మద్దతివ్వండి.. మంత్రులవ్వండి
ఎమ్మెల్యేలకు బిహార్ సీఎం బహిరంగంగా తాయిలాలు..
అసెంబ్లీలో నేడు బలనిరూపణ చేసుకోనున్న ముఖ్యమంత్రి మాంఝీ
జేడీయూను ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించిన స్పీకర్
మండలిలో ప్రతిపక్ష నేతగా నితీశ్‌కుమార్; నిరసన వ్యక్తం చేసిన బీజేపీ
మాంఝీకి అధికారికంగా మద్దతు ప్రకటించిన బీజేపీ
పట్నా: ‘నాకు మద్దతుగా ఓటేయండి.. కావలసిన మంత్రి పదవి దక్కించుకోండి’ మంచి సమయం మించిన దొరకదంటూ సాక్షాత్తూ బిహార్ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. గురువారం పట్నాలో జరిగిన గరీబ్ స్వాభిమాన్ సమ్మేళన్‌లో ఆయన మాట్లాడుతూ తనకు మద్దతు తెలిపేలా ప్రజలు తమ ఎమ్మెల్యేలను కోరాలన్నారు. ‘‘నాకు మద్దతు ఇవ్వాలని మీ ఎమ్మెల్యేలను కోరండి.. మంత్రి పదవుల కోసమే వారు నాకు వ్యతిరేకంగా పోవాలనుకుంటున్నట్లయితే.. నా దగ్గర కూడా ఖాళీలు చాలా ఉన్నాయి. నేను వాళ్లను మంత్రులను చేస్తాను’’ అని అన్నారు. పేదల కోసం పని చేయటమే తాను చేసిన నేరమని ఆయన అన్నారు. తాను చనిపోవటానికైనా సిద్ధమే కానీ, తల వంచేది లేదని స్పష్టం చేశారు. తాను అధికారంలోకి వచ్చిన తరువాత రెండు నెలల పాటు ఇతరుల ఆదేశాలను పాటించానని, ఆ తరువాత నిజం తెలుసుకుని ప్రజల కోసం పనిచేయడం మొదలు పెట్టానని అదే తన ప్రత్యర్థులకు కంటగింపయిందన్నారు.
ప్రతిపక్షంగా జేడీయూ..
ముఖ్యమంత్రి మాంఝీ శుక్రవారం బల నిరూపణ చేసుకోనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం కాగానే విశ్వాసపరీక్ష చేపడతారు. బుధవారం నాటి అఖిలపక్షంలో తేలని ప్రధాన ప్రతిపక్ష హోదా అంశాన్ని స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌదరీ గురువారం తేల్చేశారు. బీజేపీ స్థానంలో జేడీయూను ప్రధాన ప్రతిపక్షంగా ప్రకటించారు. ఆ పార్టీకి చెందిన విజయ్ చౌదరికి ప్రతిపక్ష నేత హోదాను కూడా కల్పించారు. సంఖ్యాబలం దృష్ట్యానే జేడీయూకి ప్రతిపక్ష హోదాను కల్పించినట్లు అసెంబ్లీ సెక్రటేరియట్ ప్రకటించింది. బుధవారం జేడీయూ బహిష్కరించిన ఏడుగురు మంత్రులకు కూడా ఆ పార్టీ గ్యాలరీలోనే సీట్లు కేటాయించారు.
ముఖ్యమంత్రి మాంఝీని జేడీయూ నుంచి బహిష్కరించిన తరువాత ఆయన్ను ఏ పార్టీకి చెందని సభ్యుడిగా స్పీకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు శాసనమండలిలో కూ డా జేడీయూకి ప్రతిపక్ష హోదా దక్కడమే కాదు నితీశ్‌కుమార్‌ను మండలిలో ప్రతిపక్ష నేతగా చైర్మన్ అవధేశ్ నారాయణ్‌సింగ్ ప్రకటించారు.
మాంఝీకి బీజేపీ దన్ను
మాంఝీ సర్కారుకు అంశాల వారీ మద్దతును ఇస్తున్నట్లుగా బీజేపీ అధికారికంగా గురువారం సాయంత్రం ప్రకటించింది. మద్దతు ఇవ్వటం అంటే ప్రభుత్వంలో చేరుతున్నట్లు కాదని బీజేపీ శాసనసభాపక్ష నేత నందకిశోర్ యాదవ్ అన్నారు. మహాదళిత్ వర్గానికి చెందిన నేత మాంఝీని జేడీయూ అత్యంత అవమానకరంగా పదవీచ్యుతుని చేసే ప్రయత్నం చేస్తోందని.. ఇంతకంటే దారుణం మరొకటి లేదని యాదవ్ అన్నారు. అదే విధంగా జేడీయూను ప్రధాన ప్రతిపక్షంగా ప్రకటించటంపైనా ఆయన మండిపడ్డారు. స్పీకర్ కార్యాలయం జేడీయూ కార్యాలయంగా మారిందని విమర్శించారు. శుక్రవారం జరిగే విశ్వాస పరీక్ష లాబీ డివిజన్ లేదా రహస్య బ్యాలెట్ ద్వారా నిర్వహించవచ్చు. ఏ పద్ధతిని అనుసరిస్తారనేది సభలోనే ప్రకటిస్తారు. కాగా గత జనవరిలో స్పీకర్ అనర్హులుగా ప్రకటించిన మాంఝీ క్యాంపులోని నలుగురు ఎమ్మెల్యేలు విశ్వాసపరీక్షలో ఓటేయటానికి అనుమతి ఇవ్వాలన్న విజ్ఞప్తిని పట్నా హైకోర్టు తిరస్కరించింది. ఇది స్పీకర్ విచక్షణాధికారాల పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. మరోవైపు తమ ఎమ్మెల్యేలను కొనేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని, మాంఝీ తరఫున ఆర్జేడీ ఎంపీ పప్పూయాదవ్ బేరసారాలు నడుపుతున్నారని జేడీయూ ఆరోపించింది.