సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు వివాదం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు సర్కారు అనూహ్యంగా కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చింది. కాపు సామాజికవర్గానికి రిజర్వేషన్ విషయమై ఏర్పాటైన మంజునాథ కమిషన్ సిఫారసులను ఆమోదిస్తున్నట్టు ప్రకటించింది. బీసీ రిజర్వేషన్‌లో ఎఫ్ కేటగిరిని సృష్టించి.. కాపులకు ఐదుశాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపింది. ఈ మేరకు కాపు రిజర్వేషన్లపై చర్చించి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. శనివారం ఉదయం జరిగిన కేబినెట్ సమావేశంలోనూ కాపు రిజర్వేషన్ అంశంపై చర్చ జరిపారు. అనంతరం అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ అంశంపై చర్చ జరిపి.. కాపులకు రిజర్వేషన్ కల్పించాల్సిందిగా కోరుతూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ కోర్టులోకి నెట్టి చేతులు దులుపుకోవాలని చంద్రబాబు సర్కారు భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అదేసమయంలో ప్రస్తుతం కుదుపుతున్న పోలవరం ప్రాజెక్టు వివాదాన్ని కూడా ఈ అంశంతో పక్కదోవ పట్టించవచ్చునని బాబు అండ్ కో భావిస్తున్నట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.
కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామన్న చంద్రబాబు మాటలను కాపు నేతలెవరూ నమ్మడం లేదు. కాపులకు ఐదుశాతం రిజర్వేషన్ అంశంపై చర్చించేందుకు శనివారం తన అనుచరులతో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సమావేశమవుతున్నారు. కేంద్రం ఆమోదానికి తీర్మానం చేసి పంపడటమంటే.. కోల్డ్‌స్టోరేజీకి పంపడమేనని ముద్రగడ అనుమానిస్తున్నారు. ఈ విషయమై సమగ్రంగా చర్చించి.. భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు.
మరోసారి చంద్రబాబు మోసం!
రిజర్వేషన్ల విషయమై కాపులను చంద్రబాబు మరోసారి మోసం చేస్తున్నారని కాపు జేఏసీ ప్రధాన కార్యదర్శి కటారి అప్పారావు ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతామని కొత్త నాటకానికి తెరలేపారని ఆయన మండిపడ్డారు. కాపు రిజర్వేషన్లపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని అన్నారు. రిజర్వేషన్లపై తీర్మానాన్ని కేంద్రానికి పంపడమంటే ఈ అంశాన్ని కోల్డ్‌స్టోరేజీలో పెట్టడమేనని విమర్శించారు. చంద్రబాబు తీరుకు వ్యతిరేకంగా మళ్లీ ఉద్యమబాట పడతామని, కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేవరకు వెనుకకు తగ్గబోమని కటారి అప్పారావు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment