
కడప అగ్రికల్చర్: వైఎస్సార్ కుటుంబం కార్యక్రమానికి జిల్లాలో విశేష స్పందన వస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి చెప్పారు. ఆదివారం సాయంత్రం కడప నగరంలోని వైఎస్సార్ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కుటుంబం ఈనెల 11,12 తేదీల్లో ప్రారంభమైందని అప్పటి నుంచి ఇప్పటి వరకు బూత్‌లెవల్‌కు వెళుతుంటే ప్రజలు పార్టీ నాయకులకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచినా తమకు ఒక్క పథకం కూడా అందలేదని ప్రజలు చెబుతుంటే బాధ వేస్తోందని అన్నారు. అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోని వచ్చారని మహిళలు, రైతులు ప్రభుత్వాన్ని, సీఎంను దుమ్మెత్తి పోస్తున్నారని చెప్పారు. ఏ ఇంటికి వెళ్లినా మాకు ఫించను తీసేశారని, రేషన్‌కార్డు తొలగించారని, మా అబ్బాయికి ఫీజు రీయింబర్స్‌మెంటు రాలేదని ఆవేదనతో చెబుతున్నారని అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో మా నాన్నకు ఆరోగ్యశ్రీతో గుండె ఆపరేషన్ పైసా ఖర్చు లేకుండా చేయించామని, మా పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంటుతో ఇంజినీరింగ్, డాక్టర్ సీట్లు వచ్చాయని, ఇంజినీరింగ్ కళాశాలలో విద్య అభ్యసిస్తుండగానే క్యాంపస్ సెలెక్షన్‌లో ఉద్యోగం వచ్చిందని చెబుతుంటే చాలా సంతోషం కలిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వం రాయలసీమకు తీరని అన్యాయం చేస్తోందని అన్నారు. కృష్ణాజలాలను తీసుకొచ్చామని చెబుతున్నారని, ఎంత తెచ్చారో రైతులకు చెప్పాలన్నారు. గండికోట జలాశయానికి కాసిన్ని నీరు తెచ్చి మేం ఇన్ని క్యూసెక్కులు తీసుకువచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని, అంతకు ముందే దివంగత సీఎం వైఎస్ హాయాంలో, కలెక్టర్ కోన శశిధర్ ఉన్న సమయంలో గండికోటకు నీరు వచ్చిందనే విషయం టీడీపీ నేతలు మరచిపోయినట్లు ఉన్నారని అన్నారు.
రాయలసీమను ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. వైఎస్ ప్రభుత్వంలో పోతిరెడ్డిపాడు వద్ద డ్యాం ఎత్తు పెంచుతుంటే ఆనాడు ఇప్పటి ఇరిగేషన్‌శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద ధర్నా చేసి ఇప్పుడు నీరు సీమకు పుష్కలంగా ఇస్తున్నామని చెప్పడాన్ని బట్టి చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని అన్నారు. వైఎస్సార్ జిల్లా రైతులు సోమశిల ప్రాజెక్టు కోసం భూములను త్యాగం చేశారని అన్నారు. అయితే ఇప్పుడు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఏవేవో అవాకులు చెవాకులు పేలుతుండడం దారుణమన్నారు. కెసీ కెనాల్‌కు సాగునీరు ఇవ్వకుండా ప్రభుత్వం దగా చేస్తోందని ఆరోపించారు. సాగునీరు ఇవ్వకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.పార్టీ నగర అధ్యక్షుడు బండి నిత్యానందరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ పులి సునీల్‌కుమార్, పార్టీ నాయకుడు అనిల్ తదితరులు పాల్గొన్నారు.