దిగాలు | no support price to Peanut batter | Sakshi
Sakshi News home page

దిగాలు

Published Sun, Dec 15 2013 4:15 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM

‘నాఫెడ్ ద్వారా జిల్లాలో పేరుకుపోయిన శనగ నిల్వలను కొనుగోలు చేయిస్తాం.

ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్:  ‘నాఫెడ్ ద్వారా జిల్లాలో పేరుకుపోయిన శనగ నిల్వలను కొనుగోలు చేయిస్తాం. వీలైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ 750 చొప్పున రూ 1500 ఇచ్చి అయినా రైతుకు గిట్టుబాటు ధర క్వింటాకు రూ 4500 వచ్చేలా చర్యలు తీసుకుంటాం’ ఢిల్లీలో తనను కలిసిన రాష్ట్ర రైతు సంఘం నేతలతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి ఆనందశర్మ  గత మేనెల 8న  ఇచ్చిన హామీ ఇది.
 ‘శనగలను ధర లేక రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచారు. వాటిపై రుణాలు తీసుకుని వడ్డీలు కడుతున్నారు. మార్క్‌ఫెడ్, నాఫెడ్‌ల ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి’ కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్  మే 6న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖ ఇది.
 ‘మార్క్‌ఫెడ్, నాఫెడ్‌ల ద్వారా జిల్లాలో పేరుకుపోయిన శనగ నిల్వలను రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయించాలి.   కనీస గిట్టుబాటు ధర ఇచ్చి శనగ రైతులను ఆదుకోవాలి’ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి శరద్‌పవార్‌కు 2013 అక్టోబర్ 22న రాసిన మరో లేఖ సారాంశమిది.
 కలెక్టర్, ఎంపీ, కేంద్ర మంత్రులు... ఇంతమందికి శనగ రైతు తన గోడు వెళ్లబోసుకున్నా చివరకు కలిగిన ప్రయోజనం శూన్యమే.  ఏడాదిగా జిల్లాలో శనగ నిల్వలు 15 లక్షల క్వింటాళ్లకుపైగా పేరుకుపోయి..రైతుల బాధ అంతా ఇంతా కాదు. రైతులపై పాలకులు పూర్తి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారే తప్ప ఏకోశానా ఆదుకోవాలన్న ఆలోచనే లేదు.
 2010, 11 సంవత్సరాల్లో శనగ రైతుకు ధరలు ఆశాజనకంగా ఉండటంతో 2012లో జిల్లాలో శనగ అత్యధిక విస్తీర్ణంలో సాగుచేశారు.  దాదాపు 50 వేల ఎకరాల్లో అదనంగా సాగు చేశారు. మొత్తం 21 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అప్పట్లో బోల్ట్, కాక్-2 రకాలను అత్యధికంగా సాగు చేశారు. బోల్ట్ రకం శనగలకు 2011లో సరాసరిన క్వింటా రూ 7,500 ధర పలకగా...2012లో రూ 6,700 వచ్చింది. అయినా అప్పట్లో పండించిన పంటలు 20 శాతం కూడా కొనుగోలు చేయలేదు. ఇకపోతే కాక్-2 రకం శనగలకు 2011లో సరాసరిన క్వింటా రూ 7 వేల ధర దక్కగా, 2012కు వచ్చేసరికి రూ 4,900 కు పడిపోయింది. అంతకు తగ్గించి వ్యాపారులు కొనుగోలు చేయడానికి వచ్చేసరికి గిట్టుబాటు కాకపోవడంతో రైతులు అమ్మేందుకు ఆసక్తి చూపలేదు. ఈ ఏడాది పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది.  బోల్ట్ రకం క్వింటా రూ 2,800, కాక్-2 రకం రూ 2,900 నుంచి రూ 3 వేలకు మించి కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
 గణనీయంగా తగ్గిన సాగు
 రైతుల వద్ద గత ఏడాది పండించిన శనగ నిల్వలు పేరుకుపోవడంతో జిల్లా రైతాంగం ఈ ఏడాది శనగ పంట సాగు చేయడానికి ఆసక్తి చూపలేదు. గత ఏడాది అప్పులే ఇంకా వెంటాడడంతో అవి పూడ్చుకోవడానికే రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఫలితంగా సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. జిల్లాలో రబీ సీజన్‌లో సాధారణ విస్తీర్ణం 2,32,150 ఎకరాలు. అలాంటిది నవంబర్ ఆఖరుకు కేవలం 52 వేల ఎకరాల్లో మాత్రమే శనగ వేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement