
అసెంబ్లీలో ఓటింగ్ ఉండదు
అభిప్రాయ సేకరణే తెలంగాణ బిల్లుపై దిగ్విజయ్ స్పష్టీకరణ
రాష్ట్ర విభజన కోసం ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో అభిప్రాయ సేకరణే తప్ప ఓటింగ్ ఉండదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ స్పష్టంచేశారు. దీనిపై శాసనసభ్యులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చన్నారు. సభలో వ్యక్తమయ్యే అభిప్రాయాలను అనుసరించి కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని.. రాయల తెలంగాణ అంశాన్నీ పరిశీలించే అవకాశం ఉంటుందని తెలిపారు. విభజన బిల్లు కోసం అవసరమైతే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశముందని చెప్పారు. అన్ని పక్షాలతో చర్చించి నిర్ణీత కారణాలతో ప్రత్యేక సమావేశాల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతిని కోరవచ్చని పేర్కొన్నారు.
వచ్చే సాధారణ ఎన్నికల్లోగానే తెలంగాణ ఏర్పాటు అవుతుందని ఉద్ఘాటించారు. రెండు రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి వచ్చిన దిగ్విజయ్‌సింగ్ శుక్రవారం సాయంత్రం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. విభజన బిల్లుపై జాప్యం చేసే ఎత్తుగడ లతో రానున్న సాధారణ ఎన్నికల్లోగా తెలంగాణ రాదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు చెప్తున్నారన్న ప్రశ్నకు దిగ్విజయ్ స్పందిస్తూ.. ‘‘అలాంటిదేమీ ఉండదు. తెలంగాణ ముసాయిదా బిల్లు ఇప్పటికే రాష్ట్రపతి నుంచి రాష్ట్ర అసెంబ్లీకి చేరింది. దీనిపై సోమవారం సభావ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశమై చర్చకు తేదీని నిర్ణయిస్తుంది. బిల్లుపై అభిప్రాయాలకు రాష్ట్రపతి 40 రోజుల గడువు ఇచ్చారు. అంటే జనవరి 23వ తేదీలోగా అసెంబ్లీ చర్చను పూర్తిచేసి బిల్లును రాష్ట్రపతికి తిరిగి పంపాల్సిందే. చర్చలో సభ్యులు వ్యక్తంచేసే అభిప్రాయాలను అనుసరించి రాష్ట్రపతి సూచనలతో కేంద్రం తుది బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతుంది’’ అని వివరించారు. రాష్ట్ర విభజనపై తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరితో చర్చించామని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు అంగీకరించిన తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు తమ వైఖరి మార్చుకున్నాయని.. ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
విభజన సమస్యలను పరిష్కరిస్తాం: విభజన ప్రక్రియ సాఫీగా ముగుస్తుందని దిగ్విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. విభజన బిల్లుపై చర్చ సందర్భంగా అసెంబ్లీ లో అందరూ స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పుకోవచ్చన్నారు. విభజనతో తలెత్తే సమస్యలపై కేంద్రం కూలంకషంగా చర్చించిందని.. సాగునీరు, శాంతిభద్రతలు, ఉమ్మడి రాజధాని, రెండు రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కేంద్రం తగిన చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. అసెంబ్లీ నుంచి వచ్చే అభిప్రాయాలను అనుసరించి వాటిపై పరిష్కారాలను కేంద్రం చూపిస్తుందన్నారు. సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర వర్గాలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని.. ఆయా సమస్యల పరిష్కారానికి కేంద్రం కట్టుబడి ఉంటుందని చెప్పారు.
ఆర్థిక ప్యాకేజీలపై పార్టీ నేతలతో చర్చిస్తాం: హైదరాబాద్‌లో ఉన్నమాదిరిగానే సీమాంధ్రలో పలు సంస్థలు, ఇతర విభాగాలను ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రెండు రాష్ట్రాలుగా విడివడ్డాక తెలంగాణ, సీమాంధ్ర ల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెడుతుందని చెప్పారు. ఇరు ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజీలకు సంబంధించి పార్టీకి చెందిన నేతలతో చర్చిస్తామని చెప్పారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం నిధులతోనే నిర్మిస్తారని, ఇందుకు ఇరు రాష్ట్రాలతో కేంద్రం చర్చిస్తుందని వివరించారు. గోదావరి, కృష్ణా నదుల నీటి పంపిణీని ప్రత్యేక బోర్డు చూస్తుందని, ఇందులో ఇరు ప్రాంతాల ప్రతినిధులు కూడా ఉంటారని చెప్పారు. హైదరాబాద్‌లో నివసించే ప్రతి ఒక్కరి ఆస్తి, ఉద్యోగ, ఉపాధి భద్రతలకు కేంద్రం భరోసా కల్పిస్తుందన్నారు.
కిరణ్ వ్యాఖ్యలను గమనిస్తున్నాం: తెలంగాణపై సీఎం కిరణ్ చేస్తున్న వ్యాఖ్యలను తాము గమనిస్తున్నామని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. సీఎం తన అభిప్రాయాలు చెప్పుకొనేందుకు కోర్ కమిటీలో ఒక అవకాశమిచ్చామని, ఆ తరువాత సీడబ్ల్యూసీ తుది నిర్ణయం తీసుకున్నందున సీఎం సహా ప్రతి ఒక్కరూ దానికి కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టంచేశారు. ఆర్టికల్ 371డీ విషయంలో రాజ్యాంగ సవరణ చేయకతప్పదని, బిల్లులో కూడా ఇదే ఉందని సీఎం చెప్పటంపై స్పందిస్తూ.. ‘‘371డీ విషయంలో కేంద్ర న్యాయశాఖతో సహా సంబంధిత విభాగాలతో మంత్రుల బృందం చర్చించింది. అన్ని అంశాలూ పరిశీలించాకనే ముసాయిదా బిల్లును రూపొందించారు. ఏమైనా ఉంటే అసెంబ్లీలో వ్యక్తమయ్యే అభిప్రాయాలను అనుసరించి కేంద్ర కేబినెట్ తగు చర్యలు తీసుకుంటుంది’’ అని వివరించారు.
వేర్వేరు పార్టీ కమిటీలు వేస్తాం: సీమాంధ్ర, తెలంగాణలకు వేర్వేరుగా పార్టీ కమిటీలు ఏర్పాటు చేసే యోచన ఉందని.. ఇవి పీసీసీ ఆధ్వర్యంలో పనిచేస్తాయని తెలిపారు. జనవరి 31 వరకు రాష్ట్రంలో పీసీసీ ద్వారా అనేక కార్యక్రమాలను చేపట్టనున్నామన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న జె.సి.దివాకర్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు అయితే తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని ఆపార్టీ అధినేత చంద్రశేఖరరావు ఇదివరకు ప్రకటించారని దిగ్విజయ్ ఒక ప్రశ్నకు సమాధానంగా గుర్తుచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తన వైఖరిపై ఇప్పటికీ ఒక స్పష్టత లేదని.. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థంకావటం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
గవర్నర్‌తో దిగ్విజయ్ సింగ్ భేటీ
గాంధీభవన్‌కు రావడానికి ముందు దిగ్విజయ్‌సింగ్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన బిల్లు గవర్నర్ వద్దకు చేరిన నేపథ్యంలో ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు ముప్పావుగంట చర్చలు జరిగాయి. గాంధీభవన్‌లో దిగ్విజయ్‌ను కలిసిన వారిలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, సి.రామచంద్రయ్య, మాణిక్యవరప్రసాద్‌తో పాటు జాతీయ విపత్తుల నిర్వహణ మండలి వైస్ చైర్మన్ మర్రి శశిధరరెడ్డి, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి, మాజీ మంత్రులు శంకర్రావు, రెడ్యానాయక్, ఎమ్మెల్యే విజయప్రసాద్, పార్టీ సీనియర్ నేతలు మల్లు రవి, చిన్నారెడ్డి ఉన్నారు. కాగా, దిగ్విజయ్ రెండ్రోజుల పర్యటనను ముగించుకుని శుక్రవారం సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యారు.