‘‘బాబు వస్తే జాబు వస్తుందన్నారు.ప్రభుత్వ ఉద్యోగాల జాతర అన్నారు. ఏడాదికో డీఎస్సీ అన్నారు. అధికారంలోకి వచ్చాక ఆ మాట మరిచారు. తీరా చూస్తే ఉద్యోగాల్లేవ్..ఇక రెండో రాగం నిరుద్యోగ భృతిని చంద్రబాబు నాలుగున్నరేళ్ల అనంతరం అందుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు ఆంక్షలతో కంటితుడుపుగా తెరపైకి తెచ్చారు. ఇలా మాయమాటలతో నిరుద్యోగులను నిలువునా ముంచిన ఘనత సీఎం చంద్రబాబుది."
సాక్షి, కాకినాడ సిటీ: 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు అధికారంలోకి రాక ముందు ప్రకటించిన నిరుద్యోగ భృతి, అధికారం చేపట్టిన నాలుగున్నరేళ్ల తర్వాత కార్యాచరణలోకి వచ్చింది. అదీ కూడా ప్రకటించిన మేరకు రూ.రెండు వేలు కాకుండా రూ. వెయ్యికే కుదించారు. రాష్ట్రంలో కోట్లలో నిరుద్యోగులుంటే సవాలక్ష ఆంక్షలు విధించి కేవలం పది లక్షల మందికే దానిని పరిమితం చేశారు. అదీ ప్రజాసాధికార సర్వేలో నమోదైతేనే అంటూ మరో మెలిక పెట్టారు. అడ్డంకులు సృష్టించి నిరుద్యోగ యువతను నిలువునా ముంచేశాడు. ఇదంతా చూడబోతే రైతు, డ్వాక్రా రుణమాఫీలను మించిన మాయగా ఉందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువనేస్తం పేరుతో నిరుద్యోగ యువతకు రిక్తహస్తం చూపారంటున్నారు. రూ.వెయ్యి చొప్పున ఇచ్చే భృతికి సవాలక్ష ఆంక్షలు పెట్టి అర్హుల సంఖ్యను తగ్గించే చర్యలు చేపట్టారని మండిపడుతున్నారు.
జిల్లాలో పరిస్థితి ఇలా..
జిల్లాలో ప్రజాసాధికార సర్వేలో నమోదైన నిరుద్యోగుల 3.79 లక్షల మంది ఉంటే కేవలం 17,085 మందికే నిరుద్యోగ భృతి ఇవ్వడంపై చంద్రబాబు ప్రభుత్వ తీరుపై యువత మండిపడుతోంది. నిరుద్యోగ యువత నిన్ను నమ్మంబాబూ అంటూ నినదిస్తుంది..
నాలుగేళ్లుగా నిరాశే
టీడీపీ ప్రభుత్వంలో గత నాలుగేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసి నిరాశ చెందాం. ఆ ఎదురు చూపులకు ఫలితం లేకుండా పోయింది. నిరుద్యోగ భృతి కూడా నిరుద్యోగులకు రాలేదు. దీనికి భిన్నంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ప్రకటించి దానికి అనుగుణంగా భర్తీ చేస్తామనడం అభినందనీయం.
-అడ్డూరి అవ్యక్త, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు, జగన్నాథపురం కాకినాడ
ఉద్యోగ విప్లవం రావాలి
2014లో చంద్రబాబు ఇచ్చిన హామీ నమ్మి నిరుద్యోగులంతా మోసపోయాం. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఐదేళ్లుగా ఎదురు చూశాం. కానీ ఉద్యోగావకాశాలు కల్పించలేదు. ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఉద్యోగాల విప్లవం వైఎస్ జగన్‌తోనే సాధ్యం అని మేము నమ్ముతున్నాం.
జె.రవితేజ, కాకినాడ
నిలువునా ముంచిన ప్రభుత్వం
నిరుద్యోగులను ప్రభుత్వం నిలువునా ముంచింది. 2014 ఎన్నికల్లో నిరుద్యోగులను అందలం ఎక్కిస్తాం అన్నట్టుగా ప్రచార ఆర్భాటాలు చేసి గెలిచిన తరువాత వారిని విస్మరించింది. కొందరికి మాత్రమే నిరుద్యోగ భృతి ఇచ్చి నిరుద్యోగులందరినీ ఆదుకున్నట్టు ప్రచారాలు చేస్తున్నారు.
గీసాల వీరబాబు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు, కాకినాడ
ఉద్యోగావకాశాలు కల్పించలేదు
ఇంటికో ఉద్యోగం వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న మా లాంటి వారికి ఉద్యోగావకాశాలు కల్పించ లేదు. కనీసం నిరుద్యోగ భృతి కూడా మంజూరు చేయలేదు. నిరుద్యోగులకు ప్రభుత్వం చేసింది శూన్యం. కనీసం ఇప్పుడైనా యువతకు ఉపాధి అవకాశాలు చూపించే ప్రభుత్వం రావాలి.
బి. లక్ష్మీప్రసన్న, కాకినాడ
ఆశ నిరాశైంది
నేను డిగ్రీ వరకు చదివాను. చదివిన చదువుకు బయట ఎలాంటి ఉద్యోగం రాలేదు. ఉద్యోగ ప్రయత్నాలు చేసి విసిగి పోయాను. దీంతో ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతి అందుతుందని ఆశలు పెట్టుకున్నా. కానీ ప్రభుత్వం పెట్టిన షరతుల కారణంగా భృతి అందలేదు.
జే.పృథ్వీ, కాకినాడ
బాబూ నిన్ను నమ్మం
2014 ఎన్నికల్లో రైతులను, డ్వాక్రా మహిళలను రుణమాఫీ పేరిట ఏమార్చిన చంద్రబాబు నిరుద్యోగ యువతను నిరుద్యోగ భృతి పేరిట నిలువునా ముంచారు. డిగ్రీలు పూర్తి చేసిన నిరుద్యోగులు ఎంతో మంది ఐదేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూశారు. వారందరికీ రిక్తహస్తమే చూపారు. దీనికి తోడు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. నిరుద్యోగులు ఇక బాబును నమ్మే ప్రసక్తే లేదు.
– కొత్తపల్లి గిరీష్, కాకినాడ
బురిడీ కొట్టించారు
నిరుద్యోగ భృతి పేరిట చంద్రబాబు అందరినీ బురిడీ కొట్టించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీతో పాటు లక్షా యాభైవేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇది నిరుద్యోగులకు మేలు చేసే అంశం.
– జువ్వల కర్నేష్, కరప
ఎన్నికల కోసమే
తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లుగా ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వక, మరోపక్క ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేసింది. ఎన్నికలు వస్తుండడంతో ఆర్నెళ్ల నుంచి ఇస్తోంది. నిరుద్యోగ భృతికి సవాలక్ష నిబంధనలు పెట్టింది. ఎన్నో కొర్రీలు, మొదట రూ.1000 ఇచ్చి, ఇప్పుడు రూ.రెండు వేలు ఇస్తున్నారు. ఇదంతా ఎన్నికల కోసం చంద్రబాబు ఆడుతున్న డ్రామా.
– కర్రి జగన్, కాకినాడ
అంతా మోసం
నేను బీటెక్ చదివాను. ఉద్యోగాలు కల్పిస్తానని చంద్రబాబు మాటిచ్చారు. ఒక వేళ ఉద్యోగం ఇవ్వకపోతే రూ.రెండు వేలు నిరుద్యోగ భృతి ఇస్తామంటే యువత అంతా చంద్రబాబుకు ఓటు వేశారు. కానీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నికలొచ్చాయని నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. అదీ కూడా కొందరికే ఇస్తున్నారు. ఇంజనీర్లు, పీజీలు, డిగ్రీలు చేసిన వారంతా కూలి పనులు చేసుకుంటున్నారు. ఇక చంద్రబాబును మ్మరు.
బి.విజయ్, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment