రెండు కళ్లు... ఎన్నో నాలుకలు | Chandrababu Doublespeak Election Promise | Sakshi
Sakshi News home page

రెండు కళ్లు... ఎన్నో నాలుకలు

Published Thu, Jun 2 2016 10:32 AM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM

రెండు కళ్లు... ఎన్నో నాలుకలు - Sakshi

రెండు కళ్లు... ఎన్నో నాలుకలు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతమంటూ పాట పాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. తన మాటలతో ఎన్నో నాలుకలున్నాయని నిరూపించుకుంటున్నారు. రాష్ట్ర విభజన అంశంలో ఆయన నాలిక మెలికలు తిరిగిన తీరే ఇందుకు నిదర్శనం. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలన పగ్గాలు చేపట్టి రెండేళ్లవుతున్నా, ఏ ఒక్క విషయంలోనూ సరైన దిశలో అడుగువేయలేక, అన్నింటిలోనూ వైఫల్యాలనే మూటగట్టుకున్న చంద్రబాబు.. ఆ వైఫల్యాల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించేందుకు ఇప్పుడు విభజన గాయాన్ని మరోసారి రేపే ప్రయత్నం చేస్తున్నారు.

విభజన పాపాన్ని వేరే వారి పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చిత్రమేమిటంటే.. ఆ విభజనకు ప్రధాన కారకుడు చంద్రబాబే. రాష్ట్ర ప్రజల మనోభావాలు, ప్రయోజనాలను పణంగా పెట్టి చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాలే పరమార్ధంగా రాష్ట్ర విభజనకు అనుకూలమంటూ పార్టీ పొలిట్‌బ్యూరోలో తీర్మానం చేసి, విభజనకు సమ్మతమేనంటూ కేంద్రానికి లేఖ కూడా రాశారు. రాష్ట్ర విభజనకు కారణమయ్యారు. తద్వారా ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టం కలిగించారు. ఆ నెపాన్ని ఇతరులపైకి నెడుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి వెళ్తే.. విభజనకు తానే కారణమని, ప్రత్యేక తెలంగాణ తన వల్లే వచ్చిందని చెబుతారు. తెలంగాణ అంశంపై  ఆయన వ్యాఖ్యలు ఇవీ..

* తెలంగాణపై మాట ఇచ్చి తప్పలేం. ఇప్పుడున్న వైఖరి నుంచి వెనక్కు వెళ్లలేం. (సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులతో చంద్రబాబు (8-8-13న)
* తెలంగాణకు అనుకూలమని రాసిన లేఖకు కట్టుబడి ఉన్నాం. 2008లో మా పార్టీ రాసిన లేఖ ఆధారంగానే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. (1-8-13లో తెలంగాణ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న అనంతరం పార్టీ నేతలతో).
*  తెలంగాణపై తేల్చేందుకు అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయాలి. ఇప్పటికే మా వైఖరి ప్రణబ్ కమిటీకి చెప్పాం.(ప్రధానికి రాసిన లేఖలో 27-09-12).
*   మా పార్టీ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిని గెలిపిస్తే ఆయనతోనే చిదంబరానికి లేఖ పంపిస్తా. ఇక్కడి నుంచే ఉద్యమం చేస్తాం. (వరంగల్ జిల్లా పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో 24-05-2012న)
తెలంగాణపై కేంద్రం సత్వర నిర్ణయం తీసుకోవాలి(2011 మే 29న మహానాడులో చేసిన తీర్మానం)
ఉత్తరప్రదేశ్ ప్రజలు విభజన వాదాన్ని అంగీకరించలేదు(2011 యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం)
* తెలంగాణ, సీమాంధ్ర రెండూ నాకు రెండు కళ్లవంటివి అని నేనెందుకంటానో తెలుసా? రెండు కళ్లంటే రెండు రాష్ట్రాలని అర్థం. (19-06-2010న కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా కార్యకర్తల సమావేశంలో).
*   తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని ఎన్నికలకు వెళ్లాం. కానీ ప్రజలు సానుకూలంగా స్పందించలేదు(15-12-09).
*    మా పార్టీ తెలంగాణకు మద్దతు పలుకుతుంది(2009 డిసెంబర్ 7న ఏపీ ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో టీడీపీ ప్రతినిధులు)
*    నేనెప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదు (కామారెడ్డి ఉప ఎన్నికల ప్రచారంలో)
*   తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ వారి అభీష్టం మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా పార్టీ నిర్ణయించింది. (2008 అక్టోబర్ 10న పొలిట్‌బ్యూరోలో చేసిన తీర్మానం)

పొలిట్ బ్యూరోలో తీర్మానం చేయించి, ప్రణబ్ కమిటీకి లేఖ రాసి..
తెలంగాణకు అనుకూలమంటూ 2008 అక్టోబర్‌లోనే టీడీపీ పొలిట్‌బ్యూరోలో తీర్మానం చేశారు. దీంతోపాటు అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్,  కేంద్రం ఏర్పాటు చేసిన ప్రణబ్ ముఖర్జీ కమిటీకి సైతం బాబు లేఖ రాశారు. ఆ తరువాత 2009 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ మహాకూటమిగా పనిచేశాయి. కేసీఆర్‌తో కలసి పలు బహిరంగ సభల్లో పాల్గొన్న చంద్రబాబు తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పారు.

రాష్ట్ర విభజనకు అనుకూలమని కేంద్రానికి లేఖ కూడా ఇచ్చామని చెప్పారు. అదే సమయంలో ఆంధ్రప్రాంతంలో మాత్రం మాట మార్చారు. తనకు రెండు ప్రాంతాలూ సమానమని, రెండు కళ్లలాంటివని ఆ ఎన్నికల సభల్లో ఏకరువు పెట్టారు. ఏ కంటికి దెబ్బ తగిలినా ఓర్చుకోలేనని, రాష్ర్టం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నానని సీమాంధ్ర ప్రజలకు చెప్పారు. అయితే, ఆ ఎన్నికల్లో మహాకూటమి ఓడిపోయింది.
 
సమన్యాయమనే సరికొత్తరాగం
మహాకూటమి ఓటమి చెందడంతో బాబు మరో రాగమందుకున్నారు. తెలంగాణ, సీమాంధ్రలో స్థానికుల మనోభావాలకు అనుగుణంగా ఉద్యమాలు చేసుకోవాల్సిందిగా పార్టీ నేతలకు సూచించారు. దీంతో తెలంగాణ నేతలు తెలంగాణ తెలుగుదేశం ఫోరం ఏర్పాటు చేశారు. ఏపీ నేతలు సమైక్యాంధ్రగా కొనసాగించాలని ఉద్యమాలు చేశారు. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి రెండు ప్రాంతాల నేతలు విడివిడి నివేదిక ఇచ్చారు. రాష్ర్ట విభజన ఖాయమని తేలాక చంద్రబాబు రెండు ప్రాంతాలకూ సమన్యాయమనే నినాదాన్ని ఎత్తుకున్నారు.

ఇరు ప్రాంతాల పెద్దలను కూర్చోబెట్టి చర్చించి విడదీయాలని సలహా ఇచ్చారు. సమన్యాయం అంటే ఏమిటని విలేకర్లు ప్రశ్నిస్తే వింత సమాధానం ఇచ్చారు. మీకు ఇద్దరు పిల్లలుంటే ఎవరిపక్షాన నిలబడతారంటూ వితండవాదంతో ఎదురు ప్రశ్నించారు. తన పరిస్థితీ అదేనన్నారు. సమన్యాయమంటూ ఢిల్లీలో నిరవధిక దీక్ష పేరుతో హడావుడి చేశారు. ఈ క్రమంలోనే విభజన జరిగిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement