‘‘ చిత్తూరులోని ఓ ఫైనాన్స్ కంపెనీలో ఒకే వ్యక్తి 90కు పైగా ఖాతాల్లో బంగారు ఆభరణాలు కుదువపెట్టడం ఈ మధ్యకాలంలో పత్రికల్లో చదివే ఉంటారు. చుట్టుపక్కల ఉన్నవారి ఆభరణాలన్నీ ప్రైవేటు సంస్థలో కుదువపెట్టి డబ్బులు కాజేయడం, అడిగిన వారిని రౌడీలతో బెదిరించడం వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తే కంపెనీలో పనిచేసే సిబ్బంది హస్తం కూడా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని కూడా అరెస్టు చేశారు.’’
‘‘ రెండు నెలల క్రితం 5.25 కిలోల బంగారు ఆభరణాలను బెంగళూరులోని ఓ దుకాణంలో డెలివరీ ఇవ్వడానికి విశాఖ నుంచి ఇద్దరు వ్యక్తులు బస్సులో బయలుదేరారు. అదే బస్సులోనే ప్రయాణికుల అవతారంలో ఉన్న వ్యక్తులు బంగారుపాళ్యం వద్ద రూ.1.62 కోట్ల విలువ చేసే ఆభరణాలు కొట్టేశారు. తరువాత దొంగలను, ఆభరణాలను పోలీసులు సీజ్ చేశారు. అయితే ఇంతటి విలువైన వస్తువులు తీసుకెళ్లేటప్పుడు కనీసం సెక్యూరిటీ కూడా పెట్టుకోకపోవడం దుకాణ యజమాని నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తోంది.’’
చిత్తూరు అర్బన్ : బ్యాంకులు.. ఫైనాన్స్ సంస్థలు.. బంగారు ఆభరణాలు సరఫరా చేస్తే సంస్థలు.. వీటి లావాదేవీలు రూ.కోట్లలో జరుగుతుంటాయి. అయితే డబ్బులకు, సొమ్ములకు బాధ్యత వహించాల్సిన ఉద్యోగులే చాలాచోట్ల చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వివిధ అవసరాలకు ప్రజలు కుదువ పెట్టిన నగలకు భద్రత కొరవడుతోంది. జిల్లాలోని పలు జాతీయ బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థల్లో ఈ దుస్థితి నెలకొంది. ఫలితంగా జిల్లాలో గత రెండేళ్ల కాలంలో పలు ఉదంతాలు బయటపడ్డాయి. సాక్షాత్తు వీటిల్లో పనిచేసే సిబ్బంది తమ వ్యక్తిగత ఆర్థిక అవసరాలు, అప్పులు పెరగడంతో ఈ పనికి పాల్పడుతున్నారు. అంతర్గతంగా కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా బంగారాన్ని తాకట్టు పెట్టుకుని విచ్చలవిడిగా రుణాలు ఇస్తున్నారు. తాజాగా జిల్లా కేంద్రంలోని ఫైనాన్స్ కంపెనీలో వెలుగు చూసిన నకిలీ బంగారం ఉదంతమే ఇందుకు నిదర్శనం. రోల్డ్‌గోల్డ్ నగలను తాకట్టు పెట్టుకుని రుణాలు మంజూరు చేస్తున్న సంఘటనలు బయటపడుతున్నాయి.
నిబంధనలు తూచ్..
♦ చాలా బ్యాంకు శాఖల్లో నగదులో కొంత మొత్తాన్ని బయటికి తీసుకెళ్తున్నారు. తర్వాత ఎప్పుడో వారం, పది రోజులకు మళ్లీ తెచ్చి జమ చేస్తున్నారు. బ్యాంకు నగదును సొంత అవసరాలకు వినియోగించకూడదు. దీన్ని కొన్ని శాఖల్లో పట్టించుకోవడం లేదు. బ్యాంకు ప్రారంభ సమయంలో ఉన్న నగదు మూసే సమయానికి సరిపోవాలి. అయినా పట్టించుకోవడం లేదు. ఎప్పటికప్పుడు ఆడిటింగ్ జరిగితే ఇటువంటి చోటుచేసుకోవు.
♦ నగలను తాకట్టు పెట్టుకొని రుణం ఇచ్చే సమయంలోనూ ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. 14 క్యారెట్ నగలను 22 క్యారెట్‌గా చూపిస్తూ రుణాలు ఇచ్చేస్తున్నారు. నగల స్వచ్ఛతను పరిశీలించే అప్రైజర్లను పొరుగుసేవల పద్ధతిలో పెట్టుకుంటున్నాయి. దీనివల్ల వారిలో బాధ్యత ఉండడం లేదు. అక్రమాలకు పాల్పడుతున్నారు. దీంతో బంగారు ఆభరణాలపై రుణాలు తేలికగా మంజూరవుతున్నాయి.
♦ కొన్ని ప్రైవేటు బ్యాంకులైతే వ్యాపారుల పాలిట ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. నిబంధనలకు తిరోదకాలు ఇస్తున్నాయి. చెక్కుల మంజూరులో ఈ వైఖరి ప్రదర్శిస్తున్నాయి. చెక్కు భౌతికంగా ఇవ్వకుండా కేవలం దాని నంబరును చెప్పినా సంబంధిత మేనేజరు ఆమోదిస్తున్నారు. ఆనక వాటిని తెప్పించుకుంటున్నారు. లాకర్ల నిర్వహణలో ఉమ్మడి బాధ్యతను విస్మరిస్తున్నాయి. ఇక్కడ కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం లేదు. తూతూ మంత్రంగా పెట్టి వదిలేస్తున్నారు. కీలకమైన ఈ విభాగం భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.
♦ సీసీ కెమెరాల్లోని దృశ్యాలను ఎప్పటికప్పుడు చూడడం లేదు. దీనివల్ల మొగ్గలోనే మోసాన్ని అరికట్టే అవకాశాన్ని కోల్పోతున్నారు. లాకర్ల వద్ద ఉంటున్న రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా ఉండడం లేదు. సీసీ కెమెరాలు పెడితే ఖాతాదారులకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో వీటి గురించి పట్టించుకోవడం లేదు. ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు ఆర్‌బీఐ నిబంధనలకు యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. దొంగిలించిన బంగారాన్ని కూడా వీటిల్లో తాకట్టు పెడుతున్నారు. కనీసం విచారించడం లేదు. దీంతో ఇటీవల నగర పోలీసులు ప్రైవేటు సంస్థల కార్యకలాపాలపై దృష్టి సారించాయి. ఈ లోపాలను సవరించి పర్యవేక్షణ పెంచితేనే మోసాలకు అడ్డుకట్ట పడుతుంది.
కనీస భద్రత చర్యలు పాటించాలి..
బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద సెక్యూరిటీ అనేది కనీస భద్రత చర్యల్లో భాగం. ఇక లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్)ను ప్రతీ బ్యాంకులో పెట్టుకోమని చెబుతున్నాం. గతంలో బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు, బంగారు ఆభరణాల దుకాణాల నిర్వాహకులతో సెక్యూరిటీ ఆడిట్ సమావేశాలు పెట్టాం. ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా చెప్పాం. ప్రతి సంస్థ సొంతంగా కొన్ని భద్రతాపరమైన చర్యలు తీసుకుంటే నేరం జరగకుండా ముందస్తుగా నివారించవచ్చు. – విక్రాంత్ పాటిల్, ఎస్పీ, చిత్తూరు
Comments
Please login to add a commentAdd a comment