
ముద్దకు మద్దతేదీ?
మట్టిని నమ్ముకున్న రైతుకు చివరకు మట్టే మిగులుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర కూడా దక్కడంలేదు.
కామన్ వరి మద్దతు ధర: 1,310
ఇస్తున్న ధర: 900-1,000
అన్నదాత నోట్లో మట్టికొడుతున్న వ్యాపారులు
ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వకుండా దగా
మద్దతు ధర కంటే రూ. 300 నుంచి 400 తక్కువ చెల్లింపు
నిల్వ చేసుకునే సౌకర్యం లేక తడిసిపోతున్న ధాన్యం
అయినకాడికి అమ్ముకుంటున్న దైన్యం..
వ్యాపారులు, మిల్లర్ల మాయాజాలంలో రైతన్న చిత్తు
సాక్షి, హైదరాబాద్: మట్టిని నమ్ముకున్న రైతుకు చివరకు మట్టే మిగులుతోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర కూడా దక్కడంలేదు. ఓ పక్క రాష్ట్రపతి పాలన.. నిన్నమొన్నటి వరకు ఎన్నికల హడావుడి కారణంగా ప్రభుత్వ నిఘా లేకపోవడంతో దళారులు చెలరేగిపోతున్నారు. ధాన్యం కొనుగోలులో అడ్తి వ్యాపారులు, మిల్లర్ల మాయాజాలంలో రైతన్న చిత్తవుతున్నాడు. మరోవైపు ఏజెంట్లతో మార్కెట్ కమిటీ కుమ్మక్కవుతుండటంతో రైతులకు ధాన్యం నిల్వ చేసుకునే సౌకర్యం కూడా లభించడంలేదు. ఫలితంగా వర్షం వస్తే ధాన్యం తడిసిపోతోంది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనకపోవడంతో.. ఏజెంట్లు రంగప్రవేశం చేసి తక్కువ ధరకు కొంటున్నారు. రైతులు కూడా ఇక చేసేది ఏమీ లేక ఎంత వస్తే అంతకే అమ్ముకుంటున్నారు.
ధాన్యం కొనే దిక్కే లేదు: సీజన్ బాగుండడం, ప్రాజెక్టుల్లో అవసరమైన నీరు ఉండడంతో ఈ ఏడాది రబీలో పంటల సాగు గణనీయంగా పెరిగింది. సాధారణ వరి విస్తీర్ణం 35.77 లక్షల ఎకరాలు ఉండగా, ఈ ఏడాది 40.5 లక్షల ఎకరాల విస్తీర్ణం సాగులోకి వచ్చింది. అంటే, ఆ మేరకు ధాన్యం దిగుబడి కూడా పెరగనుంది. దీన్ని అంచనా వేసిన మిల్లర్లు, వ్యాపారులు.. ధరలను తగ్గించేసి రైతులను దగా చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిడి లేకపోవడం, ప్రత్యామ్నాయ కొనుగోలు వ్యవస్థ నెలకొల్పలేకపోవడంతో వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం రబీ పంటలు కోత దశకు చేరుకున్నాయి. పలు ప్రాంతాల్లో ఇప్పటికే ధాన్యం మార్కెట్‌లోకి వస్తోంది. కానీ వ్యాపారులు మద్దతు ధర కంటే రూ.300 నుంచి రూ.400 వరకు తక్కువగా చెల్లిస్తున్నారు. సాధారణ రకం ధాన్యం(కామన్ వరి) మద్దతు ధర రూ.1,310 కాగా, గ్రేడ్-ఏ ధర రూ.1,345గా ఉంది. అయితే రైతుకు రూ.900 నుంచి రూ.వెయ్యిలోపు మాత్రమే ఇస్తున్నారు. ఇదేంటని అడిగితే.. ‘ఈ ధరకైతే ఇవ్వండి, లేదా వెనక్కి తీసుకెళ్లండి’ అని వ్యాపారులు కరాఖండిగా చెబుతున్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) చెల్లించి ధాన్యం కొనుగోలు చేయడానికి ఏ మిల్లర్లు కూడా ముందుకు రావడంలేదు. దీంతో రైతన్న శ్రమకు తగిన ఫలితం దక్కడంలేదు.
రోడ్డెక్కుతున్న రైతన్న...
నాణ్యమైన ధాన్యానికి సైతం వ్యాపారులు తక్కువ ధర నిర్ణయించడంపై భగ్గుమన్న రైతులు ఇక చేసేది లేక రోడ్డెక్కుతున్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డుకు 15 వేల బస్తాల ధాన్యం వచ్చింది. అయితే తేమ సాకుతో ప్రభుత్వరంగ సంస్థలు ధాన్యం కొనుగోలు చేయలేదు. నాణ్యమైన ధాన్యానికి సైతం వ్యాపారులు.. మద్దతు ధరకంటే రూ.150 తక్కువగా నిర్ణయించారు. అంతేగాక ‘ఇష్టముంటే అమ్ముకోండి... లేదంటే వెళ్లిపొండి’ అని నిర్లక్ష్యంగా మాట్లాడడంతో రైతులు ఆగ్రహంతో మార్కెట్ కమిటీ కార్యాలయంలో అధికారులను నిర్బంధించే ప్రయత్నం చేశారు. యార్డు ఎదుట రహదారిపై బైఠాయించారు. దీంతో వ్యాపారులు కొనుగోలు ప్రారంభించి క్వింటాల్‌కు రూ.1,230 నుంచి రూ.1,250 వరకు ధర చెల్లించారు. ఇక రైతుల కళ్లాల వద్ద దళారుల దోపిడీ రోజుకు రూ.35 లక్షల వరకు ఉంటున్నట్లు సమాచారం.
మార్కెట్లో ఏం జరగాలి?
- కమీషన్ ఏజెంట్లు ఎక్కడా సరుకును బీమా చేయించడంలేదు. వాస్తవానికి గరిష్టంగా తమ వద్దకు ఏడాదికి ఎంత సరుకు వస్తుందో సగటున లెక్కించి.. ముందుగా వారు బీమా చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఎక్కడా కూడా ఏజెంట్లు బీమా చేయించుకునేలా మార్కెట్ కమిటీలు చొరవ చూపడంలేదు. ఇలా బీమా చేయించుకుంటే ఏదైనా ప్రమాదం వల్ల సరుకు నష్టపోతే కనీసం రైతులకు బీమా అయినా దక్కుతుంది.
- ఏజెంట్లు అవసరమైన మేరకు టార్పాలిన్ కవర్లు కొనేలా మార్కెట్ కమిటీ దృష్టి సారించాలి. అయితే, ఏజెంట్లతో ఈ కమిటీలు కుమ్మక్కవుతున్నాయి. ఫలితంగా మార్కెట్ యార్డుల్లో టార్పాలిన్ కవర్లు ఉండటంలేదు. దీంతో వర్షాలు వస్తే మొత్తం ధాన్యం తడిసిపోతోంది.
- ధాన్యాన్ని భద్రపరిచేందుకు మార్కెట్ కమిటీ చర్యలు తీసుకోవాలి. కానీ దీన్ని ఏమాత్రం పట్టించుకోవడంలేదు. రైతులు ఆరుబయటే ధాన్యాన్ని ఉంచుతుండటంతో వర్షం వస్తే కన్నీళ్లే మిగులుతున్నాయి.
- తడిసిన ధాన్యాన్ని మార్కెట్ కమిటీ నేరుగా కొనేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే దళారులు రంగప్రవేశం చేసి.. ధాన్యం తడిచిందనే సాకుతో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాలు ముందుగానే ప్రారంభించాలి
రొక్కం మురళి, రైతు, తిమ్మాపూర్, నిజామాబాద్
వరి కోతలు మొదలైన వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి. కోతలు మొదలైనా కొనుగోళ్లు ప్రారంభించడంలేదు. దీంతో రైతులు ధాన్యం నిల్వ చేసుకోలేక తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది.
సౌకర్యాలు కల్పించాలి
బుత్‌పురం మహిపాల్, మోర్తాడ్, నిజామాబాద్
కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు లేకపోవడం వల్ల రైతులు ధాన్యాన్ని నిల్వ చేసుకోలేకపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఒక్కచోట కాకుండా వరి ధాన్యం నిల్వలు ఎక్కువగా ఉన్నచోట ప్రారంభించాలి. అలాగే ధాన్యానికి సరిపడే సంచులు కూడా సరఫరా చేయాలి. కొనుగోలు కేంద్రాలకు అనుగుణంగా గోదాములను నిర్మించాలి. ఈ సౌకర్యాలు కల్పిస్తేనే రైతులకు మేలు జరుగుతుంది.
పంట అమ్ముకునేందుకు గిన్ని కష్టాలా
వినోద, మల్లారం, వేములవాడ మండలం, కరీంనగర్ జిల్లా
నేను ఎములాడ మార్కెట్‌కు వడ్లుదెచ్చి వారమైంది. ఇన్ని రోజుల సంది మా కుప్పల దిక్కు చూసినోళ్లు లేరు. రోజూ వడ్ల కాడ కావలి గాయాలంటే తిప్పలైతాంది. సద్ది తెచ్చుకుని తినుడు, పండుడు అయితుంది. మార్కెట్ల పందులు తిరుగుతున్నయ్. కొద్దిగ కన్నంటుకుంటే సాలు.. మొత్తం పందులు బుక్కిపోతున్నయ్. పండించిన పంటను అమ్ముకుందామన్నా గిన్ని కష్టాలా?