చిచ్చుపెట్టేందుకే శివరామకృష్ణన్ కమిటీ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకే శివరామకృష్ణన్ కమిటీని నియమించారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రివర్గ సమావేశం అనంతరం కలెక్టర్లతో మాట్లాడుతూ ఆయనిలా అన్నారు. కేవలం అరగంటలోనే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని చంద్రబాబు చెప్పారు. నవంబర్ 2వ తేదీన నవ నిర్మాణ దీక్ష ఎందుకు చేపడుతున్నానో వివరించే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధాని కూడా లేకుండా కట్టుబట్టలతో పంపించారని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలు తగ్గించడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నా 1999లో ప్రజలు తమను మళ్లీ గెలిపించారన్నారు. దీంతో ఇక మీదట కూడా అలా జరుగుతుందనే సంకేతాలు ఇచ్చినట్లయింది. తెలంగాణ ప్రభుత్వం మనకు సహకరించే పరిస్థితి కనిపించడం లేదని, ఇంకా సెంటిమెంట్ను రాజేసే ధోరణే వారిలో కనిపిస్తుందని అన్నారు. జాన్ 2న సెలబ్రేషన్స్‌కు బదులు నవనిర్మాణ దీక్ష చేయనున్నట్లు చెప్పారు.
నిన్న మొన్నటి వరకు రాజధాని ఎంపిక విషయంలో కూడా శివరామకృష్ణన్ కమిటీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్నామని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు మాత్రం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకే కమిటీ వేశారంటున్నారు.