సీఎం రాజీనామా వల్ల ప్రయోజనం ఉండదు:బొత్స
హైదరాబాద్: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా వల్ల ఇప్పుడు పెద్దగా ప్రయోజనం చేకూరదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి సీడబ్యూసీ సమన్వయ కమిటీ తీర్మానం చేసినప్పుడే రాజీనామా చేసుంటే బాగుండేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామన్న సీమాంధ్ర ప్రతిపాదనలను ఆనాడు సీఎం పట్టించుకోలేదన్నారు. ప్రస్తుత తరుణంలో కార్యకర్త నుంచి సీఎం వరకూ కాంగ్రెస్ లోనే కొనసాగాలని బొత్స తెలిపారు.
ఈ మేరకు ఆయన సీఎంకు బహిరంగ లేఖను రాశారు. టీడీపీ, వైఎస్సార్ సీపీ, సీపీఎం రాష్ట్ర శాఖల అధ్యక్షులందర్నీ తమ వెంట ఢిల్లీకి తీసుకు వెళ్లి విభజనపై వైఖరి స్పష్టం చేద్దామన్నారు. ఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు వివిధ పార్టీల జాతీయ అధ్యక్షులను కలిసి విభజన ఆపాల్సిందిగా కోరదామని ఆ లేఖలో పేర్కొన్నారు.