యాత్రకు సంకెళ్లా!
► ముద్రగడ పాదయాత్రను అడ్డుకునేందుకు పాత కేసులు తెరపైకి తెస్తున్న ఏపీ సర్కారు నేడు కాకినాడ కోర్టులో
► ‘తుని ఘటన’పై 30 చార్జిషీట్లు
సాక్షి, అమరావతి: మాజీమంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చుట్టూ చంద్రబాబు సర్కారు ఉచ్చు బిగిస్తోంది. కాపు రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 26న కిర్లంపూడి నుంచి తలపెట్టిన చలో అమరావతి పాదయాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కార్ ముందస్తు కుట్రలు పన్నుతోందని ముద్రగడ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఇందుకు తుని ఘటనలో సీఐడీ నమోదు చేసిన కేసులతో సహా 30 చార్జిషీట్‌లు సిద్ధం చేసిందని తెలియవచ్చింది. ఈ కేసుల్లో ముద్రగడను ఏ–1గా చూపించి ఉద్యమంపై ఉక్కుపాదం మోపే కుట్రకు తెరతీసిందని కాపు సామాజికవర్గ నేతలు ఆరోపిస్తున్నారు.
కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ ఉద్యమబాట పట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రిజర్వేషన్ల సాధన కోసం 2016 జనవరి 31న తునిలో నిర్వహించిన కాపు ఐక్య గర్జన విధ్వంసానికి దారితీసింది. సభకు వచ్చిన వేలాది మంది తునిలో రైల్‌రోకో, రాస్తారొకోలు నిర్వహించారు. పరిస్థితి అదుపుతప్పి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దగ్ధం, తుని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు నిప్పు, పోలీస్ వాహనాలు దగ్ధం వంటి తీవ్ర ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు కొందరు విధ్వంసకారులు వచ్చి ఈ పనులు చేశారని, కాపుజాతి ఇలాంటి ఘటనలకు పాల్పడదని అప్పట్లోనే ముద్రగడ స్పష్టం చేశారు. కానీ, టీడీపీ ప్రభుత్వం ఈ ఘటనలకు రాజకీయ రంగు పులిమి కాపులతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్‌ను కూడా టార్గెట్ చేసింది. ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించగా.. వైఎస్సార్ కాంగ్రెస్ నేత భూమన కరుణాకర్‌రెడ్డితోపాటు వందలాది మంది అనుమానితుల్ని పోలీసులు ప్రశ్నించారు. సరైన ఆధారాలు లభించకపోవడంతో 13 మందిని మాత్రం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.
పలు కేసుల్లో ఏ–1గా ముద్రగడ
తుని ఘటనకు సంబంధించి మొత్తం 69 కేసులకుగాను 30 చార్జిషీట్లు సిద్ధం చేసినట్లు సమాచారం. మొదట అన్ని కేసులకు సంబంధించి ఒకే చార్జిషీటు వేయాలని పోలీసులు భావించినప్పటికీ చివరకు వేర్వేరుగా చార్జిషీటులు వేసి ముద్రగడపై ఒత్తిడి పెంచాలనే ఎత్తుగడ పన్నినట్టు తెలిసింది. వీటిలో ముద్రగడను ఏ–1గా పేర్కొన్నారు. వాటిని శుక్రవారం కాకినాడ కోర్టులో వేయనున్నారు. ఇదిలా ఉండగా కిర్లంపూడి నుంచి అమరావతికి ముద్రగడ పాదయాత్ర చేస్తే ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాపు సామాజికవర్గం పట్టుపెరుగుతుందనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం పోలీసులను ప్రయోగిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఆయన పాదయాత్రకు అనుమతిలేదంటూ హోంమంత్రి చినరాజప్ప, డీజీపీ సాంబశివరావులు ప్రకటనలు చేశారు. అయినా.. ముద్రగడ పాదయాత్రకు సిద్ధంకావడంతో ‘తుని’ కేసులను తెరపైకి తెస్తున్నట్లు సమాచారం.
హామీ అమలు చేయాలన్నందుకే..
బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని కాపులకు ఇచ్చిన హామీ అమలు చేయకపోగా అందుకోసం శాంతియుతంగా ఉద్యమిస్తోన్న కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను చంద్రబాబు సర్కార్ అణచివేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యమ సందర్భంగా అక్రమంగా పెట్టిన కేసుల్లో ముద్రగడను ఏ–1 నిందితుడిగా చూపించి కాపుల్లో ప్రభుత్వం ఒక భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆ సామాజికవర్గానికి చెందిన నాయకులు మండిపడుతున్నారు. డిమాండ్‌ల సాధన కోసం ఉద్యమానికి సిద్ధమవుతోన్న ప్రతి సారి సర్కార్ భారీగా పోలీసు బలగాలను వినియోగించి అడ్డగోలుగా ఉద్యమాన్ని నీరుగారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్‌లు కల్పించకపోగా మంజునా«థ కమిషన్ వేసి రాష్ట్రమంతటా విచారణ నిర్వహించినా ఇంతవరకు ఆ నివేదికే వెలుగుచూడలేదు.