ఎ.కే.ఆంటోని కమిటీ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజం ఉండదని రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు శనివారం స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు సహకరించిన పార్టీలు అన్ని భూస్థాపితం కాక తప్పదని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా రైల్వేకోడూరులో ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష శనివారం మూడో రోజుకు చేరుకుంది.
అయితే వైఎస్ఆర్ కడప జిల్లాలో సమైక్యవాదులు చేపట్టిన నిరసనల హోరు ఉధృతంగా సాగుతోంది. కడప నగరంలో ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రరెడ్డిలతోపాటు అదే జిల్లాలోని రాజంపేటలో స్థానిక ఎమ్మెల్యే ఆమర్నాథ్ రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షతో ఆరో రోజుకు చేరుకుంది. అలాగే కలెక్టరేట్ ఎదుట వికలాంగుల ఆమరణదీక్షతోపాటు న్యాయవాదులు, ఉపాధ్యాయులు చేపట్టిన రిలే దీక్షలు కూడా కొనసాగుతున్నాయి.