
రిటైరయ్యే ఉద్యోగుల ఆప్షన్లకు ఏపీ నో
ఏడాది లేదా రెండేళ్లలో పదవీ విరమణ చేసే ఉద్యోగుల ఆప్షన్లను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలనే నిబంధనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.
* దీనికి తెలంగాణ అంగీకరిస్తే నేడు కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు
* లేదంటే మరింత జాప్యం
హైదరాబాద్: ఏడాది లేదా రెండేళ్లలో పదవీ విరమణ చేసే ఉద్యోగుల ఆప్షన్లను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలనే నిబంధనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీకి కమలనాథన్ కమిటీ ముసాయిదా మార్గదర్శకాల విడుదలలో జాప్యం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 సంవత్సరాలకు పెంచడంతో తెలంగాణలో పనిచేస్తున్న తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల ఉద్యోగుల్లో అనేక మంది ఇప్పుడు ఏపీలో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఈ నేపథ్యంలో త్వరలో రిటైరయ్యే వారి ఆప్షన్లను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలన్న నిబంధన వద్దని ఆంధ్ర సర్కారు కోరింది. ఈ ప్రతిపాదనను మార్గదర్శకాల్లో చేర్చేందుకు కమిటీ అంగీకరించినట్లు తెలిసింది. దీంతో శుక్రవారం విడుదల కావాల్సిన ముసాయిదా మార్గదర్శకాలకు బ్రేకు పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనకు తెలంగాణ కూడా అంగీకరిస్తే మార్గదర్శకాలు శనివారం విడుదలవుతాయని, లేదంటే మరింత జాప్యమవుతుందని అధికారవర్గాలు తెలిపాయి.
కమలనాథన్ కమిటీలోని తెలంగాణ సీఎస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శుక్రవారం అందుబాటులో లేరు. శనివారం వారు అందుబాటులోకి వచ్చి ఆంధ్రా సర్కారు సూచనకు అంగీకరిస్తే మార్గదర్శకాలకు మార్గం సుగమమవుతుంది. అలాగే తాత్కాలిక కేటాయింపుల్లో తెలంగాణ ప్రభుత్వంలో పనిచేస్తూ 58 సంవత్సరాలకు పదవీ విరమణ చేసినప్పటికీ, శాశ్వత కేటాయింపులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించిన తరువాత 60 సంవత్సరాల వరకు ఉద్యోగంలోకి తీసుకుంటామని పదవీ విరమణ వయస్సు చట్ట సవరణలో పేర్కొనడం కూడా ముసాయిదా మార్గదర్శకాల జాప్యానికి దోహదపడింది.
ఉద్యోగుల శాశ్వత పంపిణీ సమయానికి పదవీ విరమణ చేసిన ఉద్యోగుల నుంచి ఆప్షన్లు ఎలా తీసుకోవాలనే సందిగ్ధత కమిటీలో నెలకొంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో అపాయింటెడ్ డే నుంచి ఉద్యోగంలో ఉన్న వారిని పంపిణీ చేయాలని స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ తాత్కాలిక కేటాయింపులో తెలంగాణకు కేటాయించిన ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు శాశ్వత కేటాయింపులోగా పదవీ విరమణ చేసి ఉంటే వారందరినీ ఆంధ్రాకు కేటాయించాల్సి వస్తుంది.
పదవీ విరమణ వయస్సు పెంపుతో ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన ఉద్యోగులు, తెలంగాణలో పని చేస్తూ ఒకటి రెండేళ్లలో పదవీ విరమణ చేసే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు కూడా ఆంధ్రాలో పనిచేయడానికి ఆప్షన్ ఇస్తారని, దీనివల్ల సమస్యలు వస్తాయని కమిటీ అభిప్రాయపడుతోంది. త్వరలో పదవీ విరమణ చేసే తెలంగాణ, ఆంధ్రా ఉద్యోగుల్లో అనేకులు తెలంగాణలో పనిచేస్తున్నారు.
వీరిలో తెలంగాణకు చెందిన చాలామంది, ఆంధ్రా వారు కూడా ఏపీ ప్రభుత్వంలో పనిచేసేందుకు వెళ్తామంటూ తెలంగాణ సర్కారుకు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు కూడా ఆంధ్రాలోనే పనిచేస్తామంటూ దరఖాస్తు చేసుకున్నారు. వీరి ఆప్షన్లను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలన్న నిబంధన వద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది.