ఈనెల 20న జాతీయ రహదారుల దిగ్బంధం
గుంటూరు: ఇప్పటికే ఉద్యమ బాటలో ఉన్న సీమాంధ్ర ఉద్యోగులు సమ్మెను మరింత తీవ్రతరం చేయనున్నారు. ఆర్టీసీ బస్సులు నిలిపివేసిన సీమాంధ్ర ఉద్యోగులు.. ప్రైవేటు బస్సులను కూడా పూర్తిగా నిలిపి వేసి సమ్మెను ఉధృతం చేసేందుకు సమాయత్తంమవుతున్నారు. ఈ క్రమంలో భాగంగా ఏపీఎన్జీవో జేఏసీ శుక్రవారం విస్తృతస్థాయి నిర్వహించింది. ఈ సమావేశానికి పదమూడు జిల్లాల నుంచి ఎన్జీవోలు హాజరైయ్యారు. తిరుమలకు వెళ్లే వాహనాలను పూర్తిగా నిలిపేయాలని ఈ సమావేశంలో తీర్మానించారు. సమావేశ అనంతరం ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మీడియాకు తమ కార్యచరణను వివరించారు.
ఈ నెల 19వ తేదీన సీమాంధ్ర వ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహిస్తామని, 20 వ తేదీ నుంచి జాతీయ రహదారులను దిగ్భందిస్తామని తెలిపారు. 21 నుంచి ర్యాలీలు, సాయంత్రం కాగడాల ప్రదర్శన ఉంటుందని, 24 నుంచి 30 వరకు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. త్వరంలో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క శాఖ ఉద్యోగులు దీక్ష చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గ్రామ, మండల స్థాయి నుంచి ఉద్యమం చేయాలని నిర్ణయించామన్నారు. రాజీ నామా చేయని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు ప్రజలు కావాలో, పదవులు కావాలో తేల్చుకోవాలని ఆయన హెచ్చరించారు.