సామర్లకోట (పెద్దాపురం): పెద్దాపురం నియోజకవర్గంలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. 1952లో ఆవిర్భవించి రెండు మున్సిపాలిటీలు, రెండు మండలాలు ఉన్న ఏకైక నియోజకవర్గం ఇదే. ఇక్కడ మొదటి సారి ఎన్నికలు 1955లో జరిగాయి. 2019లో జరిగే ఎన్నికలో ఓటర్ల సంఖ్య గతంలో కంటే సుమారు పది వేల వరకు పెరిగింది. ప్రస్తుతం 1,98,369 మంది ఓటర్లు పోటీలో ఉండే వారి భవిష్యత్తును నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో సంపర నియోజకవర్గంలో ఉండే ఎనిమిది గ్రామాలు పెద్దాపురం నియోజకవర్గంలో కలిశాయి. ఈ నియోజకవర్గం కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉండేది.
పెద్దాపురం నియోజవర్గంలో పాగా వేసింది వీరే..
1955లో జరిగిన మొదటి ఎన్నికల్లో పెద్దాపురానికి చెందిన సీపీఐ అభ్యర్థి దుర్వాసుల వెంకట సుబ్బారావు కేఎల్‌పీ పార్టీ అభ్యర్థి చల్లా అప్పారావుపై 1,175 ఓట్లతో విజయం సాధించారు. 1962లో కిర్లంపూడికి చెందిన పంతం పద్మనాభం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ అభ్యర్థి దుర్వాసుల వెంకటసుబ్బారావుపై 23,427 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1967లో ఇద్దరు స్థానిక అభ్యర్థులు పోటీలో ఉండగా సీపీఐ నుంచి ఉండవిల్లి నారాయణమూర్తి కాంగ్రెస్ అభ్యర్థి కొండపల్లి కృష్ణమూర్తిపై 2,304 ఓట్ల మెజార్టీతో కమ్యూనిస్టు జెండాను తిరిగి ఎగురవేశారు.1972లో కొండపల్లి కృష్ణ మూర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఉండవిల్లి నారాయణమూర్తిపై 26,848 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1978లో వుండవిల్లి నారాయణమూర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలోనికి దిగి సీపీఐ అభ్యర్థి ఏలేటి ధనయ్యపై 20,220 ఓట్ల మెజార్టీ సాధించారు. తెలుగుదేశం ఏర్పడిన తరువాత పరిస్థితులు మారి పోవడంతో కమ్యూనిస్టు పార్టీ కనుమరుగైపోయింది.
1983లో సామర్లకోటకు చెందిన బలుసు రామారావు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి గోలి రామారావుపై 29,411 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తిరిగి 1985లో జరిగిన ఎన్నికల్లోనూ బలుసు రామారావు టీడీపీ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి దుర్వాసుల సత్యనారాయణ మూర్తిపై 20,375 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1989లో పంతం పద్మనాభం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బొడ్డు భాస్కరరామారావుపై 17,889 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1994లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన బొడ్డు భాస్కరామారావు కాంగ్రెస్ అభ్యర్థి పంతం పద్మనాభంపై 12,458 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి ప్రతీకారం తీర్చుకున్నారు. 1999లో బొడ్డు భాస్కరరామారావు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పంతం గాంధీమోహన్‌పై 5,306 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2004లో తోట గోపాలకృష్ణ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బొడ్డు భాస్కరరామారావుపై 10,584 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన పంతం గాంధీమోహన్ త్రిముఖ పోటీలో టీడీపీ అభ్యర్థి బొడ్డు భాస్కరరామారావుపై 3,056 ఓట్ల మెజార్టీతో విజయం సాధిÆ చారు. 2014లో జరిగిన ఎన్నికలలో అమలాపురం నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప వైఎస్సార్ సీపీ అభ్యర్థి తోట సుబ్బారావునాయుడుపై 10,583 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి ఉప ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా పదవులు దక్కించుకు న్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో దుర్వాసుల వెంకటసుబ్బారావు, వుండవిల్లి నారాయణమూర్తి, కొండపల్లి కృష్ణమూర్తి, బలుసురామారావులు మాత్రమే స్థానికులు మిగిలిన వారు స్థానికేతరులు.
రెండు పర్యాయాలు విజయం సాధించింది వీరే..
స్థానికులైన బలుసు రామారావు రెండు పర్యాయాలు, వుండవిల్లి నారాయణమూర్తి రెండు పర్యాయాలు విజయం సాధించారు. స్థానికేతరులైన పంతం పద్మనాభం, బొడ్డు భాస్కరరామారావు రెండు పర్యాయాలు విజ యం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment