
చంద్రబాబుకు తిరుగుబాటు తప్పదు: శ్రీనివాసులు
రాష్ట్ర విభజనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ప్రజలు అసహ్యయించుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే కె. శ్రీనివాసులు అన్నారు. చంద్రబాబు యాత్రకు ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురయ్యే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు శ్రీనివాసులు ఈ ఉదయం నిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. ఈ సందర్భంగా 'సాక్షి' టీవీతో మాట్లాడారు.
రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చిన చంద్రబాబు ప్రజలకు యాత్రలో ఏమని చెబుతారని ఆయన ప్రశ్నించారు. రాజీనామా చేసి ప్రజలకు వద్దకు వెళ్లాలని సూచించారు. సీమాంధ్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన రోజునే చంద్రబాబు యాత్ర చేపట్టనుండడం శోచనీయమని అన్నారు. సమన్యాయం కోసం జగన్ తన ప్రాణాన్ని లెక్కచేయకుండా ఏడు రోజులు నిరాహారదీక్ష చేయడం గర్వకారణమని శ్రీనివాసులు అన్నారు.