కష్టఫలమేది? | no salary for work ? | Sakshi
Sakshi News home page

కష్టఫలమేది?

Published Thu, Dec 26 2013 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM

no salary for work ?


 పిట్లం, న్యూస్‌లైన్:
 ‘‘ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాలలో పనిలేని పేదలకు పనులు కల్పిస్తున్నాం.. ఇందుకు సంబంధిం చిన కూలి డబ్బులు వారంలోగా చెల్లిస్తున్నాం’’ అంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో దానిని అమలు చేయడంలో విఫలమవుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపమే దీనికి కారణం. ఫలితంగా ఉపాధి పనులు జరిగి నెలలు గడుస్తున్నా కూలీలకు డ బ్బులు అందడం లేదు. వారు అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరిగి, తిరిగి వేసారిపోతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు పిట్లం మండలంలోని వివిధ గ్రామాలలో ఉపాధి పనులు జరిగాయి. చాలా గ్రామాలలో కూలీల కు డబ్బులు చెల్లించారు. గోద్మేగాం, రాంపూర్ కలాన్, చిన్నకొడప్‌గల్, కారేగాం, మార్దండ గ్రామాల కూలీల కు మాత్రం ఇప్పటికీ కూలి డబ్బులు అందలేదు
 
 . అప్ప టి టెక్నికల్ అసిస్టెంట్ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ సమస్య ఏర్పడింది. ఈ ఐదు గ్రామాలలో సుమారు రెండు నుంచి మూడు వారాలపాటు పనులు జరిగాయి. కూలీలకు దాదాపు 70 లక్షల రూపాయలు రావాల్సి ఉంది. అప్పుడు టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేసిన జ్ఞానేశ్వర్ పనికి సంబంధించిన మస్టర్లు సక్రమంగా నమోదు చేయలేదు. దీంతో చెల్లింపులు నిలిచిపోయాయి. చెమటోడ్చి కష్టపడి పనిచేసిన కూలీలు మాత్రం లబోదిబోమంటున్నారు. అధికారులకు ఈ విషయం గురించి ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 220 బృందాలలో ఒక్కొక్కరికీ రూ. 1600 నుంచి రూ. 2వేల వరకు రావాల్సి ఉంది. ఒక్కో బృందంలో పది నుంచి ఇరవై మంది వరకు కూలీలు ఉన్నారు.
 
 ‘ఉపాధి’ చట్టం ఏం చెబుతోంది
 ఉపాధి హామీ పథకం చట్టం పకడ్బందీగానే ఉంది. ఉపాధి పనులు చేసిన కూలీలకు 15 రోజులలో కూలీ చెల్లించాలనే నిబంధనలున్నాయి. అధికారులు వీటిని తుంగలో తొక్కారు. కూలీల ఆశలపై నీళ్లు చల్లారు. దరఖాస్తు చేసుకున్నవారికి పని కల్పించడంలో విఫలమైతే 25 శాతం కూలీ చెల్లిస్తామన్న అధికారులు, ఈ విషయంలో ఎందుకు బిల్లులు చేయడం లేదని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు పెండింగ్‌లో ఉంటే ఎలా జీవించాలని ఆవేదన చెందుతున్నారు.
 
 బాధ్యులపై చర్యలేవీ?
 అపుడు ఈ పనులను సంబంధించి మస్టర్లు తయారు చేసిన టెక్నికల్ అసిస్టెంట్ జ్ఞానేశ్వర్ ఆ తర్వాత ఉద్యోగం మానేశారు. ఈ పనులను పర్యవేక్షించాల్సిన అధికారులూ పట్టించుకోలేదు. బాధ్యులపై ఎలాంటి చర్యలూ లేవు. ఇపుడూ, అపుడూ అంటూ కాలయాపన చేస్తున్నారు తప్పితే, సమస్యను పరిష్కరించే దిశగా మాత్రం ఎవ్వరూ చొరవ చూపడం లేదు.
 డబ్బులు చెల్లిస్తం
 -అప్రీం, ఈజీఎస్ ఏపీఎం
 
 గతంలో పనిచేసిన టెక్నికల్ అసిస్టెంట్ పొరపాటుతో ఇలా జరిగింది. ఈ విషయాన్ని డ్వామా పీడీ, జిల్లా కలెక్టర్‌తోపాటు, ఈజీఎస్ రాష్ట్ర డెరైక్టర్ దృష్టికీ తీసుకెళ్లాం. త్వరలోనే కూలీలకు డబ్బులు చెల్లిస్తాం. వాళ్లకు ఇబ్బంది లేకుండా చూస్తాం.
 
 బైట పనులు చేసినా పైసలొచ్చేవి
 ‘ఉపాధి’ కూలి పైసలు తొందరగా వస్తాయనుకున్నం. పనులు జరిగి నెలలు కావస్తున్నా రావడం లేదు. దీని కంటే బయట పని చేసినా పైసలు వచ్చేవి. ఒక్క టెక్నికల్ అధికారి పొరపాటుకు మేం ఎన్ని రోజులు బాధలు భరించాలి. అధికారులు దృష్టి సారించాలి.
 - శ్రీరాముల రాములు, గౌరారం
 
 ఎప్పుడూ ఇట్ల జరగలేదు
 రాంపూర్ గ్రామ సర్పంచ్‌గా పని చేసిన నేను ఉపాధి కోసం పనులకు వెళ్లాను. గతంలో ఎన్నో పనులను చేయించినా ఇలా జరగలేదు. లేకనే కూలికి వెళ్తున్నాం. సమ యానికి డబ్బులు రాకపోతే, ఎంతమంచి పథకం ఉన్న ఏం ప్రయోజనం. ఇప్పటికైనా అధికారులు స్పందించి కూలీల డబ్బులు చెల్లించాలి.
 -సార నారాయణ, గౌరారం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement