తెలంగాణ బిల్లు అసెంబ్లీలో ఓడిపోలేదు: దిగ్విజయ్
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్ జరగలేదని...బిల్లు ఓడిపోలేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన తీర్మానంపై మాత్రమే ఓటింగ్ జరిగిందని... దాన్ని అందరూ గమనించాలని ఆయన గురువారమిక్కడ అన్నారు. విభజన బిల్లుపై ఫైటింగ్ జరగలేదని... సభ అభిప్రాయం కోసమే బిల్లు పంపామన్నారు. అసెంబ్లీలో రాజ్యాంగ ప్రక్రియ ముగిసిందని అన్నారు.
దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఓ కీలక ఘట్టం ముగిసిందని దిగ్విజయ్ అన్నారు. కేంద్ర కేబినెట్లో చర్చ అనంతరం పార్లమెంట్లో ప్రవేశపెడతామని ఆయన తెలిపారు. ఆర్టికల్-3 ప్రకారమే ముందుకు వెళతామన్నారు. అసెంబ్లీ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించిందన్నారు.
ఇరు ప్రాంతాల కాంగ్రెస్ సభ్యుల్లో పరస్పర అభిప్రాయాలు ఉన్నందున... సభలో వారి అభిప్రాయాలు స్వేచ్ఛగా వెలువరించేందుకు పార్టీ అవకాశం కల్పించిందన్నారు. వచ్చిన సవరణల్లో ఆమోదయోగ్యంగా ఉన్నవాటిని బిల్లులో చేర్చే విషయాన్ని కేబినెట్ చూసుకుంటుందన్నారు. పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తామన్న నమ్మకం ఉందని దిగ్విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.