే దృష్టి తప్ప పార్టీ పునర్ నిర్మాణంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో వరుసగా వచ్చి పడిన ఎన్నికల్లో కనీసం అభ్యర్థులను కూడా ఖరారు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రతి ఎన్నికల ముందు నాయకులు, కార్యకర్తలతో కళకళలాడే కళా వెంకట్రావు భవన్ కార్యకర్తలు రాక ప్రస్తుతం కళా విహీనంగా మారిపోయింది. ఎన్నికల కోలాహలం కనిపించడం లేదు.
పార్టీ కార్యాలయానికి వచ్చే నాయకులే లేకుండా పోయారు. తాజాగా నందికొట్కూరు ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి పచ్చ కండువా కప్పుకోగా ఆలూరు ఎమ్మెల్యే నీరజారెడ్డి కిరణ్ పార్టీకి జై చెప్పారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా పట్టుబట్టి మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టిన జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్ పిపి.నాగిరెడ్డి కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో దారి చూపే చుక్కాని లేని విధంగా కాంగ్రెస్ మిగిలిపోయింది. జిల్లాలో ఐదేళ్లపాటు మంత్రులుగా అధికారాన్ని అనుభవించిన టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి అందరికంటే ముందే పచ్చ కండువాలు కప్పుకుని మిగిలిన వారి వలసలకు మార్గం చూపారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తే ఆర్థికంగా ఆదుకునేదెవరనే ప్రశ్న బరిలోకి దిగుతున్న అభ్యర్థుల్లో తలెత్తుతోంది.
చేతులెత్తేసిన రామయ్య: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బీవై.రామయ్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ కార్యాలయానికే పరిమితమయ్యారని చర్చ జరుగుతోంది. నిన్నటి వరకు సర్వం తానై వ్యవహరించిన టీజీ వెంట, ప్రస్తుతం పెద్ద దిక్కుగా మారిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సలహాతోనే ఆయన కార్యక్రమాలు చేపట్టారు. వరుస ఎన్నికల నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాల జిల్లా నేతలు బిజీ బిజీగా గడుపుతున్నప్పటికీ బీవై.రామయ్య మాత్రం నాయకుల అనుమతి కోసం ఎదురు చూస్తూ కార్యాలయంలోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు. పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలంతా జంప్ జిలాని అంటున్నప్పటికీ వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదని తెలిసింది. మొన్నటి వరకు జిల్లా కాంగ్రెస్‌లో జోడు పదవులు అలంకరించిన మాజీ మేయర్ రఘురామిరెడ్డి కూడా మొహం చాటేశారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ జిల్లాలో నామమాత్రంగా మారిపోయే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
కార్యకర్తలూ జారుకుంటున్నారు..
జిల్లాలో ఐదు మునిసిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీలకు ఏప్రిల్ 30న పోలింగ్ జరగనుంది. 324 వార్డులకు ఆయా మునిసిపాలిటీల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కేవలం రెండు రోజుల వ్యవధి ఉన్నా ఇప్పటి వరకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కూడా జరగలేదు. అలాగే 815 ఎంపీటీసీలు, 53 జడ్పీటీసీలకు కూడా అభ్యర్థులను ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కత్తి మీద సాములా మారింది. ఈనెల 17 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారభమవుతుంది. కేవలం ఆరు రోజుల వ్యవధి ఉన్నప్పటికీ అభ్యర్థుల ఎంపికపై ఇంత వరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కసరత్తు చేయలేదు. నాయకులతో పాటు కిందిస్థాయి కార్యకర్తలు ఒక్కొక్కరు జారుకుంటుండటంతో అయోమయ పరిస్థితినెలకొంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే సరికి ఎవరు బరిలో ఉంటే వారికే బీ ఫారం ఇవ్వాలన్న ఆలోచనలో నియోజకవర్గ స్థాయి నాయకులు ఉన్నారు. గతంలో పార్టీ తరపున టికెట్ కోసం పోటీ పడిన నేతలు ప్రస్తుతం ఎన్నికల్లో మొహం చాటేస్తున్నారు. కర్నూలు నగరపాలక సంస్థకు మరో ఆరు నెలల పాటు ఎన్నికలు జరిగే పరిస్థితి లేనందున కాంగ్రెస్ పార్టీకి ఊరట కల్పించిన అంశం.